ప్రలోభాలకు గురికావొద్దు.. మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి
కైకలూరు ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
మరో 36 గంటల్లో ఎన్నికల సమరం జరగబోతోంది.
బ్యాలెట్ బద్ధలు కొట్టేందుకు సిద్ధమేనా?
వైయస్ జగన్‌కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయి.
పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి.
ఈ ఎన్నికలు ఐదేళ్ల అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయిస్తాయి.
చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవడమే.
చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే.
ఈ 59 నెలల్లో నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ.
ఈ 59 నెలల్లో 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.
పేదవాళ్లంతా ఒకవైపు.. పెత్తందార్లంతా మరోవైపున ఉన్నారు.
చంద్రబాబు ప్రలోభాలను నమ్మకండి, మోసపోకండి.
క్యాలెండర్ ఇచ్చి మరీ మీ బిడ్డ ప్రభుత్వంలో పథకాల అమలు.
మీ ఇంటికి జరుగుతున్న మంచిని ఏ ఒక్కరూ పోగొట్టుకోవద్దు.
అవ్వాతాతలకు ఇంటికే ఇచ్చే పెన్షన్లను అడ్డుకున్నారు.
అవ్వాతాతల ఉసురు పోసుకున్నారు.
59 నెలలకే జగన్ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకుని పిసికేస్తున్నారు.
ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి పథకాల డబ్బులు అడ్డుకున్నారు: సీఎం వైయస్ జగన్
కైకలూరు: చంద్రబాబు ప్రలోభాలకు గురి కావొద్దని.. మళ్లీ మోసపోవద్దని కైకలూరు ఓటర్లకు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పథకాలు కొనసాగాలన్నా.. ఇంటింటా అభివృద్ధి జరగాలన్నా మీ బిడ్డ వైయస్ జగన్‌ను మళ్లీ ఆశీర్వాదించాలని కోరారు. వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా.. నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా? అని పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం కైకలూరులో జరిగిన ఎన్నికల ప్రచార భేరిలో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారంటే..
కైకలూరు సిద్ధమా.
ఇంతటి ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. సమయం మధ్యాహ్నం 2.15 అవుతోంది. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా కూడా అందరి ముఖంలో కూడా చిక్కటి చిరునవ్వే కనిపిస్తోంది. మీ అందరి ఆప్యాయతలు,ప్రేమానురాగాల మధ్య, ఆత్మీయతల మధ్య ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు ముందుగా మీ బిడ్డ.. మీ జగన్ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.
జగన్‌కు ఓటు- ఇంటింటి అభివృద్ధికి కొనసాగింపు.
మరో 36 గంటల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతున్న సత్యం. ఇదే సాధ్యంకాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్ధం. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే అన్నది ప్రతి ఒక్కర్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. ఇవాళ నేను మీ అందరితో కూడా చెబుతున్నాను. ప్రతి ఒక్కరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ 59 నెలలకాలంలో మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ చూడనివిధంగా మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మొట్టమొదటిసారిగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి... ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ,నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే వారి చేతికే నేరుగా డబ్బులు వెళ్తున్న కార్యక్రమం ఈ 59 నెలలకాలంలో జరుగుతోంది. గతంలో ఇలా ఎప్పుడైనా చూశారా? అని మీబిడ్డ అడుగుతున్నాడు. ఇలా నేరుగా ఇన్నిన్ని బటన్లు నొక్కడం నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్లిపోవడం..గతంలో ఎప్పుడైనా జరిగిందా? జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? అక్కా జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా చెల్లి?.
మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనివిధంగా రాష్ట్రం మొత్తంమీద మీ బిడ్డ పాలన రాకముందు వరకు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు ఉంటే ఈరోజు మీబిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 59 నెలలకాలంలోనే, గతంలో జరగనివిధంగా ఏకంగా మీబిడ్డ మరో 2 లక్షల 31 వేలు ఉద్యోగాలు మీబిడ్డ ఇచ్చాడు. మనకళ్లెదుటే, మన సచివాలయంలోనే మన తమ్ముళ్లు, మన చెల్లెమ్మలు కనిపిస్తా ఉన్నారు. ఏకంగా లక్షా 35 వేలమంది మన సచివాలయాల్లోనే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తున్నారు.
విశ్వసనీయతకు అర్ధం చెప్పేలా మేనిఫెస్టో...
