వలస కార్మికుల సమస్యలను ప‌రిష్క‌రించండి

కువైట్ రాయ‌బారికి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల‌ విన‌తి

న్యూఢిల్లీ:  వలస కార్మికుల సమస్యలను ప‌రిష్క‌రించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు కువైట్ రాయ‌బారికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ‌ తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి,  రాజ్యసభ ఎంపీ మేడా రఘునాధ రెడ్డి కువైట్ రాయ‌బారిని కలిశారు. అంత‌కు ముందు, ఇదే స‌మ‌స్య‌పై భార‌త‌దేశ విదేశాంగ శాఖా మంత్రి డాక్ట‌ర్ ఎస్‌.జైశంక‌ర్‌కు తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి లేఖ రాశారు. కువైట్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికులు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు చెందిన కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న‌ట్టు కువైట్ రాయ‌బారికి వివరించారు.  కఫాలా వ్యవస్థ వలన కార్మికుడి వీసా, హోదా పూర్తిగా ఉద్యోగం ఇచ్చే వారి (కఫీల్) చేతిలో ఉంటుందని ఇది అదనుగా కార్మికుల పాస్‌పోర్టు స్వాధీనం చేసుకొని వారిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నార‌ని చెప్పారు. ఒప్పందం ప్రకారం జీతాలని అందించక పోవడం, జీతాల చెల్లింపులో జాప్యం చేయడం, సరైన మౌళిక సదుపాయాల కొరతతో అనారోగ్యం పాలవుతున్న వారికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వంటి విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కఫీల్ అనుమతి లేకుండా ఉద్యోగం మార్చుకోవడం, దేశం విడిచి వెళ్లడం లేదా వీసా రెన్యూవల్ చేయడం అసాధ్యమని, ఈ నిబందనల మూలంగా కార్మికులు దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని కువైట్ రాయబారికి వివరించారు. ఈ నేపథ్యంలో, వారి హక్కులను పరిరక్షించేందుకు, సంక్షేమాన్ని కాపాడేందుకు, సమస్యల పరిష్కారానికి కువైట్‌లో కార్మిక చట్టాల అమలులో  మరింత జాగ్రత్తలు తీసుకోవడం, కార్మిక చట్టాలను పటిష్ట పర్చడం అవసరం అన్నారు. మాన‌వ‌తా దృక్ప‌థంతో కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చొర‌వ చూపాల‌ని  కువైట్ రాయ‌బారి, అలాగే భార‌త విదేశాంగ శాఖ‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు విజ్ఞ‌ప్తి చేశారు.

Back to Top