రాజమండ్రి: జగజ్జనని చిట్స్ పేరుతో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది కాబట్టే సీఐడీ అధికారులు అరెస్టులు చేశారని, కక్షసాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ చెప్పారు. నేరానికి పాల్పడినవారిని అరెస్టు చేస్తే కక్షసాధింపు చర్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. చిట్‌ఫండ్స్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ జగజ్జనని చిట్స్ పేరుతో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి.. ఆ డబ్బుతో ప్రైవేట్ ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని, వ్యాపారాలు చేసుకుంటున్నారని సీఐడీ దర్యాప్తులో తేటతెల్లమైందన్నారు. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్‌రామ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంపీ భరత్ ఇంకా ఏం మాట్లాడారంటే.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారస్తులకు వ్యతిరేకం కాదు. వ్యాపారస్తులతో ఫ్రెండ్లీగానే ఉంటుంది. ప్రజల సొమ్ముకు గ్యారంటీ, సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అగ్రిగోల్డ్ సంస్థ కూడా వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఎవరైనా, తమ సొంత ఆస్తి తాకట్టు పెట్టి బ్యాంకు లోను తీసుకోవచ్చు. ఆ వ్యాపారం దెబ్బతిన్నా.. ఆస్తిని జప్తు చేసి డబ్బులు రికవరీ చేస్తారు. దీన్ని ఎవ్వరూ తప్పు పట్టడం లేదు. చిట్‌ఫండ్ కంపెనీలు రూల్ ప్రకారం ఫాలో అయితే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. ప్రజల డబ్బులతో ఆస్తులు కొంటున్నారు. ఫార్మా, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. చిట్స్ పాడుకున్న వ్యక్తికి ఆరు నెలల్లో డబ్బులు ఇవ్వాలి. కానీ 6-9 నెలలు పాటు తిప్పుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆదిరెడ్డి కుటుంబంలో అరెస్టులపై కక్షసాధింపు చర్యలని కొందరు విమర్శలు చేస్తున్నారు. వైయస్ జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆదిరెడ్డి తెలుగుదేశంకు అమ్ముడైపోయాడని అందుకే కక్షసాధిస్తున్నారని అంటున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయాల్సిన పనేం ఉంటుంది? అలాంటి ఉద్దేశమేమీ మాకు ఉండదు. ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు అయింది. కక్షసాధింపు చర్యలు చేపట్టాలంటే ఇంతకాలం ఎందుకు ఆగుతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి ఓటేయలేదని కక్షసాధింపు చర్యగా అరెస్టులు చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ విమర్శిస్తున్నారు. మాకు టీడీపీ ఓట్లతో అవసరం లేదు. సమస్యను పక్కదారి పట్టించి ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారు. మరో మార్గదర్శిలా.. జగజ్జనని ఆదిరెడ్డి కుటుంబం అరెస్టు వ్యవహారంలో ఎలాంటి రాజకీయాలు లేవు. ఎన్నో కంపెనీలు బోర్డులు తిప్పేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు జరగటానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వట్లేదు. మరోవైపు.. మార్గదర్శి విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాటం చేస్తున్నారు. ప్రజల డబ్బుతో భూములు కొనటం, సినిమాలు తీయటం చేస్తున్నారు. ప్రజల డబ్బుతోనే రామోజీ ఫిల్మ్ సిటీ కట్టారు. మరో చిన్న మార్గదర్శిగా జగజ్జనని చిట్‌ఫండ్స్ అని చెప్పవచ్చు. బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపితే ఎలాంటి అభ్యంతరం లేదు. నగదు లావాదేవీలతో పాటు అక్రమాలు చేశారు. ఎంతోమందిని చిట్స్ డబ్బులు ఇవ్వకుండా వేధించారు. చాలా మంది బాధితులు ముందుకు వస్తున్నారు. చిట్ డబ్బులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఒకేవేళ రియల్‌ఎస్టేట్‌లో నష్టాలు వస్తే బోర్డు తిప్పేస్తున్నారు. 