తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయటంలేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. దీన్ని కప్పిపుచ్చుకోవటానికి వైయస్ జగన్‌పై మతం ముద్ర వేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ‘‘పాదయాత్రకు ముందు, తర్వాత జగన్ తిరుమల వెళ్లారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి నేతలు మత ముద్ర వేస్తున్నారు. వైఎస్ జగన్‌పై నిలువెల్లా విషం చిమ్ముతున్నారు. గత టీడీపీ పాలనలో కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు చేయించారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను కూల్చారు. వాటిని వైయస్ జగన్ సీఎం అయ్యాక తిరిగి నిర్మించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక కాశీనాయన క్షేత్రంలో కొన్ని సత్రాలు, గోశాలను కూల్చారు’’ అని మల్లాది విష్ణు గుర్తు చేశారు. ‘‘తిరుమలలో ఎగ్ బిర్యానీ, మద్యం దొరికింది. తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు. ఇలా వరుస సంఘటనలు జరిగాయి. హోంమంత్రి అనిత ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడారు. హోంమంత్రిలాగా తప్పుడు మాటలు మాట్లాడేవారినే క్రిమినల్స్ అంటారు, విజయకీలాద్రి మీద ఆలయాలు కట్టేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కానీ జగన్ పర్మిషన్ ఇచ్చి ఆలయాల నిర్మాణాలకు సహకరించారు. పీఠాల నిర్మాణాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు వాటిని లాగేసుకున్నారు. కేవలం జగన్ మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడారు. చంద్రబాబు హయాంలోనే హిందూ ధర్మంపైన దాడులు జరుగుతున్నాయి. వక్ఫ్ చట్టాన్ని ఆమోదించి చంద్రబాబు ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారు’’ అని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.