వైయస్‌ జగన్‌ దెబ్బకు కుప్పం చేరిన చంద్రబాబు

చంద్రబాబు లాంటి దగాకోరు ప్రపంచంలో ఎక్కడా ఉండరు

ఫ్లెక్సీల్లో జూ.ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టుకోవాల్సిన దుస్థితి బాబుకు ఏర్పడింది

కుప్పంలో కూరుకుపోయే నువ్వు.. మళ్లీ అధికారంలోకి రావడం కల బాబూ..

నారా లోకేష్‌ ముఖ్యమంత్రి మెటీరియల్‌ కాదు..

లోకేష్‌ను మంచి డాక్టర్‌కు చూపించి వైద్యం ఇప్పించండి

వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బకు చంద్రబాబు కుప్పానికి పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కనీసం నామినేషన్‌ వేయడానికి కూడా కుప్పం నియోజకవర్గానికి రాని చంద్రబాబును కుప్పంలో మూడు, నాలుగు రోజులు ఉండేలా చేశారన్నారు. కుప్పంలో ఓడిపోయింది ప్రజాస్వామ్యం కాదు.. చంద్రబాబే అని, రాష్ట్రమంతా అదే పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో అమలు చేయలేని చంద్రబాబు.. ప్రతిపక్షంలో మేనిఫెస్టో రిలీజ్‌ చేసి ఏం చేస్తారని ప్రశ్నించారు. నారా లోకేష్‌ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు.. లోకేష్‌ను ఎవరైనా మంచి డాక్టర్‌కు చూపించి వెంటనే వైద్యం ఇప్పించాలని నారా భువనేశ్వరిని కోరారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘చంద్రగిరిలో ఓడిపోయి కుప్పాన్ని ఆశ్రయించిన చంద్రబాబు.. కుప్పం నుంచి ఇప్పటికి 7 సార్లు గెలిచారు. కుప్పం టీడీపీకి కంచుకోటగా ఉంది. అలాంటి కుప్పంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే.. మొత్తం 89 పంచాయతీలకు  వైయస్‌ఆర్‌ సీపీ 74 పంచాయతీల్లో విజయం సాధించింది. టీడీపీ కేవలం 14 పంచాయతీల్లో మాత్రమే విజయం సాధించింది. 

ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చంద్రబాబు గింజుకుంటున్నాడు.. ఓడిపోయింది ప్రజాస్వామ్యం కాదు.. చంద్రబాబే అని ఆయనకూ తెలుసు. చంద్రబాబు కుప్పానికి వెళ్లినందుకు టీడీపీ కార్యకర్తలు అమితానందంగా ఉన్నారు. నామినేషన్‌ వేయడానికి కూడా కుప్పం రాని చంద్రబాబు నాయుడు.. సీఎం వైయస్‌ జగన్‌ దెబ్బకు కుప్పం వెళ్లాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. సీఎం వైయస్‌ జగన్‌ గొప్పవారని కుప్పంలోని టీడీపీ నేతలే అనుకుంటున్నారు. మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిసినా.. వాటిని కూడా పట్టించుకోకుండా.. కుప్పం పరిగెత్తాడు. 

బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ బొమ్మలు పెట్టుకొని చంద్రబాబు ఫ్లెక్సీలు కట్టుకునే దుస్థితి కుప్పం నియోజకవర్గంలోనే ఏర్పడింది. 2009లో వైయస్‌ఆర్‌ ప్రభంజనం వీస్తున్నప్పుడు.. టీడీపీ గెలుపుకోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను ప్రచారానికి దించిన చంద్రబాబు.. ఆ తరువాత జూ. ఎన్టీఆర్‌ను పాతాళానికి తొక్కే ప్రయత్నం చేశారు. చివరకు జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలే చూడవద్దని అంతర్గతంగా ప్రకటనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి జూనియర్‌ ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టుకోవాల్సిన దుస్థితి మాజీ ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు వచ్చిందంటే.. అది వైయస్‌ జగన్‌ దెబ్బ వల్లే. 

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలోని నిమగ్నమై.. కుప్పానికి అన్యాయం చేశాను.. కార్యకర్తలకు అన్యాయం చేశానని సాక్షాత్తు చంద్రబాబే మైకులో కార్యకర్తల ముందు ఒప్పుకున్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం బాగుచేశారో చెప్పాలి..? పులివెందులకు నీరు ఇచ్చా.. మా కుప్పానికి నీళ్లు ఇస్తావా..? ఇవ్వవా..? అని మాట్లాడుతున్నాడు. బుద్ధి ఉందా చంద్రబాబూ..? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి కుప్పానికి నీళ్లు ఇవ్వలేకపోయావా..? పులివెందులకు నువ్వు ఇచ్చిందేమిటీ..? వైయస్‌ఆర్‌ ఏర్పాటు చేసిన ప్రాజెక్టు నీ హయాంలో పూర్తవ్వడం వల్ల పులివెందులకు నీళ్లు వచ్చాయి. 

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఒక్క సంతకంతో కేసులన్నీ ఎత్తేస్తాడట. కుప్పంలో కూరుకుపోయే నువ్వు.. మళ్లీ అధికారంలోకి వస్తానని కలలు కంటున్నావు. చంద్రగిరిని మార్చినట్లుగానే.. కుప్పాన్ని మార్చి.. మరోచోటకు వెళ్తావా..? తేల్చుకో చంద్రబాబూ.. తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లాయి. 

2014 మున్సిపల్‌ ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్‌ చేసి.. ఒక్క వాగ్దానాన్ని అయినా నెరవేర్చావా..? దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చాలా సందర్భాల్లో ఒక సామెత చెప్పేవారు.. ‘అమ్మకు అన్నం పెట్టనివాడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట’ అని. అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో అమలు చేయలేని చంద్రబాబు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో ఎలా అమలు చేయగలడా..? నీ అంత దగాకోరు మనిషి ఇంకెవరైనా ఉంటారా చంద్రబాబూ? 

నారా లోకేష్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. లోకేష్‌ వచ్చిన తరువాతే సైకిల్‌ తుక్కుగా అయిపోయిందని దయచేసి గమనించాలి. స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నాడు. సీఎం వైయస్‌ జగన్‌ గన్‌లో బుల్లెట్లు లేకే.. నువ్వు మంగళగిరిలో ఓడిపోయావా..? బుల్లెట్లు లేకే.. కుప్పంలో 14 పంచాయతీలకు పరిమితమైపోయారా? బుల్లెట్లు లేకే.. 2019లో 23 సీట్లకు దిగజారిపోయారా..? అందరు ముఖ్యమంత్రుల కొడుకులు సీఎంలు కాలేరు.. దానికి దమ్ముండాలి. 

ఎవరూ గుర్తించడం లేదు.. పట్టించుకోవడం లేదని లోకేష్‌కు ఫ్రస్టేషన్‌ వచ్చినట్టుంది. దయచేసి నారా భువనేశ్వరి హెరిటేజ్‌ గొడవలో పడి కుమారుడిని పట్టించుకోకపోవడం మంచిది కాదు. లోకేష్‌ ఏదేదో పిచ్చిపట్టినట్లుగా  మాట్లాడుతున్నాడు. ఎవరికైనా మంచి వైద్యుడికి చూపించండి. ఏకైక కుమారుడిని జాగ్రత్తగా చూసుకోండి. నారా లోకేష్‌ సీఎం మెటీరియల్‌ కాదు’ అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు చురకలు అంటించారు. 
 

Back to Top