ఇంతకుముందు అంతా మేనిఫెస్టోలు ఇచ్చేవాళ్లు. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో కనిపించేది. రంగురంగుల కాగితాలతో ఇచ్చేవాళ్లు, పేదల ఆశలతో ఆడుకునేవాళ్లు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పని అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే పరిస్థితి.మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడూ జరగనివిధంగా,ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలలకాలంలో మీబిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి మీబిడ్డ అర్థం చెబుతూ ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలను అమలు చేశాం. అమలు చేయడంతోపాటు ఆ మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా అక్కచెల్లెమ్మలకు పంపించి, అక్కా మీరే టిక్ పెట్టండి మీబిడ్డ పాలనలో ఏం జరిగిందీ అని... ఆ అక్కచెల్లెమ్మల చిరునవ్వుల మధ్య వాళ్ల ఆశీస్సులు తీసుకుంటున్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఈ 59 నెలలకాలంలోనే జరిగిందీ అని చెప్పడానికి మీ బిడ్డ గర్వపడుతున్నాడు అని ఈసందర్భంగా తెలియజేస్తున్నాను.
మచ్చుకు మనం చేసిన కొన్ని పథకాలు చెబుతాను.
మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. నేను మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను . మీబిడ్డ ప్రభుత్వంలో జరిగిన మార్పులు చెబుతాను. మీరంతట మీరే ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఇవి ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఇవి చూశారా? గతంలో ఎప్పుడైనా కూడా ఎవరైనా చేశారా? అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతున్నాను.
ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు నాడు-నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాసుల్లో ఐఎఫ్‌పీలు, డిజిటల్ బోధన, మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగనివిధంగా 8వ తరగతికి వచ్చేసరికి మన పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబ్‌లు, మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగనివిధంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలుపెడితే 3 తరగతి నుంచే ఈరోజు టోఫెల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్లు, గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఈరోజు మన పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్.. అంటే ఒక పేజీ తెలుగు పక్కన పేజీ ఇంగ్లీష్.. మొట్టమొదటిసారిగా ఈరోజు మన పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, బడులు తెరిచేసరికే మన పిల్లలకు విద్యాకానుక, బడులల్లో మన పిల్లలకు గోరుముద్ద, తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపితేచాలు, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ జరగనివిధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం ఆ తల్లులకు ఇస్తున్నాం.
మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి, ఏ తండ్రి కూడా అప్పులపాలు కాకూడదని ఈరోజు ఇంజినీరింగ్,డాక్టర్ కోర్సులు, డిగ్రీలు చదువుతున్న పిల్లలు ఈరోజు మన రాష్ట్రంలో ఏకంగా 93 శాతం మంది ఈరోజు అప్పులపాలయ్యే పరిస్థితి లేకుండా పూర్తి ఫీజులతో ఈరోజు వాళ్లందరికీ కూడా జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన అందించాం. మొట్టమొదటిసారిగా కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొస్తూ మన డిగ్రీ కోర్సుల్లోనే ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్శిటీస్‌తో ఆన్‌లైన్ సర్టిఫైడ్ కోర్సులు, మన డిగ్రీలలోనే ఈరోజు మేండేటరీ ఇంటర్న్ షిప్.. నేను అడుగుతున్నాను ఈ చదువుల విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడూ? గతంలో ఎప్పుడైనా జరిగాయా?.
అక్కచెల్లెమ్మలను గతంలో ఏ ఒక్కరూ కూడా పట్టించుకోని పరిస్థితి. అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేట్టుగా అక్కచెల్లెమ్మలకు ఏదో ఆదాయం ఉండేట్టుగా ఆ అక్కచెల్లెమ్మలకు అండగా ఓ ఆసరా,ఓ సున్నావడ్డీ,ఓ చేయూత,ఓ కాపునేస్తం,ఓ ఈబీసీనేస్తం, ఆ అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు,అందులో ఏకంగా మరో 22 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తున్న పరిస్థితి. నేను అడుగుతున్నాను... అక్కచెల్లెమ్మల మీద ఆప్యాయత చూపిస్తూ నా అక్కచెల్లెమ్మలను కాళ్ల మీద నిలబడేట్టుగా చేస్తూ ఇంతగా అక్కచెల్లెమ్మల కోసం తాపత్రయపడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.జరిగిందా అన్నా? అక్కా గతంలో జరిగిందా? చెల్లెమ్మా గతంలో జరిగిందా? అన్నా గతంలో ఎప్పుడైనా జరిగిందా? అక్కా గతంలో ఎప్పుడైనా చూశారా?.
