తాడేపల్లి: ఐటీ నోటీసులపై ‘నారా’ వారు నోరిప్పరేమని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రశ్నించారు. చంద్రబాబు నీతి కబుర్లు చెబుతుంటాడని.. ఆయనకు ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చాయని.. అయినా ఇంత వరకూ చంద్రబాబు ఎందుకు నోరు విప్పటం లేదని మంత్రి ప్రశ్నించారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పనికి మాలిన పనులు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు జీవితం అంతా స్టే తెచ్చుకోవటమేనని.. సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి స్వభావం బీజేపీ నేతలకు తెలుసని ఆయన విమర్శించారు. నోటీసుల విషయంలో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణం అయిన ఉసురు చంద్రబాబును వెంటాడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఐటీ నోటీసులపై ‘నారా’ వారు నోరిప్పరేం?: చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించిన చంద్రబాబునాయుడుకి ఈరోజు లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎక్కడ్నుంచి వచ్చాయి..? ఇసుక దోపిడీ నుంచా.. రాజధాని అమరావతి పేరుతో కాంట్రాక్టర్‌ల నుంచి అందాయా..? లేదంటే, హెరిటేజ్ పాల వ్యాపారం చేస్తేనే అన్ని రూ.లక్షల కోట్లు వచ్చాయా..? వీటన్నింటికీ, చంద్రబాబు సమాధానం చెప్పగలడా..? ఐటీ శాఖ నోటీసులపై ‘నారా’ వారు ఎందుకు నోరిప్పడం లేదు. ఆదాయపన్ను శాఖ లెక్కల్లోకి రాని డబ్బును ఎలా సంపాదించారో అనేది ఎందుకు వివరించడం లేదు..? రాజధాని పేరిట ఏ కాంట్రాక్టర్ నుంచి ఎంత తీసుకుందనేది.. తన పర్సనల్ సెక్రటరీ ఎంత వసూలు చేశాడనేది ప్రజలకు ఇప్పటికైనా చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోనీ, కనీసం.. తమకేమీ ఐటీశాఖ నోటీసులు రాలేదని.. వాటికి మేమేమీ సమాధానాలివ్వలేదనైనా ఏదొక విషయం బయటపెట్టాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది. ఎర్రడైరీ కాదు.. ఐటీ డైరీ ప్రశ్నపై స్పందిస్తే మేలుః రాజధాని నిర్మాణాల పేరిట రెండు పెద్ద సంస్థల నుంచి రూ.118 కోట్లు అక్రమంగా బొక్కేసిన చంద్రబాబు ప్రజల ముందుకొచ్చి నీతిమాటలు వల్లిస్తున్నాడు. చెప్పేవన్నీ శ్రీరంగనీతులు.. చేసేవి మాత్రం తప్పుడు పనులని చంద్రబాబు గురించి ప్రజలకు అర్ధమైంది. ఇక, ఆయన తనయుడు లోకేశ్ ఊరూరా తిరుగుతూ ఒక ఎర్రడైరీ పట్టుకుని ఏవేవో కోతలు కోస్తున్నాడు. ప్రస్తుతానికి ఆయన ఆ ఎర్రడైరీని మడిచి పక్కనబెట్టి.. ఆదాయపన్ను శాఖ డైరీలోకి ఎక్కిన నాన్నగారి అక్రమ సంపాదన లెక్కలకు సంబం«ధించిన నోటీసులపై స్పందించాలి. ఒక్క రాజధాని పేరుతోనే కాకుండా స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం, కేబుల్, లిక్కర్ పంచాయితీలు ఇలా అనేక స్కామ్‌లు భవిష్యత్తులో వెలుగులోకి రానున్నాయి. అన్నింటిలోనూ చంద్రబాబు దోషిగా నిలబడాల్సిన ఆధారాలు కనిపిస్తున్నాయి. రామోజీ కళ్లుండి చూడలేని కబోధి: ప్రజా పంపిణీ ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదని ఈనాడులో రాశారు. రామోజీరావుకు టీడీపీ హయాంలో జరిగిన తప్పులేమీ కనిపించవు. వినిపించవు. ఆయనకు చంద్రబాబు పాలనంటే అమితానందం. అందుకే, ఆయన పాలనలో ఏం జరగకపోయినా.. అన్నీ జరిగినట్టే ప్రజల్ని మభ్యపెట్టే రాతలు రాశాడు. చంద్రబాబు హయాంలో 2014–15లో రాష్ట్రంలో ఎక్కడా ఒక్క కందిపప్పు బద్ద కూడా ప్రజలకు పంపిణీ చేయలేదు. చంద్రబాబు ప్రజలకు ఎంత మేలు చేయకపోతే రామోజీరావుకు