రాయలసీమ ద్రోహి చంద్ర‌బాబు 

వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు పి.ర‌వీంద్రనాథ్‌రెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా:  రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను త‌న స్వార్థం కోసం తాక‌ట్టుపెట్టిన ద్రోహి చంద్రబాబు అంటూ  వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు పి.ర‌వీంద్రనాథ్‌రెడ్డి మండిప‌డ్డారు. క‌డ‌ప న‌గ‌రంలో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా వర్షాలు పడవ‌న్నారు. ఆయనకు రాయలసీమపై ఏమాత్రం చిత్తశుద్ధి లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబు గత పాలనలోనే తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు కట్టింద‌ని గుర్తు చేశారు. అప్పట్లో చంద్రబాబు ఓటుకు నోటు కేసు వల్ల ఒక్క మాట మాట్లాడలేద‌ని ఆక్షేపించారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 800 అడుగుల్లోనే నీటిని వాడుకుంటుంద‌ని, కర్ణాటకలో ప్రాజెక్టులు కడుతున్నా ఆ నాడు చంద్రబాబు పట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు అస‌మ‌ర్ధ‌త కార‌ణంగా కేవలం 50 రోజుల్లోనే రాయలసీమ రిజర్వాయర్లను నింపుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందుకే వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచార‌ని తెలిపారు. వైయస్ జగన్ వచ్చిన తర్వాత సీమ ప్రయోజనాలను కాంక్షిస్తూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు శ్రీ‌కారం చుట్టిన‌ట్లు చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్‌కు పేరు వ‌స్తుంద‌న్న ఈర్షా ఆసుయ‌తో చంద్ర‌బాబు దీన్ని నిర్మించకుండా తెలంగాణలోని టిడిపి రైతులతో గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయించాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని అటకెక్కించేందుకు కుట్ర చేస్తుంద‌న్నారు.  రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల కోసం ఈ ప్రాంత ప్ర‌జ‌లతో క‌లిసి ఉద్య‌మిస్తామ‌ని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి హెచ్చ‌రించారు. మీడియా స‌మావేశంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, నాయ‌కులు ఇలియాస్, వెంకటేశ్వర్లు, గుంటి నాగేంద్ర, శ్రీరంజన్ పాల్గొన్నారు.

Back to Top