గతంలో ఎప్పుడూ జరగని విధంగా అవ్వాతాతలకు నేరుగా ఇంటికే రూ.3వేలు పెన్షన్, ఇంటివద్దకే పౌరసేవలు, ఇంటివద్దకే రేషన్, ఇంటి వద్దకే పథకాలు.ఇలా గతంలో ఎప్పుడైనా కూడా మన ఇంటికే ఈ పథకాలన్నీ వచ్చాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఇంటికే పెన్షన్ వచ్చిందా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఇంటివద్దకే రేషన్ వచ్చిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. గతంలో ఎప్పుడూ జరగనవిధంగా ఈరోజు జరుగుతోంది.
మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగనివిధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంట బీమా, రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా ఇన్ పుట్ సబ్సిడీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నలను చేయి పట్టుకుని నడిపిస్తూ రైతన్న కోసమే గ్రామంలో ఓ ఆర్బీకే వ్యవస్ధ.ఇంతగా రైతన్న మీద ధ్యాస పెట్టి రైతన్నకు ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా చూశామా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. అన్నా జరిగిందా? తమ్మడు జరిగిందా? అక్కా జరిగిందా?.
స్వయం ఉపాధికి తోడుగా...
స్వయం ఉపాధికి తోడుగా, అండగా సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటున్న నా డ్రైవర్ అన్నదమ్ములకు ఈరోజు ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్ననేస్తం, మత్స్యకారులు ఓ మత్స్యకార భరోసా అందించాం. పుట్ పాత్‌ల మీద ఉన్న వ్యాపారాలు చేసుకుంటున్న నా అక్కచెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, కూరగాయలు అమ్ముకునేవారు, ఫుట్ పాత్‌ల పక్కనే ఇడ్లీలు అమ్ముకునేవారు వీళ్ల గురించి ఎవరైనా గతంలో పట్టించుకున్నారా? అటువంటి వారి కోసం ఈరోజు ఓ జగనన్న తోడు, నాయీ బ్రాహ్మణులకు, రజకులుకు, టైలర్‌లకు వీరందరికీ కూడా ఓ జగనన్న చేదోడు, లాయర్లకు కూడా ఓ లా నేస్తం అందిస్తున్నాం. స్వయం ఉపాధికి ఇంత అండగా, ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. గతంలో ఉన్నాయా అన్నా? ఉన్నాయా అక్కా? ఉన్నాయా తమ్ముడు?.
పేదవాడు వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని..
గతంలో ఎప్పుడూ చూడని విధంగా పేదవాడికి.. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని... మొట్టమొదటిసారిగా ఆ పేదవాడికి ఆరోగ్య రక్షగా ఆ పేదవాడికి ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ రూ.25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా, మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఆ పేదవాడి కోసం ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, మొట్టమొదటిసారిగా ఆ పేదవాడి ఇంటికే వచ్చి జల్లెడ పడుతూ ఆ పేదవాడికి ఇంటివద్దకే మందులిస్తూ, ఇంటివద్దనే టెస్టులు చేస్తూ ఆ పేదవాడికి ఓ ఆరోగ్య సురక్ష.. ఈ కార్యక్రమాలు, ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఇంతగా పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకున్న పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? అని మీబిడ్డ అడుగుతున్నాడు .
600 రకాల సేవలతో గ్రామ సచివాలయాలు.
ఈ రోజు ఏ గ్రామానికి వెళ్లినా కూడా ఆ గ్రామంలో ఈరోజు 600 రకాల సేవలందిస్తూ ఆ గ్రామంలోనే అక్కడే కనిపిస్తుంది గ్రామ సచివాలయం, అదే గ్రామంలోనే ప్రతి 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ వ్యవస్థ, అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకేస్తే రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ ఆర్బీకే వ్యవస్థ, అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకేస్తే అక్కడే ఓ విలేజ్ క్లినిక్, అదే విలేజ్ క్లినిక్ నుంచి మరో నాలుగు అడుగులు ముందుకేస్తే అదే గ్రామంలో నాడు-నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లిషు మీడియం స్కూలు అక్కడే కనిపిస్తుంది, అదే గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, అదే గ్రామంలో నిర్మాణమవుతున్న డిజిటల్ లైబ్రరీలు, మొట్టమొదటిసారిగా నా అక్కచెల్లెమ్మల కోసం వారి రక్షణ కోసం గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, మొట్టమొదటిసారిగా నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం వాళ్ల ఫోన్ లలోనే ఓ దిశా యాప్.. ఏ అక్కచెల్లెమ్మకు ఏ ఆపద వచ్చినా ఆ పోన్‌లో దిశా యాప్ బటన్ నొక్కినా లేదా ఫోన్‌ను ఐదుసార్లు షేక్ చేసినా.... పదినిమిషాల్లో పోలీసు సోదరుడు వచ్చి చెల్లెమ్మా ఏం అయింది అని అడుగుతున్న పరిస్థితి. గతంలో ఇవన్నీ ఎప్పుడైనా చూశారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాను.
