

















సీమరైతుల కన్నీటి కష్టాలకు చంద్రబాబు అసమర్థతే కారణం
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం
నెల్లూరు వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి
కేంద్ర సంస్థల ముందు నీటిహక్కులపై వాదనలను వినిపించడంలో విఫలం
చంద్రబాబు చేతకానితనం రాయలసీమ ఎత్తిపోతల పాలిట శాపం
తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్‌లపై నోరెత్తలేని నిస్సహాయత
మండిపడ్డ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి
నెల్లూరు: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సీఎంగా వైయస్ జగన్ శ్రీకారం చుడితే, చంద్రబాబు సమాధి కడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు.సీమ రైతుల కన్నీటి కష్టాలకు చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి పంపకాల వ్యవహారంలో ఏపీకి కళ్ళముందే అన్యాయం జరుగుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని అసమర్థుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. నెల్లూరు వైయస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాకాణి గోవర్దన్‌రెడ్డి ఏమన్నారంటే...
చంద్రబాబు ఎప్పుడు సీఎంగా తీసుకుంటున్న నిర్ణయాలు రాయలసీమ రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. వైయస్ జగన్ సీఎంగా ఉండగా రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు సాగునీరు, తాగు నీరు అందించాలనే ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. నేడు చంద్రబాబు దానిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. రాయలసీమ రైతులపై కక్ష తీర్చుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు తాను రాయలసీమ నుంచి వచ్చానని, 15 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకోవడమే తప్ప, సీమ రైతాంగానికి మేలు చేసే చర్య ఒక్కటీ కూడా చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నించడం లేదు.
రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు
రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో వైయస్ జగన్‌కి మంచిపేరొస్తుందనే ఈర్షాద్వేషాలతో చంద్రబాబు రగిలిపోతున్నారు. పోలవరం, ఆల్మట్టి, ప్రాజెక్ట్‌ల విషయంలోనూ ఇలాగే రాజీ పడి రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేశాడు. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్నది లక్ష్యం. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంను అడ్డుకునేందుకు చంద్రబాబు అడుగుడుగునా కుట్రలకు పాల్పడ్డాడు. ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఎత్తిపోతల పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు అవసరాలను సరిగ్గా వివరించక పోవడం, మొదటి నుంచి ప్రాజెక్ట్‌పై వ్యతిరేకతతో ఉన్న చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా పనులు నిలిపివేయడంతో పాటు అక్కడి పరిస్థితిని పూర్వ స్థితికి తేవాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ గతనెల 27న ఆదేశించింది.
ప్రశ్నార్థకంగా మారిన రాయలసీమ ఎత్తిపోతల పథకం
10 నెలల చంద్రబాబు పాలనలో రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. మనకు హక్కుగా కేటాయించిన 44 వేల క్యూసెక్కుల నీటిని వాడుకుంటున్నామని ఈఏసీ ఎదుట సమర్థంగా వాదనలు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 798 అడుగుల్లోనే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తోడేస్తోంది. 800 అడుగులకు చేరగానే సాగుకు నీటిని విడుదల చేసుకుంటున్నారు. అయినా కూడా చంద్రబాబు ప్రభుత్వం దీనిపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా చోద్యం చూస్తూ కూర్చుంది. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచే ఏపీ వాటాకు దక్కాల్సిన నీటిని కూడా తెలంగాణకు యథేచ్ఛగా వినియోగంచుకుంటూ వస్తోంది. ప్రారంభంలోనే దీనిని అడ్డుకునేందుకు ఆనాటి చంద్రబాబు సర్కార్ గట్టిగా ప్రయత్నించి ఉంటే నేడు ఇటువంటి దుస్థితి ఏర్పడేది కాదు. చంద్రబాబు చేతకానితనం వల్ల శ్రీశైలంలో 880 అడుగుల గరిష్టస్థాయికి నీటిమట్టం చేరితే తప్ప పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర రైతుల సాగునీటి అవసరాలపై ఏనాడైనా చంద్రబాబు దృష్టిసారించి ఉంటే కరువుసీమకు సాగునీరు ఎంత విలువైందో అర్థమయ్యేది.
