విశాఖపట్నం: దేవుడితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తిరుమల శ్రీవారిపై రాజకీయం చేసి చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నారని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో మాజీ మంత్రి అమర్నాథ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసం పసుపు చొక్కాలు వేసుకునే టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం కాషాయ చొక్కాలు వేసుకుంటున్నారు. దేవుడితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలి. చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. లడ్డూ విషయంపై విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి వైయస్ జగన్ ఇప్పటికే లేఖ రాశారు. ఈ విషయంపై మోదీకి ఫిర్యాదు చేస్తాం అంటూ కామెంట్స్ చేశారు.