తాడేపల్లి: రాష్ట్రంలోని పేద విద్యార్ధుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం విద్యార్ధుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడితో విద్యార్ధులు చదువులను వదిలి కూలికి వెళ్ళాల్సిన దారుణమైన పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ పరిఢవిల్లింది. కూటమి సర్కార్ హయాంలో ప్రస్తుతం విద్యావ్యవస్థ కునారిల్లుతోంది. విద్యాశాఖ మంత్రి, ట్విట్టర్ కింగ్ నారా లోకేష్ నిత్యం రాజకీయ కక్ష సాధింపుల్లోనే తలమునకలు అవ్వడం వల్ల విద్యారంగంను పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఒకవైపు రాష్ట్రంలో విద్యాప్రమాణలు పూర్తిగా క్షీణిస్తుంటే, మరోవైపు విద్యార్దులు ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమవుతున్నారు. ప్రతి మూడునెలలకు గానూ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉంది. కూటమి సర్కార్ ఇప్పటి వరకు దాదాపు రూ.2800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బకాయి పెట్టింది. అలాగే ఏడాదికి చెల్లించాల్సిన వసతి దీవెన బకాయిలు రూ.1100 కోట్లు కూడా బకాయి పెట్టింది. మొత్తంగా చూస్తే రూ.3900 కోట్లు విద్య కోసం చెల్లించాల్సిన దానిని ప్రభుత్వం చెల్లించకుండా నిలిపివేసింది. దీనితో కాలేజీ యాజమాన్యాలు విద్యార్ధులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ప్రభుత్వం నుంచి పీజు రీయింబర్స్‌మెంట్ రాకపోతే విద్యార్ధులే సొంతగా చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. పరీక్షల సమయంలో హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. దీనితో పేద విద్యార్ధులు ఫీజులు చెల్లించలేక, చదువులను మధ్యలోనే ఆపివేసి కూలి పనులకు వెళ్ళే దుర్భరమైన పరిస్తితిని ఈ ప్రభుత్వం కల్పించింది. ఫీజు బకాయిలపై ఇటీవల వైయస్ఆర్‌సీపీ ఫీజుపోరు ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చింది. దీనితో బకాయిలును విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందే తప్ప, ఎంత మేరకు బకాయిలు విడదుల చేశారు, ఇంకా ఎంత చెల్లించాల్సి వుంది, ఎప్పుడు చెల్లిస్తారో చెప్పడం లేదు. వైయస్ జగన్ హయాంలో విద్యారంగంలో సంస్కరణలు వైయస్ జగన్ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదువుకునే పరిస్థితిని కల్పించారు. ప్రతి మూడు నెలలకు క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించారు. వసతి దీవెనను అమలు చేశారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చివేశారు. ఇంగ్లీష్ మీడియం చదువులు, టోఫెల్ శిక్షణ, ట్యాబ్స్, సీబీఎస్‌ఈ సిలబస్, గోరుముద్ద పేరుతో పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా పేద విద్యార్ధులకు అండగా నిలిచారు. విద్యా ద్వారానే పేదరికాన్ని నిర్మూలించాలని వైయస్ జగన్ సంకల్పం తీసుకుని పనిచేశారు. కూటమి సర్కార్‌లో కుదేలైన చదువులు రాష్ట్రంలో నేడు పదకొండు లక్షల మంది విద్యార్ధులకు బకాయిపడ్డ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణం విడుదల చేయాలి. వైయస్ జగన్ హయాంలో ప్రారంభించిన సంస్కరణలను రూపుమాపాలన్న దుష్ట ఆలోచనకు కూటమి ప్రభుత్వం పులిస్టాప్ పెట్టాలి. విద్యాశాఖ మంత్రి రాజకీయ కుతంత్రాలతో కాలం వెళ్లదీయకుండా, విద్యాప్రమాణాలను పెంచేందుకు దృష్టి సారించాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌ను నిర్వీర్యం చేయాలనే ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. యూనివర్సిటీల్లో ఎగ్జిక్యూటీవ్ కమిటీలను ఏర్పాటు చేసి, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను ప్రోత్సహించాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ఫీజు బకాయిలను కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాలి. ఇటీవల లోకేష్ ఎక్స్ వేదికగా 'కంస మామ మోసం చేస్తే... చంద్రబాబు విద్యార్ధులకు సాయం చేస్తున్నాడు' అని రాసుకున్నారు. ఈ రాష్ట్రంలో పేద విద్యార్ధులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన వైయస్ జగన్ కంస మామ కాదు... ప్రతి ఇంటిలోనూ విద్యార్ధులకు అండగా నిలిచిన మేనమామ. ఇప్పటికైనా ఇటువంటి నీచ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ తాజాగా సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లా పర్యటనలో గల్లాపెట్టే ఖాళీ అయ్యిందని, ఏం చేయలేకపోతున్నానని వాపోయారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో చంద్రబాబుకు తెలియదా? అవగాహన లేకుండానే ఆయన సూపర్ సిక్స్ అంటూ హామీ ఇచ్చారా? అన్ని వర్గాల ప్రజలకు ఆకర్షనీయమైన హామీలు ఇచ్చి, అధికారాన్ని దక్కించుకుని, ఇప్పడు వాటిని అమలు చేయడం ఇష్టంలేక గల్లాపెట్టే ఖాళీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. 2019లో ఖజానాను ఖాళీ చేసి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోతే, వైయస్ జగన్ మీలా మాట్లాడలేదు. ఎన్నికల ప్రతి హామీని అమలు చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా విద్యార్ధుల విషయంలో అత్యంత జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకున్నారు. ఇదీ మంచి పాలకుడి లక్ష్యం. ఇప్పటికైనా రాష్ట్రంలోని విద్యార్ధుల భవిష్యత్తును నాశనం చేసే ఆలోచనలు కట్టిపెట్టి, వారికి చెల్లించాల్సిన బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.