హక్కుగా లభించే నీటి కోసమే రాయలసీమ ఎత్తిపోతలు
శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి న్యాయంగా ఏపీకి హక్కుగా వాడుకునే నీటి కోసమే ఆనాడు వైయస్ జగన్ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆ మేరకు మా వాటా నీటిని హక్కుగా వాడుకుంటామని, పర్యావరణ అనుమతులు వచ్చేలోపు ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని గట్టిగా వాదించి ఉంటే మనకు తీర్పు అనుకూలంగా వచ్చ ఉండేది. కానీ ప్రాజెక్టు పూర్తయితే ఎక్కడ వైయస్ జగన్‌కి పేరొస్తుందోననే కుట్రతో చంద్రబాబు రైతుల జీవితాలను పణంగా పెట్టారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను కొనసాగించింది. 2014-19 మధ్య ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు వారికి సాగిలాపడిపోయి కృష్టా జలాలకు సంబంధించి రాష్ట్ర హక్కులను హరిస్తున్నా కిమ్మనకుండా ఉండిపోయాడు. కేసు నుంచి బయటపడేస్తే చాలన్నట్టు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే తెలుగుగంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్‌లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదించింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు.
తెలంగాణ ప్రాజెక్టులపై ఆనాడూ అభ్యంతరం చెప్పని చంద్రబాబు
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించేలా రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు–రంగారెడ్డి, రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్ల వ్యయంతో 2015 జూన్10న తెలంగాణ సర్కార్ చేపడితే చంద్రబాబు నోరెత్తడం లేదు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జలాలు దక్కవని, ఏపీ రైతులు 2021లో ఎన్జీటీ (చెన్నె బెంచ్)ని ఆశ్రయించారు. ఈ కేసులో రైతులతో నాటి వైఎస్సార్‌సీపీ సర్కార్ కూడా జత కలిసింది. ఆ రెండు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులే లేవని, వాటి వల్ల శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టా కూడా నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతుందని వాదించింది. దీంతో ఏకీభవించిన ఎన్జీటీ తక్షణమే పనులు నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ 2021 అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పనులు చేస్తుండటంతో 2022 డిసెంబర్ 22న తెలంగాణ సర్కార్‌కు రూ.920.85 కోట్ల జరిమానా సైతం విధించింది. అయినప్పటికీ వాటిని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా పనులు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు.
కృష్ణా బోర్డ్ కేటాయింపులు లేకుండా నీటిని వాడుకుంటున్న తెలంగాణ
ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38 టీఎంసీల చొప్పున మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కానీ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకున్నా ఆనాడు చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువన నీటి అవసరాలు లేకున్నా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
తాజాగా బనకచర్లతో చంద్రబాబు నాటకాలు
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్‌లను తన స్వార్థప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్న చంద్రబాబు రైతుల దృష్టిని మళ్ళించేందుకు బనకచర్ల పేరతో కొత్త డ్రామాకు తెరతీశారు. పోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి పోయే వృథా నీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని తెలంగాణాకు సూచిస్తున్నాడు. మరోవైపు తన శిష్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా అభ్యంతరాలు లేవనెత్తేలా కుట్ర చేస్తున్నారు. కేవలం ప్రచారం కోసం మాత్రమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నాడు. సాగునీటి ప్రాజెక్ట్‌ల విషయంలో చంద్రబాబుకు మొదటి నుంచి ఎటువంటి చిత్తశుద్ది లేదు.
నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టింది వైయస్సార్
నెల్లూరు జిల్లాకు తానే పొట్టి శ్రీరాములు పేరు పెట్టానని చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడు. కానీ మే 22, 2008లో సీఎంగా ఉన్న దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మారుస్తూ జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 676లో ప్రకటించిన దాని ప్రకారం జూన్ 4, 2008 నుంచి నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా(శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)గా పిలవబడుతుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మొదటిసారి సీఎంగా ఉండగానే వైయస్సార్ ఈనిర్ణయం తీసుకున్నారు. ప్రజలు నవ్వుకుంటారనే విచక్షణ లేకుండా చంద్రబాబు అబద్ధాలు చెబితే, దాన్ని కూడా ఈనాడు పత్రిక అచ్చేయడం వారి దివాలాకోరుతనంకు నిదర్శనం.