చంద్రబాబు విజన్-2047 ఒక బూటకం

తానొక విజనరీగా చెప్పుకుందుకే ఈ నాటకం

మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజం

చంద్రబాబు సంపద సృష్టి ఒక భ్రమ

ప్రజల కొనుగోలు శక్తి పెంచే ప్రయత్నం శూన్యం

గత రెండు విజన్‌లలో చంద్రబాబు సాధించింది ఏమీలేదు

ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్లు

గతంలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు దారాదత్తం 

పీ4తో ఇప్పుడు ప్రజల ఆస్తులు ప్రైవేటుపరానికి కుట్ర

తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్

తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించిన విజన్-2047 ఒక బూటకమని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం, ప్రపంచంలోనే తాను ఒక విజనరీగా చెప్పుకునేందుకే ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ల నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలుశక్తిని పెంచకుండా, రాష్ట్రంలో తన విజన్‌తో సంపదను సృష్టిస్తానంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. 
ఇంకా ఆయన ఏమన్నారంటే...

శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా నుంచి ఎరువు తెచ్చుకున్న స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్ గురించి మాట్లాడుతూ చేసిన ప్రకటనలు ప్రజలను మభ్యపెట్టేందుకే. చంద్రబాబు నాలుగుసార్లు సీఎంగా ఉండి మూడు విజన్ డాక్యుమెంట్లను ప్రకటించారు. విజన్-2020 అని ఒకసారి, విజన్-2029 అని మరోసారి, తాజాగా విజన్-2047 అని మూడోసారి తన స్వర్ణాంధ్ర లక్ష్యాలను ఆయన చాటుతూనే ఉన్నారు. నిజంగా ఒక లక్ష్యం ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన గతంలో ప్రకటించిన విజన్‌లలో ఎన్ని సాధించారు? ఎంతమంది ప్రజల జీవితాల్లో ప్రగతిని తీసుకువచ్చారు? రాష్ట్రాన్ని ఎంత ఉన్నత స్థాయికి తెచ్చారో చెప్పాలి. గత రెండు విజన్‌లలోనూ చంద్రబాబు చేసింది ఏమిటా అని చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడమే. ఇప్పుడు తాజా విజన్‌లో పీ4 ద్వారా ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రజల ఆస్తులను కూడా ప్రైవేటువ్యక్తులకు కట్టబెట్టనున్నారు. చివరికి నడిచే రోడ్లను కూడా ప్రైవేటు వారికి అప్పగించి, టోల్ ట్యాక్స్ ద్వారా ప్రజల జేబులు ఖాళీ చేయించబోతున్నారు. 

 విద్య-వైద్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఘనుడు

చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. తన ఘనమైన విజన్‌ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళే పేదల నుంచి యూజర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించాడు. ఆయన హయాంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. విద్యారంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించారు. ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి పూర్తిగా సహకరించారు. తాను సీఎం కాదు, సీఈఓను అని పిలిపించుకునేందుకే చంద్రబాబు ఇష్టపడ్డారు. అలాగే పనిచేశారు. చివరికి చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ జీతగాడు అంటూ వామపక్షాలు ఆయనకు గొప్ప బిరుదును ఇచ్చాయి. ఎంఎస్ఎంఈ లకు బదులుగా కార్పోరేట్ సంస్థలు వస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుందని నమ్మిన నాయకుడు చంద్రబాబు. విజన్ 2020 తరువాత రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాల సంఖ్య దాదాపు 70 శాతం ఉన్నట్లు తేలింది. అంటే ఆయన విజన్ వల్ల ఎక్కడ సంపద పెరిగింది? ప్రజలు సంపన్నులు ఎందుకు కాలేకపోయారు? చంద్రబాబు విజన్ వల్ల పేదరికం పెరిగింది. హైటెక్ సిటీ, చుట్టుపక్కల భూములు ఏ విధంగా ఒక వర్గానికే ఉపయోగపడేలా చంద్రబాబు విధానాలు సహకరించాయంటూ రీసెర్చ్ స్కాలర్లు పుస్తకాలు రాశారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏమీ లేవు. 