మరోవంక.. చంద్రబాబు 14 సంవత్సరాలు పాటు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు. నేను అడుగుతున్నాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అంటాడు, మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెబితే ఏ పైదవాడికైనా ఒక్కటంటే ఒక్క స్కీమ్ గానీ గుర్తుకు వస్తుందా?. అని మీబిడ్డ అడుగుతున్నాడు . 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి పేరు చెబితే ఏ ఒక్కరికీ కూడా చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమూ గుర్తుకురాదు, ఏ మంచీ గుర్తుకు రాలేదంటే ఈ పెద్దమనిషి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే ఆయన చేసే మాయలు, మోసాలు.
చంద్రబాబు మోసాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామా?.
చంద్రబాబు విఫల హామీలు.
గుర్తుందా అన్నా ఇది? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) అక్కా ఇది గుర్తుందా? అన్నా ఇది గుర్తుందా? ఇది గుర్తుందా తమ్ముడు? 2014లో ఇదే చంద్రబాబు ఆయన మేనిఫెస్టోలో ఆయన చెప్పినవి ముఖ్యమైన హామీలంటూ ఆయన స్వయంగా సంతకం పెట్టి ఈ పాంప్లెట్‌ను మీ ప్రతి ఇంటికీ పంపించాడు. పంపించిన ఈ చంద్రబాబు 2014లో ప్రజలు నమ్మారు. నమ్మి చంద్రబాబుకు ఓటేశారు. ఓటేస్తే ఆ 5 సంవత్సరాలలో ముఖ్యమైన హామీలంటూ ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన పాంప్లెట్‌లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు చేశాడా? అని మీబిడ్డ అడుగుతున్నాడు . నేను ఒకసారి చదువుతాను. మీరే చెప్పండి ఇందులో చెప్పినవి జరిగాయా? లేదా? అన్నది మీరే చెప్పండని అడుగుతున్నాను.
రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. నేను అడుగుతున్నా రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఇందులో మాఫీ అయిందా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. చంద్రబాబు చెప్పిన రెండో హామీ.. పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. నేను అడుగుతున్నాను.. రూ.14,205 కోట్లు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయైనా మాఫీ అయిందా అని మీబిడ్డ అడుగుతున్నాడు .
మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు. నేను అడుగుతున్నాను. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇక్కడ ఇన్ని వేలమంది ఉన్నారు ఏ ఒక్కరి అకౌంట్‌లో అయినా ఒక్క రూపాయైనా వేశాడా చంద్రబాబు? అని మీబిడ్డ అడుగుతున్నాను .
అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు చంద్రబాబు. ఇక్కడ ఇన్ని వేలమంది ఉన్నారు ఏ ఒక్కరికైనా 3 సెంట్ల స్థలం దేవుడెరుగు ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.
ఇంటింటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అంటే 60 నెలలు, అంటే ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇందులో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా ?. అని అడుగుతున్నాడు .
ప్రతి ఏటా రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలుమాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ పూర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తామన్నారు, చేశారా?. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు జరిగిందా ? కైకలూరులో కనిపిస్తోందా? 2014లో చంద్రబాబు స్వయానా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్‌లో ఆయన చెప్పినవాటిలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా? అని మీబిడ్డ అడుగుతున్నాడు . పోనీ ప్రత్యేకహోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. నేను అడుగుతున్నాను మరి ఇలాంటి వాళ్లను నమ్మవచ్చా? అన్నా నమ్మవచ్చా?.
