ఉద్యోగులను నమ్మించి నట్టేట ముంచిన కూటమి సర్కార్

ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపెట్టింది రూ.30వేల కోట్లు

ఈ బకాయిలు ఎప్పుడిస్తారు బాబూ?

నిలదీసిన వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి

చంద్రబాబు పాలన అంటేనే ఉద్యోగ వ్యతిరేక పాలన

ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు ఏదీ?

పీఆర్సీ, ఐఆర్, డీఏల ఊసే లేదు

హెల్త్‌కార్డ్‌లు పనిచేయక ఉద్యోగుల అవస్థలు

ఇరవై లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడూ?

నిరుద్యోగభృతిని గాలికి వదిలేశారు

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మీడియా స‌మావేశం

తాడేపల్లి: చంద్రబాబు పాలన అంటేనే పచ్చి ఉద్యోగ వ్యతిరేక పాలన అని మరోసారి నిరూపితమైందని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.30వేల కోట్లు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును కూడా వారి అవసరాల కోసం సకాలంలో విడుదల చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనస్సు రావడం లేదా అని ప్రశ్నించారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే..

ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.30వేల కోట్లు ఉన్నాయి. వాటిల్లో డీఏ ఎరియర్స్‌, పీఆర్సీ ఎరియర్స్, ఎన్‌క్యాష్‌మెంట్ ఆఫ్ యర్నడ్‌ లీవ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్, సీపీఎస్ కింద కంట్రిబ్యూట్‌ చేస్తున్న మొత్తాలు, జీపీఎఫ్, ఏపీజేఎల్ ఉన్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా మేం అధికారంలోకి రాగానే వీటన్నింటినీ తక్షణం చెల్లిస్తామంటూ కూటమి పార్టీలు ఉద్యోగులను నమ్మించాయి. నెలలు గడుస్తున్నా ఉద్యోగుల బకాయిలు విషయంలో మాత్రం ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. 
ఎన్నికలకు ముందు ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ కూటమి పార్టీలు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చాయి. మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగులను నమ్మించారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే హామీలను మరిచిపోయారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం మాట మారుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తామని కూటమి పార్టీలు హమీ ఇచ్చాయి. ఇప్పుడు గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వేతన సవరణ కమిషన్‌ను కూడా రద్దు చేశారు. తిరిగి కొత్త కమిషన్‌ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ఇక దీనిపై రిపోర్ట్ ఎప్పుడు తెప్పించుకుంటారు? కొత్త పేరివిజన్‌ను ఎప్పుడు అమలు చేస్తారు? పెన్షన్లు, ఉద్యోగులకు రావల్సిన ఎరియర్స్‌, డీఏలు, ఐఆర్‌లను సకాలంలో చెల్లించడం లేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. పదినెలలుగా ఎందుకు దీనిని చెల్లించడం లేదో చెప్పాలి. తక్షణం కనీసం ముప్పై శాతంకు తగ్గకుండా మధ్యంతర భృతిని చెల్లించాలి. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు, పదవీ విరమణ చెందిన వారికి పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్క నెలలో మాత్రమే దీనిని అమలు చేశారు. తరువాత నుంచి నెలలో ఎప్పుడు చెల్లిస్తారో అర్థం కాని స్థితిలో ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. 

పెన్షన్‌ స్కీంపై ఇచ్చిన హామీని మరిచిపోయారు

సీపీఎస్-జీపీఎస్‌ లను సమీక్షించి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పెన్షన్‌ స్కీంను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు దీనిపై ప్రభుత్వం కనీసం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. ఆనాడు ఉన్న 1.80 లక్షల మంది ఉద్యోగులతో పాటు ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులను కూడా కలుపుకుంటే దాదాపుగా మొత్తం మూడు లక్షల మంది ఉద్యోగులు ఇంకా సీపీఎస్ కిందనే ఉన్నారు. వారికి ఆమోదయోగ్యమైన పెన్షన్‌ విధానంను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రకటించాలి. 
 

