బాబు, పవన్‌, రామోజీరావుల‌ది కృత్రిమ ఉద్యమం 

ఎంపీ మార్గాని భరత్ 
 

తాడేపల్లి:  రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌, రామోజీరావు కలిసి ఒక కృత్రిమ ఉద్యమం నడుపుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ విమ‌ర్శించారు. రైతులు, మహిళలకు వ్యతిరేకంగా పవన్‌ వ్యవహరిస్తున్నారు. ఈ కుట్రకు రామోజీ కథ రచిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గురువారం ఎంపీ భ‌ర‌త్‌ మీడియాతో మాట్లాడుతూ.. దత్తపుత్రుడు పవన్ మాట్లాడే మాటలు ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తున్నాయి?. పేదలంతా ముక్కున వేలేసుకుని చూస్తున్నారు. వాలంటీర్లు.. ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నారు. అలాంటి వాలంటీర్లపై పవన్ అక్కసు కక్కుతున్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ఎంత అరాచకం చేశాయో గుర్తు లేదా?. పచ్చ కండువా వేసుకున్న వారికే అప్పట్లో పనులు చేశారు. కానీ, వాలంటీర్లు అందరికీ న్యాయం చేస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పని చేశారు. ఇప్పుడు వాలంటీర్లు ఎక్కడైనా లంచాలు తీసుకుంటున్నారా?.  
ఈ కుట్రకు రామోజీరావు క‌థ‌..
 చంద్రబాబు, పవన్, రామోజీ కలిసి ఒక కృత్రిమ ఉద్యమం నడుపుతున్నారు. రైతులు, మహిళలకు వ్యతిరేకంగా పవన్ వ్యవహరిస్తున్నారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికీ అందుతుంటే పవన్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ కుట్రకు కథ రామోజీరావు రచిస్తున్నారు. చంద్రబాబు దర్శకత్వం వహిస్తుంటే పవన్ నటిస్తున్నారు. దోచుకోవాలనే వారి ప్లాన్ కుదరటం లేదని వారు బాధ పడుతున్నారు. వాలంటీర్లలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే ఉన్నారు. 

 పవన్ ఎందుకు నోరు మెదపలేదు?
వాలంటీర్ల ద్వారా ప్రజలంతా బాగుపడుతుంటే దుష్ట చతుష్టయానికి కడుపు మండుతోంది. వాలంటీర్లు ఉంటే చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేడని వారికి అర్థమైంది. అందుకే వారిపై పథకం ప్రకారం విషం చిమ్ముతున్నారు. 2014లో చంద్రబాబు హామీలకు తాను అండగా ఉంటానని చెప్పి అప్పుడు పవన్ ఎందుకు నోరు మెదపలేదు?. రేణూదేశాయ్ స్వయంగా పవన్ గురించి ఏం మాట్లాడారో అందరికీ గుర్తుంది. ఒకరిని పెళ్ళి చేసుకుని, ఇంకొకరితో సహజీవనం చేస్తే ఎలా ఉంటుందో  రేణూదేశాయే చెప్పారు. కడుపుశోకం ఎలా ఉంటుందో తెలుసా అని ఆమెనే అన్నారు. 

వాలంటీర్లపై రెండు రోజుల్లో పవన్‌ మాట మార్చారు. రాజధానిలో ఇల్లు ఇస్తామంటే అడ్డుకుంటుంటే పవన్ ఎందుకు మాట్లాడరు?. వాలంటీర్లను మద్యం సీసాలతో పోల్చుతారా?. అంత అహంకారం ఏంటి పవన్?. పవన్ దత్తతండ్రి చంద్రబాబు ఇచ్చిన హామీలకు బడ్జెట్ వేస్తే దేశ బడ్జెట్ కూడా సరిపోదు. మరి చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ మార్గాని భ‌రత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Back to Top