మరి ఈరోజు ఏమంటున్నారు వీళ్లంతా? ఇదే కూటమి, ఇదే చంద్రబాబు ఏమంటున్నారు.. సూపర్ సిక్స్ అంటున్నారు నమ్మొచ్చా? అన్నా నమ్మొచ్చా? సూపర్ సెవెన్ అంటున్నారు నమ్మొచ్చా? అన్నా నమ్మొచ్చా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ బెంజికార్ అంట నమ్ముతారా? ఆలోచన చేయమని కోరుతున్నాను.
చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి.
ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో ఈరోజు యుద్ధం చేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నాను. అందరూ ఆలోచన చేయండి. చంద్రబాబు ప్రలోభాలకు ఏఒక్కరూ కూడా నమ్మొద్దండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. చంద్రబాబు ప్రలోభాలకు నమ్మొద్దండి. ఐదేళ్లు మీ అందరికీ క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏం చేస్తాము అని ఏ నెలలో రైతుభరోసా, ఏ నెలలో అమ్మఒడి, ఏ నెలలో చేయూత, అని ప్రతి నెలలో ఏం చేయబోతున్నాము అని ముందుగానే చెప్పి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రతి నెలా ఇస్తూ మంచి చేసిన మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి అని మీఅందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి.. ప్రతి ఏటా జరగబోయే మంచిని ఏఒక్కరూ కూడా పోగొట్టుకోకండి అని చెప్పి మీఅందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇంటింటి సంక్షేమం కోసం ఫ్యాను గుర్తుకే ఓటు.
వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే అందాలన్నా... నొక్కిన బటన్ల సొమ్ము నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మళ్లీ రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా...ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్ధానాలు, 25కి 25 ఎంపీ స్ధానాలు తగ్గేందుకే వీలే లేదు. సిద్ధమేనా? సిద్ధమేనా?.
కొల్లేరు సమస్య కూడా పరిష్కారం కావాలంటే కూడా మళ్లీ మీ బిడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలి. చెప్పినమాట ప్రకారం రమణన్నను ఇప్పటికే ఎమ్మెల్సీ చేశాను, చెప్పినమాట ప్రకారం ఎమ్మెల్సీగా చేయడమే కాకుండా కొల్లేరు ప్రాంతంలో సర్వే కూడా ఇప్పుడు జరుగుతోంది. సర్వే కూడా దాదాపుగా పూర్తైంది. సర్వేకు సంబంధించిన రిపోర్టు కూడా పూర్తయిన వెంటనే దానికి సంబంధించి ఆ తర్వాత మిగిలిన ల్యాండు ఎక్సెస్ ల్యాండ్ ఏదైనా ఉంటే అది కూడా మీఅందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఆ పంచే కార్యక్రమంలో మీ బిడ్డే మీ దగ్గరకు వచ్చి ఆ కార్యక్రమం చేస్తాడు.
ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే.. అన్నా మన గుర్తు ఫ్యాను. తమ్మడూ మన గుర్తు ఫ్యాను, అక్కా మన గుర్తు ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, చెల్లమ్మా మన గుర్తు ఫ్యాన్, మన గుర్తు ఫ్యాన్ అక్కా, మన గుర్తు ఫ్యాన్ అన్న, పెద్దమ్మా మన గుర్తు ఫ్యాన్.. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్‌లోనే ఉండాలి. బీజేపీ ఎక్కడ ఉండాలి? చెరువులో ఉండాలి.
మీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా డీఎన్ఆర్ అన్న నిలబడుతున్నాడు. మంచివాడు, సౌమ్యుడు. డీఎన్ఆర్ వల్ల మీ అందరికీ మంచి జరుగుతుందని మనసారా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్నపై మీ చల్లని దీవెనలు, అన్నపై మీ చల్లని ఆశీస్సులు సంపూర్ణంగా ఉంచాల్సిందిగా మీబిడ్డ రెండుచేతులు జోడించి పేరుపేరునా ప్రార్థిస్తున్నాడు. అదేవిధంగా బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి సునీల్.. మీలో ఒకడు, యువకుడు, ఉత్సాహవంతుడు మీ ఎంపీగా నిలబడుతున్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కోరుతున్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా తమ్ముడైన సునీల్‌పై ఉంచాల్సిందిగా సవినయంగా మీబిడ్డ రెండు చేతులు జోడించి పేరుపేరునా ప్రార్థిస్తున్నాడు అంటూ ముఖ్యమంత్రి శ్రీ.వైయస్ జగన్ ఆయన ప్రసంగాన్ని ముగించారు.