తిరుపతి: పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్, ల్యాబరేటరీని విద్యుత్, అటవీ, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఆ భవనానికి డాక్టర్ వైయస్ఆర్ పర్యావరణ భవనంగా నామకరణం చేశారు. మొత్తం రూ.16.50 కోట్ల వ్యయంతో నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించామని, భవిష్యత్తులో జోనల్ కార్యాలయం తిరుపతిలో ఏర్పాటు చేసినా ఇదే భవనం సరిపోయేలా నిర్మాణం చేపట్టామని చెప్పారు. తిరుమలలో ప్లాస్టిక్ వ్యర్థాలు నిషేధించామని, భక్తులకు ప్లాస్టిక్‌పై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. భక్తులపై చిరుతల దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని, శాశ్వత ప్రాతిపదికన కంచె ఏర్పాటు దిశగా టీటీడీ, అటవీశాఖ ఆలోచిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో టీటీడీకి సహకరిస్తామన్నారు. ఇటీవల చిరుత దాడిలో మృతిచెందిన చిన్నారికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించామని చెప్పారు. జరిగిన ఘటన చాలా బాధాకరమన్నారు. మ్యాన్ ఈటర్‌గా మారిన రెండు చిరుతలు జూ పార్క్‌లోనే ఉంచుతామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.