

















పార్టీ బాధ్యతలు, ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు
రాజీనామా సందర్భంగా ఆయన వ్యాఖ్యలు దారుణం
వైయస్ కుటుంబం ఆయనకు ఎప్పుడూ అండగానే నిలబడింది
చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి విడదల రజనీ మీడియా సమావేశం
చిలకలూరిపేట : ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌కు వైయస్‌ఆర్‌సీపీ సముచిత స్థానం ఇచ్చి గౌరవించిందే తప్ప ఏనాడు ఆయన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని మాజీ మంత్రి విడదల రజనీ స్పష్టం చేశారు. చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కష్టసమయంలో అండగా నిలవాల్సింది పోయి పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి మేలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్న కూటమి సర్కార్‌పై ప్రతిపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ మాట్లాడి ఉంటే ఆయనకు ప్రజల్లో మరింత గౌరవం, మర్యాదలు పెరిగేవని అన్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలను విడదల రజనీ ఖండించారు.
ఇంకా ఆమె ఏమన్నారంటే...
మర్రి రాజశేఖర్‌కు వైయస్‌ఆర్‌సీపీలో సీనియర్ నాయకుడిగా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ సముచిత గౌరవాన్నే ఇచ్చారు. తనకు పార్టీలో గౌరవం దక్కలేదని, ఊహించిన పదవులు రాలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు. 2004లో మర్రి రాజశేఖర్‌కి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆనాడు దివంగత మహానేత వైయస్ఆర్ చిలకలూరిపేటకు ప్రచారానికి వచ్చిన సందర్భంగా ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న మర్రి రాజశేఖర్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన చలవతో మర్రి రాజశేఖర్ ఆ ఎన్నికల్లో గెలిచారు. మర్రి రాజశేఖర్‌పై అభిమానంతోనే మహానేత వైయస్ఆర్ ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ కి టికెట్ ఇచ్చినా ఆయన ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఆయన గౌరవానికి ఎక్కడా లోటు రాలేదు. వైయస్ జగన్ వైయస్సార్సీపీ ఏర్పాటు చేసినప్పుడు మర్రి రాజశేఖర్ పార్టీలో చేరితే ఆయనకు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అలాగే 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి వైయస్సార్సీపీ తరఫున బరిలో దింపినా ఆయన ఓటమి పాలయ్యారు. తరువాత కూడా పార్టీ ఆయనను ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులుగానే కొనసాగించింది. 2019 నాటికి రాష్ట్రంలో, నియోజకవర్గంలో ఉన్న పరిణామాల దృష్ట్యా చిలకలూరిపేట నుంచి పోటీ చేసే అవకాశం పార్టీ నాకు కల్పించింది. వైఎస్ జగన్ గారిపై ప్రజల్లో ఉన్న అభిమానం, పార్టీ పట్ల ప్రజాధరణతో అక్కడి నుంచి విజయం సాధించడం జరిగింది.
తన వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి
పార్టీ అధికారంలోకి వచ్చాక మర్రి రాజశేఖర్‌కి రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించడంతోపాటు, ఎమ్మెల్సీని చేసి శాసనమండలికి పంపించి గౌరవించారు. పార్టీ ఓటమి పాలై కష్టాల్లో ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తారని నమ్మకంతో వైయస్ జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే, రాజీనామా చేస్తే ఆ పదవి టీడీపీకి వెళ్తుందని తెలిసి కూడా ఆయన రాజీనామా చేశారంటే ఏమనుకోవాలి? 2024 గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా నన్ను గుంటూరు వెస్ట్ నుంచి బరిలో నిలబడాలని అధినేత వైయస్ జగన్ ఆదేశిస్తే అక్కడ్నుంచి పోటీ చేశాను. చిలకలూరిపేటలో మాదిరిగానే గుంటూరు వెస్ట్‌లో కూడా వైయస్ఆర్‌సీపీ విజయం సాధించాలనే వ్యూహంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. నా సొంత నియోజకవర్గాన్ని వదిలివెళ్లాల్సి వచ్చినా పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గం మారడం జరిగింది. 2024లో గుంటూరు నుంచి పోటీకి దింపితే ఎలాగైతే శిరసావహించానో, ఓడిన తర్వాత చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించినా పనిచేయడానికి అంగీకరించాను. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశాలనే నేను శిరోధార్యంగా భావిస్తూ వస్తున్నాను. తండ్రి వైయస్ఆర్ నుంచి తనయుడు వైయస్ జగన్ వరకు మర్రి రాజశేఖర్ కి పార్టీలో సముచిత స్థానమే దక్కింది. ఆయన్ను పార్టీ ఏనాడూ మోసం చేయలేదు. వైయస్ కుటుంబం మోసం చేసిందని మాట్లాడటంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి.