కూటమి పాలనలో ఉపాధి హామీలో భారీ అవినీతి

పార్టీ నాయకులకు మాత్రమే 'ఉపాధి' కల్పన

కూలీలకు చెల్లించాల్సిన బకాయిలే రూ.820 కోట్లు

గ్రామీణ పేదల గోడును పట్టించుకోని కూటమి సర్కార్

వైయ‌స్ఆర్‌సీపీ పంచాయ‌తీరాజ్ విభాగం అధ్య‌క్షులు వెన్న‌పూస ర‌వీంద్ర రెడ్డి ఆగ్రహం

పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి 

తాడేపల్లి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని కూటమి నేతలకు ఉపాధి కల్పనగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని వైయస్‌ఆర్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 72 రోజుల పనిదినాలకు చెందిన వేతనాలను పేదలకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు రూ.820 కోట్లు బకాయి పెట్టిందని వెల్లడించారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే..

పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి త‌న శాఖ మీద ప‌ట్టులేదు. ఎన్ఆర్ఈజీఎస్ చ‌ట్టం మీద కనీస అవ‌గాహ‌న లేకుండా అసెంబ్లీలో గ‌త  వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేశారు. పేద‌ల కోసం తెచ్చిన ఉపాధి హామీ ప‌థ‌కాన్ని కూట‌మి నాయ‌కులు జేబులు నింపుకోవ‌డానికి ఉప‌యోగించుకుంటున్నా ఆయ‌న నోరు మెద‌ప‌డం లేదు.  2014-19 మ‌ధ్య తెలుగుదేశం హ‌యాంలో ఎన్ఆర్ఈజీఎస్ ప‌థ‌కంలో స‌రాస‌రిన‌ 6.38 శాతం అవినీతి జ‌రిగింద‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించిన‌ సోష‌ల్ ఆడిట్ లో రుజువైంది. ఇదే స‌మ‌యంలో నీరు -చెట్టు పేరుతో ప‌నులు చేయ‌కుండా భారీగా అవినీతికి పాల్ప‌డ్డారు. దాదాపు రూ.5 వేల కోట్ల నిధులతో ప‌నులు చేశామ‌ని చెప్పుకోవ‌డం త‌ప్ప ప‌నుల‌కు సంబంధించిన అవ‌శేషాలు కూడా ఎక్క‌డా క‌న‌ప‌డటం లేదు.

ఫామ్ పాండ్స్‌ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి

- 2014-19 మ‌ధ్య 11 ల‌క్ష‌ల ఫామ్ పాండ్స్ త‌వ్వ‌కుండానే తవ్వామ‌ని చెప్పుకుని రూ.5940 కోట్లు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మింగేశారు. అనంత‌పురం జిల్లాలో ల‌క్ష ఫామ్ పాండ్స్ పేరుతో రూ.543 కోట్లు  డ్రా చేశారు. దీనిపై ఆనాడు జిల్లా ప‌రిష‌త్‌లో ప్ర‌తిప‌క్షంగా ఉన్న మేము క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న చేస్తే ఎక్క‌డా కూడా బ‌కెట్ నీరు నిల‌బ‌డే గుంత‌లు తీసిన‌ట్టు క‌న‌ప‌డలేదు. ఉపాధి హామీ నిధుల‌తో టీడీపీ నాయ‌కులకు చంద్ర‌బాబు భారీగా సంప‌ద సృష్టించి పెట్టారు. ఈ ఏడాది కూడా కూట‌మి నాయ‌కుల జేబులు నింపేందుకు 2.50 ల‌క్షల ఫామ్ పాండ్స్‌ను కేటాయించారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత ఈ ఏడాది జ‌వ‌న‌రి 9వ తేదీ వ‌ర‌కు చూస్తే ఎన్ఆర్ఈజీఎస్ ప‌నుల్లో 4.18 శాతం అవినీతి జ‌రిగింద‌ని ప్ర‌భుత్వమే లెక్క‌లు విడుద‌ల చేసింది. ఈ వాస్త‌వాల‌ను దాచి తెలుగుదేశం రాసిచ్చిన స్క్రిప్ట్ ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ చ‌దివాడు. 2019-24 మ‌ధ్య వైయ‌స్సార్సీపీ హ‌యాంలో ఉపాధి హామీ ప‌థ‌కం కింద జ‌రిగిన ప‌నుల‌ను త‌మ‌కు న‌చ్చిన గ్రామానికి వెళ్లి ప‌రిశీలించుకోవ‌చ్చు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల‌తో నిర్మించిన గ్రామ స‌చివాల‌యం, ఆర్బీకే సెంట‌ర్‌, హెల్త్ క్లీనిక్‌, మిల్క్ సెంట‌ర్‌, డిజిట‌ల్ లైబ్ర‌రీలు స్వాగ‌తం ప‌లుకుతాయి. వైయస్ జ‌గ‌న్ విజ‌న్‌తో గ్రామ స‌ర్వ‌తోముఖాభివృద్ధి కనిపిస్తుంది. 

- జ‌న‌వ‌రి నుంచి ఉపాధి కూలీల‌కు వేత‌నాలు లేవు 

కూట‌మి నాయ‌కులు అభివృద్ధి చెందితే రాష్ట్రం బాగుప‌డిన‌ట్టేన‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను తొల‌గిస్తున్నారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కి కేవ‌లం తెలుగుదేశం పార్టీ సభ్య‌త్వం ఉండ‌ట‌మే అర్హ‌త అన్న‌ట్టు టీడీపీ వారిని తెచ్చి ఉద్యోగాలిస్తున్నారు. గ‌త ప్రభుత్వంలో ప‌నిచేసిన వారిని బెదిరించి బ‌ల‌వంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ను పెట్టుకునేందుకు ఆలూరులో ఫీల్డ్ అసిస్టెంట్ ని దారుణంగా న‌రికి చంపారు. ప్ర‌జ‌లు ఉపాధి నిధులు రాక‌, సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లుకాక తీవ్ర‌మైన పేద‌రికంతో అల్లాడుతుంటే కూట‌మి నాయ‌కులు మాత్రం సాంస్కృతిక కార్యక్ర‌మాల పేరుతో స‌ర‌దాగా గడుపుతున్నారు. 143 త‌ప్పుడు హామీల‌తో అధికారంలోకి వ‌చ్చి పేద‌ల‌కు ఒక పూట అన్నం పెట్ట‌లేని అస‌మ‌ర్థత‌తో కూట‌మి ప్ర‌భుత్వం న‌డుస్తోంది. కూట‌మి పాల‌న‌లో ఎన్ఆర్ఈజీఎస్ ప‌థ‌కం కింద గ్రామాల్లో ఒక్క‌టైనా మంచి కార్య‌క్ర‌మం జ‌రిగి ఉంటే చూపించాలి.
 

Back to Top