30 ఏళ్ల నుంచి డ్రైవింగ్ చేస్తున్నా.. లైసెన్స్ అక్కర్లేదు అంటే చెల్లుతుందా..? 20-30 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నాం అంటున్నారు. ఇది ఎలా ఉందంటే.. 30 ఏళ్ల నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను. నాకు లైసెన్స్ అక్కర్లేదు అంటే ఎలా ఉంటుంది? లైసెన్స్ ఎక్స్‌పైరీ అయితే రెన్యువల్ చేయించుకోవాలి. యాక్సిడెంట్ అయితే.. ఎవరు సమాధానం చెబుతారు. అలాగే.. చిట్‌ఫండ్ సంస్థలు కూడా 1982 చిట్‌ఫండ్ యాక్ట్‌కు లోబడే వ్యాపారాలు చేయాలి. ఆదిరెడ్డి కుటుంబం రాజకీయాలను అడ్డుపెట్టుకునే వ్యాపారాల్లో ఈ స్థాయికి ఎదిగారు. వీరి బాధితులు చాలా మందే ఉన్నారు. వ్యాపారం చేసేవారు ఎవరైనా చట్టానికి లోబడే వ్యవహరించాలి. వీరు చూపిస్తున్న డాక్యుమెంట్స్ లో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. చిట్‌ఫండ్ యాక్ట్ ప్రకారం అరెస్టులు జరిగాయి కూడా. వీరికి కావాల్సిన వారికి అడ్వాన్స్ పేమెంట్స్ చేశారట. చిట్‌ఫండ్ వ్యాపారం చేసేవారు.. అది కాకుండా ఇతర వ్యాపారాలు చేయటానికి వీల్లేదని 1982 చట్టం చెబుతోంది. ఈ చిట్‌ఫండ్ వ్యాపారంతో పాటు నాలుగైదు రకాల వ్యాపారాలు చేస్తున్నారు. రూ.20వేల పైబడి నగదు లావాదేవీలు చేయటానికి వీల్లేదు. కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. ఆదిరెడ్డి కుటుంబం ఎలా ఎదిగిందో రాజమండ్రి ప్రజలకు తెలుసు. కోట్ల రూపాయలతో చేస్తున్న చిట్ ఫండ్స్ వ్యాపారంలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే చివరికి నష్టపోయేది ప్రజలే. జగజ్జనని చిట్‌ఫండ్స్ బాధితులు వచ్చి కలిశారు. మీడియా సమావేశంలో గోడు వెల్లబోసుకుంటామంటే రాజకీయం చేయవద్దని, పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయమన్నాను. ఇదేమీ వ్యక్తిగత వ్యవహారం కాదు. ఏదైనా తేడా వస్తే.. నష్టపోయేది ప్రజలే. తప్పు చేయకపోతే ఎందుకు యాంటిస్పేటరీ బెయిల్? తప్పు చేకపోతే కేసు వేయండి. ఎందుకు యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకున్నారు? జీఎస్టీ అంశంలో తెచ్చుకున్నారు. ఏ తప్పు చేసినా యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వటం కుదరదు. మహానాడు వస్తోందని ఆదిరెడ్డి కుటుంబాన్ని అరెస్టు చేశామనటం హాస్యాస్పదం. ఆంధ్రప్రదేశ్‌లో విప్లవాత్మకమైన సంక్షేమ పాలన జరుగుతోంది. దమ్ముంటే మహానాడులో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసేస్తామని, మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తొలగిస్తామని తీర్మానం చేయండి. అదే మహానాడులోనే మీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఎలా బుద్ధి చెబుతారో తెలుస్తుంది. చంద్రబాబు, తాను చేసిన కార్యక్రమాలు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ప్రభుత్వంపై బురద చల్లి ఓట్లు అడిగే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాన్ని ప్రజలు గమనించాలి.