తాడేపల్లి: తాను వ్యాపారాల్లో కోట్లు సంపాదించానని.. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని వైయస్ఆర్‌సీపీ దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు.యువగళం పాదయాత్రలో లోకేష్ ముఖ్యమంత్రిపై, పార్టీ పై, తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఖండించారు. బదిలీల్లో అవినీతికి పాల్పడ్డానని లోకేష్ ఆరోపణలు చేశాడని ఆయన చెప్పారు. తాను వ్యాపారాల్లో కోట్లు సంపాదించానని.. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. హైదరాబాద్‌లో విల్లా ఉందని లోకేష్ అంటున్నాడని.. హైదరాబాద్‌లోనే కాదు బెంగుళూరులో 30 కోట్ల విల్లా ఉంది… లోకేష్ వస్తే చూపిస్తానంటూ మద్దిశెట్టి వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. తన కంపెనీలోనే నాలుగు వేల మంది ఉద్యోగులు ఉన్నారని.. జీతాల రూపంలోనే నెలకు పది కోట్లు ఖర్చు చేస్తానన్నారు. చిల్లర పనులకు పాల్పడాల్సిన అవసరం తనకు లేదన్నారు. పన్నుల రూపంలోనే వందల కోట్లు ప్రభుత్వాలకు కట్టానన్నారు. “వేల కోట్ల వ్యాపారాలు చేస్తున్నాను. ఒక వ్యక్తి పై ఆరోపణలు చేసే ముందు లోకేష్ కొంచెం అయినా స్టడీ చేసుకుంటే మంచిది. ఎన్నికల అఫిడవిట్‌లోనే నా ఆస్తులు, కంపెనీల వివరాలు తెలుస్తాయి. లోకేష్ దర్శి నుంచి పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నాను. నాపై నిందారోపణలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మండిపడ్డారు.