తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ తీరును ఆయన ఎండగట్టారు. బుధవారం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆమలు చేస్తున్న మద్యం పాలసీలో ఎటువంటి పారదర్శకత లేదని, ఎక్కడికక్కడ దౌర్జన్యాలు, బెదిరింపులతో కమిషన్ల కోసం టీడీపీ నేతలు దాడులు సాగిస్తున్నారని వైయస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపించారు. ఈ పాలసీతో ఊరూరా, ఇంటింటికి నేరుగా మద్యం ఏరులై పారే ప్రమాదం ఉందని, ఇందుకు బెల్ట్ షాపులను ప్రభుత్వమే ప్రొత్సహించేలా వ్యవహరించడం కారణమని ఆయన స్పష్టం చేశారు. లిక్కర్ వ్యాపారంలో 15 శాతం కమిషన్ల కోసం రాష్ట్రానికి దౌర్జన్యాల సంస్కృతి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. నాణ్యమైన మద్యం అని చెప్పి కేరళ బ్రాండ్‌ను కర్ణాటకలో రూ.90 కే అమ్ముతుంటే, ఇక్కడ దాన్ని రూ.99కి అమ్మడం ఏ విధమైన పారదర్శకత అని మాజీ చీఫ్ విప్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో వైన్‌షాప్‌లను 33 శాతం తగ్గించడంతో పాటు, 43 వేల బెల్టుషాప్‌లు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసిన శ్రీకాంత్‌రెడ్డి, ఇప్పుడు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాలు పెంచి, ఊరూరా బెల్ట్ షాపులు పెట్టుకునేలా చర్యలు చేపడుతోందని దుయ్యబట్టారు. జగన్‌గారి సంక్షేమ పథకాలతో మహిళల ఆర్థిక మూలాలు ఇప్పుడిప్పుడే బలపడుతుంటే, వాటిని తుంచేలా గ్రామాల్లో మద్యపానాన్ని ప్రొత్సహించి కుటుంబాలు రోడ్డున పడ్డాసరే, ఆదాయం పెంచుకునేలా వ్యవహరించడం సబబు కాదని తేల్చి చెప్పారు. ఇంకా గత ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిల్లరీకి కూడా అనుమతి ఇవ్వలేదన్ని మాజీ చీఫ్ విప్.. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం అనుమతించిన డిస్టిల్లరీల వివరాలు తెలిపారు. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబుకు ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు తప్ప, ప్రజారోగ్యం, మహిళా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఎలాంటి శ్రద్ధ లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే మద్యం మత్తులో రాష్ట్రంలో అత్యాచారాలు, రాజకీయ హత్యలు, ఘర్షణలు పెరిగిపోయి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటే, ఇప్పుడు మద్యంను ఏరులై పారించాలన్న చంద్రబాబు ఆలోచనపై ప్రజలు తిరగబడడం ఖాయమని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.