బద్వేలు : బద్వేలు నియోజకవర్గంలో ఏర్పాటైన సెంచురీ పరిశ్రమ.. జిల్లా పారిశ్రామిక ప్రగతికి మరో మైలురాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. శనివారం ఉదయం గోపవరం మండల పరిధిలోని ఇండస్ట్రియల్ పార్క్ లో నూతనంగా నిర్మించిన M/S సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమ ఉత్పత్తి యూనిట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించి,శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం లాంజ్ రూమ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సెంచురీ ఫ్లై కంపెనీకి సంబంధించిన వీడియోను తిలకించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా,ఎంపీ అవినాష్ రెడ్డి,బద్వేలు ఎమ్మెల్యే డా. దాసరి సుధ, అడా చైర్మన్ గురుమోహన్,ఫుడ్ కమిషన్ ఛైర్మెన్ విజయ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ డిసి గోవింద రెడ్డి,సెంచూరీ ఫ్లై వుడ్ ఛైర్మెన్ సజ్జన్ బజంకా,మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్,ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ కేశన్ బజంకా,ప్రెసిడెంట్ హిమన్షు,వైస్ ప్రెసిడెంట్ తుషార్ పట్నాయక్,ఎక్జిక్యూటివ్ అసిస్టెంట్ అంకిత్ బంటియా అధికారులు...జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు,జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ లు పాల్గొన్నారు. బద్వేలు నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో గోపవరం మండల పరిధిలో ఏర్పాటైన ఇండస్ట్రియల్ పార్కులో.. అన్ని మౌలిక సదుపాయాలతో సహా ఎకరా రూ.15 లక్షల రాయితీ ధరతో ఏపీఐఐసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల విస్తీర్ణంలో M/S సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమ ఏర్పాటయింది. రూ.956.00 కోట్ల మేర పెట్టుబడితో రూపుదిద్దుకున్న ఈ సీపీఎల్ పరిశ్రమలో.. మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్ (MDF), హై ప్రెజర్ లామినేట్స్ (HPL) ఉత్పత్తిని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. కాగా చెక్క పలకలు, అలంకరణ సంబంధ వుడ్ షీట్స్ తయారీలో దేశంలోనే ప్రసిద్ధిగాంచిన సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ సంస్థ.. 2266 మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా.. ఈ ప్రాంతంలో ఏర్పాటయింది. అంతేకాకుండా స్వలాభం కోసమే కాకుండా బద్వేలు నియోజకవర్గ పరిసర ప్రాంత రైతులకు లబ్ది చేకూర్చేలా కంపెనీ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకును.. రైతుల నుండే నేరుగా కొనుగోలు చేస్తోంది. భవిష్య అవసరాల కొరతను తీర్చేందుకు గాను.. ఈ కంపెనీ ద్వారా రానున్న 8 ఏళ్లలో 80,000 ఎకరాల భూమిలో చెట్లను పెంచేందుకు స్థానిక రైతులను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే.. 1000 మంది రైతులకు సబంధించి 5000 ఎకరాల్లో రాయితీ ధరతో చెట్లను నాటడానికి అవకాశం కల్పించారు. సీపీఎల్ పరిశ్రమకు నీటి అవసరాలకు గాను.. ప్రభుత్వం బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నుండి 0.07 టీఎంసీల నీటిని కూడా కేటాయించారు. అందుకోసం.. రిజర్వాయర్ నుండి ప్లాంట్ సైట్ వరకు రూ.45 కోట్లతో వాటర్ పైప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిరంతారాయ విద్యుత్ సరఫరా కోసం ఏపీ ఐఐసి ద్వారా రూ.19.11 కోట్లు వెచ్చించి 132 కెవి విద్యుత్ లైన్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అగ్రోస్ డిస్టిక్ మేనేజర్ విజయకుమార్,ఎస్సి కార్పొరేషన్ ఈడి డా.హెచ్. వెంకట సుబ్బయ్య,ఏపీ ఐఐసి ఈ.ఈ శ్రీనివాస మూర్తి , ఆర్డీవో వెంకట రమణ పాల్గొన్నారు.