అమరావతి: వలంటీర్లు ఎవ్వరూ లేరు, రెన్యూవల్ చెయ్యలేదని చెప్పిన మంత్రి బాల వీరంజనేయ స్వామి చేసిన ప్రకటనపై శాసన మండలిలో వైయస్ఆర్‌సీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ..ఎన్నికలకు ముందు వాలంటీర్ల వేతనాన్ని 10వేలకి పెంచుతామని హామీ ఇచ్చి ..అధికారంలోకి వచ్చాక 2,56,000 మంది వాలంటీర్లను తొలగించారని మండిపడ్డారు. ఇవాళ వలంటీర్ వ్యవస్థనే లేదని మంత్రి చెప్పడం వలంటీర్లను మోసం చేయడమే అన్నారు. 2024 సెప్టెంబర్‌లో వరదలు వచ్చినప్పుడు వలంటీర్లతో ఎలా డ్యూటీ చేయించారని నిలదీశారు. నవంబర్ 2024 వరకు వాళ్లకి ఐడీలు ఎలా కొనసాగించారని ప్రశ్నించారు. వాలంటీర్లకు మోసం: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు ..సీఎం కాగానే మోసం చేశారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు. 2023 ఆగస్టు నుండి వలంటీర్లు వ్యవస్థ లేదని మంత్రి దారుణంగా మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఈ వ్యవస్థ లేకపోతే 2024లో మేనిఫెస్టోలో ఎలా పెట్టారని ప్రశ్నించారు. 2024 ఏప్రిల్ లో ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని నిలదీశారు. జీతం పెంచగానే చించినాడా పుతారేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. 2,60,000 వేల మందిని తొలగించడం అన్యాయమని, వాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. వలంటీర్లు లేకపోతే ఎందుకు విపత్తు శాఖ ఆదేశాలు ఇచ్చిందని, లేని వారిని ఎలా వరదల్లో వినియోగించారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.