తాడేపల్లి: రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివక్ష చూపుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీమ సాగునీటి కష్టాలను గట్టెక్కించే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పోతిరెడ్డిపాడు పైనా, నేడు రాయలసీమ ఎత్తిపోతలపైనా ఇదే తరహాలో చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రంలో తన మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోందని చెప్పుకునే చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌కు అనుమతులు తీసుకురాలేని నిస్సహాయస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... రాజ్యాంగంపైన ప్రమాణం చేసి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూడాలి. కానీ కూటమి సర్కార్‌కు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు మాత్రం కొన్ని ప్రాంతాలపై ఉద్దేశపూర్వకంగా విషం చిమ్మేలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు దశాబ్దాలుగా వెనుబాటుతో అల్లాడుతున్నాయి. ఈ పరిస్థితులను మార్చాలన్న ఉద్దేశంతో స్వర్గీయ వైయస్సార్ ఆనాడు జలయజ్ఞం ప్రారంభించి కరువు ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ, పల్నాడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ముందడుగేశారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు ఉత్తరాంధ్రకు వంశధార, మహేంద్ర తనయ ప్రాజెక్టులు, రాయలసీమకు హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇవే కాకుండా తెలంగాణకు దేవాదుల, ప్రాణహిత - చేవెళ్ల వంటి భారీ ప్రాజెక్టులను ప్రారంభించారు. కరువును పారదోలాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూసి సాగునీటి ప్రాజెక్టులకు పునాదులు వేసిన ఘనత స్వర్గీయ వైయస్‌ఆర్‌కే దక్కుతుంది. తెలంగాణ ఎదుట సాగిలపడ్డ చంద్రబాబు చంద్రబాబు హయాంలో మొదలుపెట్టి పూర్తి చేసిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా లేదు. రైతులను, వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకున్నపాపాన పోలేదు. చంద్రబాబు పాలనతో రాయలసీమ అధోగతి పాలైంది. గండికోట ప్రాజెక్టును 5 టీఎంసీలకు చంద్రబాబు కుదించేస్తే, వైయస్ జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టు సామర్థ్యాన్ని 27 టీఎంసీలకు పెంచి నీటిని నిల్వచేశారు. తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదులుతూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అనుమతి లేని ప్రాజెక్టులు నిర్మిస్తోంది. కోయలసాగర్, బీమ, నెట్టెంపాడు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులను నిర్మిస్తున్నా చంద్రబాబు నోరుమెదపడం లేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మాత్రం వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం ఎదుట సాగిలపడటం వల్లే రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 800 అడుగులకు చేరే వరకు పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టులకు నీరందించలేమని తెలిసినా పట్టించుకోవడం లేదు. గతంలో వైయస్సార్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పూర్తి చేయకపోయుంటే రాయలసీమ వాసుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. చంద్రబాబు కారణంగా నష్టపోతున్న రాయలసీమ కేంద్ర ప్రభుత్వం తన మద్దతుతోనే నడుస్తుందని చెప్పుకునే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు ఎందుకు తీసుకురాలేక పోతున్నారు? దాదాపు 50 శాతం పూర్తయిన ప్రాజెక్టును ఆగిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. చంద్రబాబుకి రాయలసీమ అభివృద్దిపై నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే, రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలనుకుంటే కేంద్రం నుంచి అనుతులు తీసుకురావడం కష్టమైన విషయమా? వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టుల పట్ల చంద్రబాబుకి ఉన్న వ్యతిరేక వైఖరి కారణంగా ఇప్పటికే ఏపీ చాలా నష్టపోయింది. దాన్ని సరిదిద్దుకునే అవకాశం దేవుడిచ్చాడు. రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ఈ ప్రాంత ప్రజల హక్కు. ఇప్పటికైనా ప్రాజెక్టును పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌కి పర్యావరణ అనుమతులు తీసుకురాలేనోడు రూ.90 వేల కోట్లు ఖర్చు చేసి పోలవరం నుంచి బనకచర్లకు నీటిని తరలిస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడానికే. ముందుగా రూ.3 నుంచి 4 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే కుందూ, జలదరాసి, హెచ్ఎన్ఎస్ఎస్ - జీఎన్ఎస్ఎస్ లింకింగ్ పనులు పూర్తి చేయాలి. ఇప్పటికే రాయలసీమకు కేటాయించిన హైకోర్టును, లా యూనివర్సీటీని తీసేశారు. ఆఖరుకి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌ను కూడా ఆపేస్తే రాయలసీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోతుంది. వైయస్ఆర్ పేరుతో రాజకీయమా? అధికారంలో ఉన్నాం కదా అని కడప జిల్లాకు దివంగత వైయస్ఆర్ పేరును తీసేసి ఉండొచ్చు కానీ, ఆయన చేసిన మంచిని మాత్రం ప్రజల నుంచి తీసేయలేరు. విద్య, వైద్య రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలతో ఎంతోమంది పేదలు లబ్ధిపొందారు. దేశంలోనే ఆరోగ్యశ్రీ పేరు మార్మోగిపోయింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన వైయస్ఆర్ పేరును ప్రజల గుండెల్లో నుంచి చెరపలేరు. హెల్త్ యూనివర్సిటీకి కూడా వైయస్సార్ పేరు తొలగించే సందర్బంలో అనుసరించిన విధానం కోట్ల మంది వైయస్ అభిమానులను మనోభావాలను గాయపరిచింది. వైయస్ఆర్ పేరున్న అక్షరాలను కాలితో తన్ని, విగ్రహాన్ని తగలబెట్టిన విధానాన్ని వైయస్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. ఇంత జరుగుతున్నా సీనియర్ రాజకీయనాయకుడినని చెప్పుకునే చంద్రబాబు కనీసం ఖండించకపోవడం దుర్మార్గం. చంద్రబాబు పాటించే విలువలకు ఈ సంఘటనే నిదర్శనం.