విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఇస్తున్న ప్రాధాన్యంతో నేడు విశాఖపట్నం ప్రపంచపటంలో ప్రముఖ స్థానం సంపాదించడానికి సిద్ధమవుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అనేక ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్న కారణంగా వైజాగ్ బ్రాండ్ వాల్యూ మరింత పెరుగుతోందన్నారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఓ స్టోరీని విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క తుఫాను సమయంలో తప్ప విశాఖపై దృష్టిపెట్టని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉత్తరాంధ్రపై ఎనలేని ప్రేమ ప్రకటిస్తోంది. కాని, 2014–19 మధ్య కాలంలో కేంద్ర సర్కారు అండతో పెద్ద ప్రాజెక్టులేవీ విశాఖకు తీసుకురాలేకపోయింది. తెలుగుదేశం గద్దె దిగిపోయాక నేడు పరిస్థితి ఉత్తరాంధ్రకు అనుకూలంగా మారింది. రూ.460 కోట్లతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమగ్రాభివృద్ధి రైల్వే రంగంలో బహుముఖ ప్రగతికి దారితీస్తుంది. ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేయనున్న రైల్వేస్టేషన్ ప్రాజెక్టు విశాఖపట్నం శరవేగంతో అభివృద్ధిచెందుతున్న దశలో రావడం ఉత్తరాంధ్ర అభ్యుదయానికి రైలింజన్‌లా పనిచేస్తుంది. తెలుగుదేశం తన పాలనా కాలంలో విశాఖకు ఎలాంటి ప్రధాన ప్రాజెక్టు తీసుకురాలేకపోయింది. కాని, ఇప్పుడు ముఖ్యమంద్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో వైజాగ్ కు ముఖ్య ప్రాజెక్టు ఏదీ రాకూడదని చంద్రబాబు అండ్ కంపెనీ కోరుకోవడం విడ్డూరంగా ఉంది. బతుకుదెరువు కోసం వచ్చిన అన్ని ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకునే విశాఖపట్నం ప్రగతి ఇక నుంచి అనూహ్యరీతిలో ముందుకు సాగుతుందని ప్రధాని పర్యటన సూచిస్తోంది.