తాడేపల్లి : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీడిపిక్కల లోడ్‌తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. బొర్రంపాలెం నుంచి జీడిగింజల లోడుతో తాడిమల్ల వెళుతున్న డీసీఎం వాహనం దేవరపల్లి మండలం చిలకావారి పాకల వద్ద అదుపు తప్పిబోల్తా పడింది. జీడి గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీశారు. మృతులను నిడదవోలు మండలం తాడిమళ్ల వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డీసీఎంలో 10 మంది ఉన్నారు.