అంత ఆనందమన్న మాట. ఎందుకంటే, ఆయన టీడీపీ హయాంలో కళ్లుండి చూడలేని కబోధిగా మారతాడు. కిలోకు రూ.80 సబ్సిడీతో పంపిణీ: 2016 వరకు ఎక్కడా ఒక్క గింజ కూడా కందిపప్పు అందజేయని టీడీపీ ప్రభుత్వం ఆ ఏడాది చివరలో గిరిజన ప్రాంతాల్లో మాత్రమే అరాకొరగా ఇవ్వడం జరిగింది. అది కూడా బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.63 ఉన్నప్పుడు.. రూ.23 సబ్సిడీతో రూ.40కు పంపిణీ చేశారు. అదే మా ప్రభుత్వం వచ్చాక, బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు దాదాపు రూ.150 ఉంటే, మేము రూ.80 సబ్సిడీతో కిలో పప్పు కేవలం రూ.67కే రాష్ట్రం మొత్తం పంపిణీ చేశాం. ఆ వ్యత్యాసం కనిపించడం లేదా? రామోజీ?: చంద్రబాబు హయాంలో 5 ఏళ్లలో 93 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పు పంపిణీ చేసి, అందుకోసం రూ.1605 కోట్లు ఖర్చు చేస్తే.. మా ప్రభుత్వం ఈ నాలుగ్ళేలోనే రూ.3019 కోట్లు ఖర్చు చేసి, 3 లక్షల టన్నుల కందిపప్పును పంపిణీ చేశాం. అంటే గత టీడీపీ ప్రభుత్వం కన్నా, మా ప్రభుత్వం దాదాపు మూడు రెట్ల ఎక్కువ కందిపప్పును, రెట్టింపుపైగా ఎక్కువ వ్యయం చేసి పంపిణీ చేసింది. మరి ఈ వ్యత్యాసం కనిపించడం లేదా రామోజీ? ఈ వాస్తవాన్ని రాసే దమ్ముందా రామోజీ? అదేనా మీ జర్నలిజమ్?. కందుల దిగుమతులపై వాస్తవాలు: ఇటీవల కందిపప్పు దిగుమతులకు సంబం«ధించి కేంద్రం కర్ణాటక గోడౌన్‌లను కేటాయించింది. అయితే ఆ కందుల్లో పుచ్చు, నాసిరకం ఎక్కువ ఉందని గుర్తించిన మేము వాటిని తీసుకోవడానికి అంగీకరించ లేదు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వేరేచోట గోడౌన్‌లు కేటాయించాలని కోరాం. అయితే ఈ ఏడాది కందుల పంట దిగుబడి తక్కువగా ఉన్నందున వాటికి బదులు శనగలు ఇస్తామని కేంద్రం చెప్పగా.. దాన్ని తిరస్కరించి, కందుల కోసం పట్టుబట్టాం. దీంతో దిగి వచ్చిన కేంద్రం ఈ నెలాఖరుకు పంపుతామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీకి అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నాం. వాస్తవాలు ఇలా ఉంటే.. కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేస్తున్న రామోజీరావు, రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనుకునే విధంగా నిత్యం ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ బురద చల్లుతున్నారు. బాబు మోసాలు.. ఈనాడు రాతలు ఒకటే: చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక విధంగా.. ప్రతిపక్షంలో ఉంటే మరొక విధంగా.. ఈనాడు తన జర్నలిజాన్ని ఊసరవెల్లిగా మార్చుకుంటుంది. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నప్పుడు.. ఉచిత పథకాలతో ప్రజలను సోమరులను చేయడం ఎందుకు అని ఆయన అన్నప్పుడు.. రైతులకు రుణమాఫీ చేస్తానని మాటిచ్చి, ఆ తర్వాత వారికి మొండిచేయి చూపించినా.. అవన్నీ రామోజీరావుకు అద్భుతంగా అనిపిస్తాయి. అదే మా ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్, రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నా, ప్రతి ఒక్కటి నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకంగా, ఎక్కడా అవినీతికి తావు లేకుండా అమలు చేస్తున్నా.. రామోజీరావు కంటికి కనిపించదు. ఆయన చెవికి ఏదీ ఎక్కదు. ఎంతసేపూ ఎలాగైనా చంద్రబాబును తిరిగి గద్దెనెక్కించాలన్న లక్ష్యంతో.. ఎలా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలి అన్న కుట్రతో రామోజీ వ్యవహరిస్తున్నారు. మోసం చేసి, అబద్ధాలు అల్లడంతో చంద్రబాబు ఎంత సిద్ధహస్తుడో.. ప్రజలను తప్పుదోవ పట్టించాలన్న ప్రయత్నంలో రామోజీ కూడా అంతే. అందుకే బాబు మోసాలు.. రామోజీ రాతలు రెండూ ఒకటే. బాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ: ఇసుక తవ్వకాలపై ఈనాడు అడ్డగోలు రాతల వెనుక అంతర్యాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారు. నాడు, చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రజా ప్రతినిధులు నదీ తీర ప్రాంతాలను ఏ విధంగా పంచుకుని.. ఇష్టం వచ్చినట్లు ఎలా ఇసుక తవ్వకాలు జరిపారో అప్పట్లో అందరూ చూశారు. ఎమ్మెల్యేల నుంచి చంద్రబాబు, లోకేశ్ జేబుల్లోకి ముడుపులు నెలవారీగా ఎలా అందాయో కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి నిజం కాదా? నెలకు రూ.500 కోట్లు చొప్పున లోకేశ్‌కి ఇచ్చారని స్వయంగా టీడీపీ నేతలే అప్పట్లో చెప్పారు కదా? పైగా, అడ్డగోలు ఇసుక తవ్వకాలపై నాడు ఎన్‌జీటీ రూ.100 కోట్ల జరిమానా విధించిందనేది వాస్తవం కాదా? ఉచిత ఇసుక పేరిట పెద్ద మాఫియా నడిపి ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించింది నిజం కాదా..? ఇలాంటి విషయాల్ని అప్పట్లో ఈనాడు ఎందుకు రాయలేదు..? ఒక మండల తహశీల్దార్‌గా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న వనజాక్షి గారు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే.. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆమెను ఈడ్చేసిన వైనంపై ఏం సమాధానం చెబుతారు..? పైగా, మహిళా అధికారిణికి అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెను బెదిరించి మరీ రాజీ చేయిస్తాడా..? ఇవన్నీ కళ్లకు కనిపించలేదా.. చెవులకు వినిపించలేదా..? అని రామోజీరావును ప్రశ్నిస్తున్నాను. బాబుకు అన్నిచోట్లా చుక్కెదురే.. అక్రమ సంపాదనకు సంబంధించి ఈరోజు ఐటీశాఖ నోటీసులు, రేపు మరిన్ని కేంద్రప్రభుత్వ సంస్థల విచారణలకు హాజరవ్వాల్సిన చంద్రబాబులో రోజురోజుకు భయం పెరుగుతుంది. అందుకే, ఇటీవల ఢిల్లీటూర్లు తరచూ చేస్తూ కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకునేందుకు తహతహలాడుతున్నాడు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్నా.. జనసేనతో అంటకాగి ప్రజల ముందు నీతిమంతుడుగా కలరింగ్ ఇచ్చుకోవాలంటే.. చంద్రబాబుకు అన్నిచోట్లా చుక్కెదురే అవుతుంది. ఆయన రాజకీయం మసకబారిపోయింది. 2024 ఎన్నికల తర్వాత బాబు రాజకీయ కనుమరుగు ఖాయమనేది వినిపిస్తుంది. 2024లోనూ జగన్‌గారే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి పాలనపై ఇప్పటికే అన్నివైపులా మద్ధతు పెరిగింది. ప్రజల హృదయాల్లో చెక్కుచెదరని పరిపాలనా నేతగా ఆయనకు పేరొచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల కుటుంబాల్లోనూ ఒక సోదరుడిగా, మేనమామగా జగన్‌గారు అరుదైన గుర్తింపును దక్కించుకున్నారు. మహిళా సాధికారతకు ఊతమిచ్చిన ప్రభుత్వంగా కేంద్రస్థాయిలో ర్యాంకింగ్‌లో ఉన్నాం. ఉచితంగా ఇళ్ల స్థలాలు, చేయూత, చేదోడు, అమ్మఒడి, ఆసరా వంటి పేదల పథకాలన్నీ మహిళల పేరుతో సంక్షేమాన్ని అందిస్తోన్నారు. ఇవ్వన్నీ రేపటి ఎన్నికలకు పునాదులుగా పనిచేస్తాయి. అందుకే, మేము 175 స్థానాలకు 175 చోట్ల గెలుపు ఖాయం చేసుకుంటామని.. 2024లోనూ శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డినే మరోమారు ముఖ్యమంత్రిగా వస్తున్నారని ధీమాగా చెబుతున్నాం.