విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి తొలినుంచి మద్దతు ఇస్తున్న పార్టీ వైయస్ఆర్‌సీపీనే అని ఉత్తరాంధ్ర వైయస్ఆర్‌సీపీ జోనల్ ఇంచార్జ్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం విశాఖపట్నం దక్షిణ నియోజకరవర్గ పరిధిలోని దుర్గాలమ్మ కోవెల వద్ద వైయస్ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి, విశాఖపట్నం దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్లకు మద్దతుగా వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం, బీజేపీ పార్టీలు విశాఖ స్టీల్ ఉద్యమకారులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పధకాలు అందిస్తుందని అన్నారు. విశాఖ ను పరిపాలన రాజధానిగా ప్రకటించి వచ్చే జూన్ లో విశాఖ లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారన్నారు. విశాఖ ప్రాంతంపై జగనన్న ఉన్న ప్రేమ దీనితో వ్యక్తమవుతుందన్నారు. ప్రతీ ఇంటికీ సుపరిపాలనను డోర్ డెలివరీ చేస్తోన్న ప్రభుత్వం ఇది అన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. దక్షిణ నియోజక వర్గంలో ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నడూ లేనట్టు అభివృద్ధి చేశామన్నారు. ఇరికిరుకు సందుల్లో 100 అడుగుల, 60 అడుగుల రోడ్లను వేసింది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో విశాఖపట్నం మేయర్ గోలగాని హరి వెంకట కుమారి, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు కోలాగురువులు పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ ద్రోణంరాజు శ్రీవాస్తవ, జిల్లా గ్రంధాలయం అధ్యక్షులు కొండా రాజీవ్, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం దుర్గాలమ్మ కోవెల నుంచి పూర్ణ మార్కెట్, 35 వ వార్డు ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.