 వ్యవసాయం దండగ అనే భావంతోనే పాలన

వ్యవసాయం దండగ అనే భావంతోనే చంద్రబాబు పాలన సాగించారు. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు రెండు కోట్ల మంది రైతులు వ్యవసాయానికి దూరమయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ అడ్డుకుంటుంటే చంద్రబాబు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన హయాంలో చెప్పుకునేందుకు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ తీసుకురాలేదు. ఇప్పుడు బనకచర్ల తన ఆలోచనల నుంచే పుట్టిందంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గతంలో ఐటీని తానే ప్రమోట్ చేశానని, హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలబెట్టానంటూ గొప్పలు చెప్పుకున్నారు. తాను లేకపోతే హైదరాబాద్‌కు ఐటీ వచ్చేదేకాదు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. మరి ముంబై, బెంగుళూరు వంటి నగరాలు ఐటీలో మనకన్నా ముందుగానే అభివృద్ధి చెందాయన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు మరిచిపోతుంటారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వల్ల దేశంలో ఎలక్ట్రానిక్ యుగం ప్రారంభమైందని, స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఫీజురీయింబర్స్‌మెంట్ వంటి పథకాల వల్ల గ్రామాల్లోంచి కూడా సాంకేతిక విద్యను చదివిన ఐటీ నిపుణులు పుట్టుకు వచ్చారనే వాస్తవాలను చంద్రబాబు అంగీకరించరు. ఆఖరికి కరోనా వల్ల ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం అవకాశం ఇస్తే, దానికి కూడా తన సూచనల వల్లే ఈ విధానంను ఐటీ సంస్థలు పాటించాయని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. 

 పొలిటికల్ గవర్నెన్స్‌ చంద్రబాబు విజనా?

పాత రాజకీయాలకు కాలం చెల్లింది, నేను కొత్త రాజకీయాలు తయారు చేస్తానంటూ విజన్ 2020లో ప్రకటించారు. అంటే జన్మభూమి కమిటీలను తీసుకురావడం, పొలిటికల్ గవర్నెన్స్‌ను తీసుకురావడమే ఆయన విజనా? స్థానిక సంస్థల్లో ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా, ఫిరాయింపులతో పదవులను కాజేయడమే ఆయన గవర్నెన్స్‌ లక్ష్యమా? ప్లెయిన్‌ స్పీచ్ అనే పుస్తకంలో ప్రభుత్వం యంత్రాంగం అవినీతిలో మునిగిపోయింది, బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవన్నీ చంద్రబాబు మరిచిపోయారా? ఇప్పుడు విజన్ 2047 గురించి బాధ్యత లేకుండా మాట్లాడారు. తన తాజా విజన్‌లో ఈ దేశం 30 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీకి వెడుతుందని పేర్కొన్నారు. ఒక సీఎంగా ఏ రకంగా దేశ జీడీపీ గురించి మాట్లాడుతున్నారు?  2047 నాటికి ప్రతి ఇంటికి 18వేల డాలర్ల ఆదాయం ఉండాలని సూచిస్తున్నారు. అంటే 2047 వరకు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఏం అడగకూడదు. చంద్రబాబును ఆయన హామీల గురించి ప్రశ్నించకూడదు. స్వర్ణాంధ్ర విజన్‌ను విజయవంతం చేసే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలి, పారిశ్రామికవేత్తలను కూడా వారే తీసుకురావాలని చంద్రబాబు సూచిస్తున్నారు. అలాంటప్పుడు దావోస్‌కు సీఎంగా ఆయన ఒక్కడే ఎందుకు వెళ్ళడం? ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్ళాలిగా? రాష్ట్రంలో 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను తీసుకువస్తాను, సంపదను సృష్టిస్తానని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆర్థిక  మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా 13 శాతం వృద్ధిరేటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నమని చెబితే, తాజాగా చంద్రబాబు 17 శాతం వృద్ధి రేటును సాధిస్తామని ఏ ప్రాతిపాదికన చెబుతున్నారు? ఇప్పటి వరకు అన్నింటిలోనూ లోటు కనిపిస్తోంది. ఇలా అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడతారా? రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ళలో 3.7 శాతం వృద్ధిరేటు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌లో 7.23 శాతం వృద్దిరేటు తక్కువగా ఉంది. సేల్స్‌ టాక్స్‌లో 6.66 శాతం వృద్ధిరేటు తక్కువగా ఉంది. క్యాపిటల్ ఇన్వేస్ట్‌మెంట్ 50.53 శాతం తగ్గింది. సంపద పెరిగిందని ఎలా చెబుతున్నారు?  

ప్రపంచానికే చంద్రబాబు దిక్సూజీ అనడం పెద్ద జోక్

ప్రపంచానికే తాను దిక్సూచీగా మారతానని విజన్ డాక్యుమెంట్‌లో ప్రకటించుకోవడం పెద్ద జోక్. గతంలో ఆయన హయాంలోనే 54 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఆయన ఏపీ ఆయిల్ సీడ్స్‌ ను కూడా ప్రైవేటువారికి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, 1.30 లక్షల ఎకరాల ఆర్టీసీ భూములను, వైయస్ జగన్ హయాంలో నిర్మించిన పోర్ట్‌లను కూడా ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. అలాగే త్రిభాషా విధానంపైన మాట్లాడుతున్న చంద్రబాబు ప్రజలు కోరుతున్న అన్ని భాషలను ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళలోకి తీసుకురాలేకపోతున్నారు?
 

Back to Top