అనకాపల్లి : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఈ నేపథ్యంలో దుక్కి దున్ని సాగు చేసి పండించిన చెరుకుకు మంట పెట్టుకునే పరిస్థితి కూటమి పాలనలో చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో కోకొల్లలుగా వెలుగు చూస్తుండటంతో అన్నదాతల ధీనగాధలు వర్ణణాతీతంగా మారాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం కొత్తపెంట గ్రామానికి చెందిన రొంగలి వెంకట్రావు ఎకరా చెరుకు పంటకు మంగళవారం నిప్పు అంటించారు. పండించిన చెరుకు గిట్టుబాటు ధర లేక ఈ పని చేసినట్లు రైతు వాపోయాడు. ఫ్యాక్టరీకి చెరుకు పంపిన పేమెంట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలలు, సంవత్సరాల తరబడి పేమెంట్లను అందడం లేదని రైతు పేర్కొన్నారు. చెరుకును ఫ్యాక్టరీకి పంపిస్తే ఎప్పుడు క్రస్సింగ్ జరుగుతుందో తెలియడం లేదని, గిట్టుబాటు ధర లేక చెరుకు పంటకు నిప్పు అంటించానని రైతు వెంకట్రావ్ కన్నీటి గాధను వివరించారు. గతంలో 15 రోజులకు పేమెంటు ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి రైతులకు గిట్టుబాటు ధర అందించి వ్యవసాయాన్ని ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.