విద్యార్థుల భ‌విష్య‌త్ కోస‌మైనా ఫీజులు చెల్లించాలి

మండ‌లిలో వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యుల డిమాండ్‌

అమ‌రావ‌తి: విద్యార్థుల భ‌విష్య‌త్ కోస‌మైనా పెండింగ్ ఫీజులు చెల్లించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ఇవాళ శాస‌న‌ మండ‌లిలో వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. రూ.3,169 కోట్లు ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నట్టు మంత్రి బాల వీరంజనేయ స్వామి వెల్ల‌డించ‌డ‌తో వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యులు  ఆగ్రహం చేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి స‌భ‌లో మాట్లాడుతూ..రూ. 4200 కోట్ల ఫీజులు,  రూ.2000 కోట్ల వసతి దీవెన బకాయిలు ఉన్నాయ‌ని చెప్పారు.  పీజీ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌  ఇస్తామని హామీ ఇచ్చి..ఇప్పటి వరకూ ఇవ్వలేద‌ని త‌ప్పుప‌ట్టారు.  

వసతి దీవెన మొదలు పెట్టిందే వైయ‌స్ జగనే: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి  
వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో విద్యార్థులకు మేలు చేసేలా నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌స‌తి దీవెన మొద‌లుపెట్టార‌ని ఎమ్మెల్యే వ‌రుదు క‌ళ్యాణి తెలిపారు. వైయ‌స్ జగన్ గతంలో తల్లుల ఖాతాల్లో ఫీజులు వేశార‌ని, దీంతో కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు ఉండేద‌న్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన రూ.1778 కోట్ల బకాయిలను వైయ‌స్ జగన్ చెల్లించార‌ని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడం అన్యాయమ‌న్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మానవతా దృక్పథంతో ప్రభుత్వం చెల్లించాల‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు.

విద్యార్థుల చ‌దువుల‌కు ఇబ్బంది:  ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తారెడ్డి
స‌కాలంలో ప్ర‌భుత్వం ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ చెల్లించ‌క‌పోవ‌డంతో విద్యార్థుల చ‌దువుల‌కు ఇబ్బంది క‌లుగుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తారెడ్డి తెలిపారు. ఇవాళ మండ‌లిలో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌పై ఆమె ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో నిల‌దీశారు. విద్యార్థుల‌కు మొత్తం ఫీజు రియింబర్స్‌మెంట్‌ చేస్తారా?..హాజరు సీలింగ్ ఏమైనా పెడతారా? అంటూ ప్ర‌శ్నించారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేద పిల్లల కోసం ఫీజు రియింబర్స్‌మెంట్‌ తెచ్చార‌ని, ఉన్నత చదువులు అందించార‌ని గుర్తు చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం ఇప్పుడు ఫీజులు బకాయిలు పెట్ట‌డంతో పేద‌ల‌ చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయ‌ని క‌ల్ప‌ల‌తారెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Back to Top