న్యూఢిల్లీ: ఆంధ్ర రాష్ట్రానికి నిధులు రాబట్టే ప్రయత్నం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే.. ఆ నిధులను ఏ రకంగా అడ్డకోవాలని టీడీపీ కుట్ర చేస్తోందని లోక్‌సభ వైయస్‌ఆర్ సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని, ప్రత్యేక ప్యాకేజీకి కక్కుర్తిపడి.. హోదా అంశాన్ని తుంగలో తొక్కింది చంద్రబాబు కాదా..? అని ప్రశ్నించారు. ‘కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా..?’ అని ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అనే నినాదంతో ఆనాడు చంద్రబాబు వ్యవహరించాడని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశం ఇంకా సజీవంగా ఉందంటే.. అది కేవలం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లేనని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అని ప్రస్తావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలోని రాష్ట్రమేనని గుర్తించాలని, ఒక చుక్క అమృతం కోసం ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారని లోక్‌సభలో ప్రస్తావించామన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను ఇంకా పూర్తిగా నెరవేర్చలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సవరించిన ప్రాజెక్టు వ్యయం అంచనాలను ఆమోదించాలన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన 10 అంశాల గురించి వివరించారన్నారు. పెండింగ్ సమస్యలకు సంబంధించి హైలెవల్ కమిటీ మీటింగ్ జరిగిందని, ఆ సమావేశంలో వైయస్‌ఆర్ సీ పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన పాల్గొని చర్చించారన్నారు. ఆ మీటింగ్ ద్వారా మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నామన్నారు.