డిమాండ్ల కోసం ఉద్యోగులు రోడ్లెక్కుతున్నారు

అంగన్‌వాడీలు, గ్రామ సచివాలయ హెల్త్ సెక్రటరీలు రోడ్ల మీదికి వచ్చి తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు అధికారం 
లోకి రాగానే అంగన్‌వాడీలకు జీతాలు పెంచడంతో పాటు వారి డిమాండ్‌లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్లను పూర్తిగా రోడ్డుమీద పడేశారు. అధికారంలోకి రాగానే వారి జీతాలను అయిదు నుంచి పదివేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అసలు మీరు ఉద్యోగులే కాదంటూ అడ్డంగా మాట్లాడుతున్నారు. ఇటీవల బుడమేరు వరదల్లో కూడా వారి సేవలను వాడుకున్నారు. అప్పుడు వారు ఉద్యోగులు కారని తెలియదా? 

కొత్త ఉద్యోగాలు ఏవీ... నిరుద్యోగభృతి చెల్లింపు ఎక్కడా?

అయిదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ప్రతి ఏడాది జనవరిలో జాబ్‌క్యాలెండర్‌ ప్రకటిస్తామని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాయి. కొత్త ఉద్యోగాల భర్తీ ఏదీ? 
అసలు జాబ్‌ క్యాలెండర్ ఊసే లేదు. ఉద్యోగాలు రాని వారికి నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగికి కూడా ఈ భృతి అందడం లేదు. ఒక టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం మెగా డీఎస్సీ అంటూ తొలిఫైల్‌పై సంతకాలు చేశారు. పదినెలలైనా ఈ డీఎస్సీకి మోక్షం రాలేదు. అనేక ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి. పదోన్నతలు ఇవ్వడం లేదు. పనివత్తిడితోనే ఉద్యోగులు పనిచేస్తున్నారు.

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను మోసం చేశారు

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అప్కాస్‌ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీన చెల్లింపులు జరిగేవి. దానిని కూడా తీసేసి తిరిగి దళారీలకు ఏజెన్సీలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. హెల్త్‌కార్డ్‌లకు ఉద్యోగులు చెల్లించిన వాటాను కూడా ప్రభుత్వం తమ వద్దే ఉంచుకుని, బీమా సంస్థలకు చెల్లించకపోవడం వల్ల హెల్త్‌కార్డులు పనిచేయడం లేదు. అలాగే కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి రెగ్యులరైజేషన్‌ను పట్టించుకోలేదు. పెన్షనర్లకు కమిటేషన్‌ చేసుకున్నప్పుడు పెన్షన్‌ను నలబైశాతం వరకు అమ్ముకునే అవకాశం ఉంది. దాదాపు పదిహేను సంవత్సరాల వరకు అలా అమ్ముకున్న శాతాన్ని తగ్గించి ఇస్తారు. ఆ తరువాత మొత్తం పెన్షన్‌ ఇస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లో 11 సంవత్సరాల 3 నెలల వరకే ఇలా అమ్ముకున్న పెన్షన్‌ను కట్ చేసి ఇవ్వడం జరుగుతోంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం పదిహేను సంవత్సరాల వరకు పెన్షన్‌ కట్ చేస్తూనే ఉంది. ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కేపిటల్ సిటీలో, అన్ని జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు దీనిపై కనీస ఆలోచనే లేదు.  

సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు

గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో ఒకశాఖకు చెందిన వారిని మరో శాఖకు కేటాయిస్తున్నారు. ఉదాహరణకు రెవెన్యూశాఖకు చెందిన వీఆర్వోలను ఎక్కువగా ఉన్నారనే నెపంతో వీరే శాఖకు మారుస్తున్నారు. గతంలో ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు ఆనాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. ఈ వ్యవస్థ ఎంతో సమర్థంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచింది. అటువంటి వ్యవస్థను కేవలం రాజకీయ దురుద్దేశంతోనే నీరుగార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ సర్వేలకు సచివాలయ ఉద్యోగులను వినియోగిస్తూ, సెలవు దినాల్లో కూడా పనిచేయాలంటూ వేధింపులకు గురి చేస్తోంది. సచివాలయాల్లో 15వేలు, రైతుభరోసా కేంద్రాల్లో 6 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోగా, క్యాడర్ స్ట్రెంత్‌ నుంచి వారిని శాశ్వతంగా తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి ఉద్యోగ వ్యతిరేక విధానాలను వీడకపోతే ఉద్యోగులు తగిన బుద్ది చెబుతారు. 

Back to Top