తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన గోశాలలో మూడునెలల్లో వందకు పైగా గోవులు మృతిచెందిన ఘటనపై ప్రభుత్వం తక్షణం నిజనిర్ధారణ కమిటీని వేసి, విచారణకు ఆదేశించాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన గోవుల మరణాలపై బాధ్యత కలిగిన టీటీడీ అధికారులు బయటకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తిరుమల పవిత్రత మంటగలిసే ఘటనలే వరుసగా జరుగుతున్నాయని, వీటిని చూస్తూ హిందువులు మనోవ్యథకు గురవుతున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. మూడు నెలల్లో టీటీడీ గోశాలలో నూరు గోవులు మృత్యువాత పడ్డాయని వైయస్ఆర్‌సీపీ బయటపెట్టింది. దీనిపై మంత్రి లోకేష్ బాధ్యత లేకుండా ఇదంతా దుష్ప్రచారం అంటూ చాలా తేలికగా కొట్టిపారేశారు. బీజేపీ నేత భానుప్రకాశ్ ఇందులో కొంత వాస్తవం ఉందని అంగీకరించారు. మేం ఫోటోలతో సహా గోశాలలో గోవులు ఎలా చనిపోయి పడి ఉన్నాయో ఆధారాలతో బయటపెట్టాం. బాధ్యత కలిగిన ఏ టీటీడీ అధికారి దీనిపై మాట్లాడలేదు. మీకు చిత్తశుద్ది ఉంటే గోశాలలో గోవుల మరణాలపై ఒక కమిటీని వేసి, నిజాలను ప్రజలకు, హిందూసమాజానికి వెల్లడించాలి. టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చేశారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అయినా తిరుమల క్షేత్రాన్ని పూర్తిగా రాజకీయ కేంద్రంగా తయారు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి భక్తులకు సేవలందించే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ రోజు ముగ్గురు వ్యక్తులు అన్ని భద్రతలను దాటుకుని, పాదరక్షలతో శ్రీవారి మహాద్వారం వద్దకు వెళ్ళారు. ఇది స్వామివారి క్షేత్రాన్ని అపవిత్రం చేయడం కాదా? దీనిని టీటీడీ ఎలా సమర్థించుకుంటుంది? మధ్యాహ్నం స్వామివారి నైవేథ్యం కూడా పదిహేను నిమషాల పాటు ఆలస్యం అయిందంటే స్వామివారి పట్ల టీటీడీకి, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏమిటో అర్థమవుతోంది. గోశాలల్లో పరిస్థితులను సమీక్షించాలి టీటీడీ గోశాలలో జరుగుతున్న పశు మరణాలను ఎలా సరిదిద్దుకుంటారు? మాకున్న సమాచారం ప్రకారం గోశాలలో సరైన వైద్యులు, మందులు, సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే పెద్ద సంఖ్యలో గోవులు మృత్యువాత పడుతున్నాయి. గోవుల ఫోటోలు చూస్తుంటే ఆ గోవులు ఎంత హృదయ విదారకంగా చనిపోయాయో తెలుస్తోంది. కొన్ని గోవులు సరైన పోషణ లేక బక్కచిక్కిపోయిన స్థితిలో కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని గోశాలల్లో గోవుల పట్ల వారి నిర్వాహకులు ఎంతో శ్రద్ద వహిస్తుంటారు. కానీ టీటీడీలో గోవుల పరిస్థితి అద్వాన్నంగా తయారవ్వడానికి ట్రస్ట్ బోర్డ్ నిర్లక్ష్యమే కారణం. రాష్ట్రంలోని అన్ని గోశాల్లో గోవుల పరిస్థితిపై ప్రభుత్వం తక్షణం సమీక్షించాలి. గోవుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. టీటీడీని భ్రష్టుపట్టిస్తున్న ట్రస్ట్‌బోర్డ్ టీటీడీ ట్రస్ట్‌బోర్డ్ కేవలం వీఐపీ భక్తుల సేవలకే పరిమితమైంది. సామాన్య భక్తుల అవసరాలను ఏ మాత్రం పట్టించుకోవడ లేదు. మూడు వందల రూపాయల టిక్కెట్లు తీసుకున్న వారికి కూడా దాదాపు ఆరు గంటల పాటు దర్శనానికి సమయం పడుతోందంటేనే టీటీడీ ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. లోకేష్ పీఏ రోజుకు వంద వీఐపీ దర్శనాలకు సిఫారస్ చేస్తున్నారంటే, రోజుకు ఎన్ని వేల మంది ఇలా వీఐపీ దర్శనాల పేరుతో వస్తున్నారు? వీరికి టీటీడీ స్వాగత సత్కారాలతో దర్శనాలు చేయిస్తూ తరిస్తుందో తెలుస్తోంది. తిరుమలలో ఉన్నది టీటీడీ కాదు, టీడీపీ కార్యాలయం. తెలుగుదేశం పార్టీకి చెందిన వారి నుంచి వస్తున్న సిఫారస్ లకే స్వామివారి దర్శనం పరిమితం చేశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో వీఐపీ దర్శనాలను చాలా పరిమితంగా అనుమతించేవారు. కానీ నేడు రాజకీయ సిఫారస్‌లు ఉంటే చాలు సామాన్య భక్తులను గంటల తరబడి క్యూలైన్లలోనే నిలిపివేసి, వీఐపీలకు దర్శనాలు చేయిస్తున్నారు. తిరుమల పవిత్రతనే ప్రశ్నించేలా ఎగ్ పలావ్‌ను కొండమీదికి తెచ్చుకుని తింటుంటే, ఈ భద్రత విభాగం, విజిలెన్స్ నిద్రపోతున్నాయా? తిరుమలలో బెల్ట్ షాప్‌ను నడుపుతున్నట్లుగా అధికారులే గుర్తించారు. టీటీడీ ఈఓకు, చైర్మన్‌కు ఉన్న విభేదాలతో ట్రస్ట్‌బోర్డ్‌ను పూర్తిగా భ్రష్టుపట్టించారు. పాదరక్షణలతోనే శ్రీవారి మాడవీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మతి స్థిమితం లేని వ్యక్తులుగా చూపుతున్న వారు మాఢవీదుల్లో చెలరేగిపోతున్నారు. తిరుమలలో ప్రాంక్ వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి అనేక అనాచారాలు వరుసగా జరుగుతుంటే, కూటమి ప్రభుత్వం, టీటీడీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రాష్ట్రంలో హిందూధర్మాన్ని దెబ్బతీస్తున్నారు 2014-19 మధ్యలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ గోశాలలోనూ ఇలాగే చేశారు. గోవులు మృతి చెందిందే కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. గోశాలను దూరంగా తరలించారు. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విజయవాడ నగరంలోని వీవీ నర్సరాజు రోడ్‌లోని గోశాలను కూటమి ప్రభుత్వం కూల్చేయడం జరిగింది. అలాగే ట్రెండ్‌సెట్ సమీపంలో నిర్మాణంలో అక్కడ ఉన్న వినాయకస్వామి ఆలయాన్ని కూల్చివేశారు. నరసరావుపేట, విశాఖపట్నం, క్రోసూరు, జ్యోతినాయన క్షేత్రంలో ఎక్కడపపడితే అక్కడ హిందూ ఆలయాలు, గోశాలలను కూల్చివేతలకు ఒడిగట్టారు. గత పదినెలలుగా హిందూధర్మానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెగబడింది. తిరుమల లడ్డూలో కల్తీ అంటూ మాపైన బుదరచల్లారు. వైకుంఠ ఏకాదశి నాడు నిర్లక్ష్యం కారణంగా ఆరుగురు శ్రీవారి భక్తులు మరణించారు. గోశాలలో పెద్ద ఎత్తున గోవులు మృతి చెందాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గోశాలల్లో గోవుల పరిస్థితి దారుణంగా మారింది. వాటిపైన తక్షణం ప్రభుత్వం స్పందించి గోవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతాం. తిరుమలలో స్వామీజీలపై అరాచకంగా ప్రవర్తించారు. వారిపై పెట్టిన కేసులను తొలగించాలి. స్వామిజీలపై ఈ రకమైన కక్షసాధింపు మంచిది కాదు.