రేషనలైజేషన్‌తో సచివాలయ ఉద్యోగుల్లో గందరగోళం

ప్రభుత్వ తీరుపై నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఆగ్రహం

రెండేసి సచివాలయాలకు ఒక్కో వీఆర్వో, సెక్రటరీ

ఇది కచ్చితంగా సచివాలయ ఉద్యోగులను తగ్గించే చర్య

ఉద్యోగ భద్రతపై 15 వేల మందిలో తీవ్ర ఆందోళన  

సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వ కుట్ర

నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఆక్షేపణ 

ప్రభుత్వ ఖాతా నుంచే వలంటీర్లకు గౌరవ వేతనాలు

ఆ వ్యవస్థే లేదని డిప్యూటీ సీఎం చెప్పడం దారుణం

ఇది కచ్చితంగా వాలంటీర్లను మోసం చేయడమే

తేల్చి చెప్పిన నలమారు చంద్రశేఖర్‌రెడ్డి

ఎమ్మెల్యే గంటా.. మీరు గాడిదలు కాస్తున్నారా?

అధికారుల మీద నోరుచేసుకునే అధికారం మీకెరిచ్చారు? 

విచారణ జరిపి తప్పు చేసుంటే చర్యలు తీసుకోవాలి

ఆధారాలుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి

అందరి ముందూ ఉద్యోగులను తిట్టడం సరికాదు

ఉద్యోగులను నోటికొచ్చినట్టు తిడితే ఊర్కునేది లేదు

ప్రెస్‌మీట్‌లో నలమారు చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టీకరణ

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ పెన్షనర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి. 

తాడేపల్లి: సచివాలయాల్లో రేషనలైజేషన్‌ పేరుతో ప్రభుత్వం చేస్తున్న మార్పులతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొందని, ఇది కచ్చితంగా సచివాలయ ఉద్యోగులను తగ్గించే చర్య అని వైయ‌స్ఆర్‌సీపీ పెన్షనర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆక్షేపించారు.

నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే:

గ్రామ స్వరాజ్య స్ఫూర్తి:
    గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అక్టోబర్‌ 2న, 2019న గాంధీ జయంతి రోజున ఒకేసారి దాదాపు 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించిన ఘనత నాటి సీఎం వైయస్‌ జగన్‌కు దక్కుతుంది.  అన్ని రకాల సౌకర్యాలు కల్పించి 10 మంది ఉద్యోగులతో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిట్లోకే సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించడం జరిగింది. 

కూటమి ప్రభుత్వంలో..:
    కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు తెర తీసింది. 25వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉన్నా, దాన్ని పూర్తిగా వదిలేసింది. మరో వైపు 1.27 లక్షల ఉద్యోగుల్లో 15 వేల మంది ఎక్కువ అంటూ ప్రచారం చేస్తోంది. ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం, ఉన్న ఉద్యోగాలనే తొలగించి ఉద్యోగుల పొట్ట కొట్టింది. పైగా ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు గడిచినా ఎన్నికల్లో చెప్పినట్టు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. 

రేషనలైజేషన్‌ పేరుతో..:
    రేషనలైజేషన్‌ పేరుతో జనాభా ప్రాతిపదికన సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు జీవో నెం.1 జారీ చేశారు. ఉద్యోగులను జనరల్, టెక్నికల్‌ సిబ్బందిగా విభజించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనరల్‌ విభాగాలకు కేటాయించిన సిబ్బంది విధులకు సంబంధించి జీవో ఎంఎస్‌ నెం.3 జారీ చేసిన ప్రభుత్వం, టెక్నికల్‌ విభాగాలకు కేటాయించిన సిబ్బంది విధులకు సంబంధించి త్వరలోనే మరో జీవో విడుదల చేస్తామని ప్రకటించింది.
    సచివాలయాలతో పాటు, రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఉన్న 4 వేల ఖాళీ పోస్టులకు ప్రభుత్వం మంగళం పాడాలని నిర్ణయించింది. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న యువత ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లింది. 

వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర:
    ఇన్నాళ్లు ఒక్కో సచివాలయానికి ఒక్కో వీఆర్వో ఉంటే, ఇకపై కొన్ని చోట్ల రెండేసి సచివాలయాలకు కూడా ఒక్క వీఆర్వోనే పని చేయాల్సి ఉంటుంది. రేషనలైజేషన్‌ పేరుతో పంచాయతీ కార్యదర్శుల పోస్టులను కొన్ని చోట్ల ప్రభుత్వం తీసేసింది. ఈ నిర్ణయం పట్ల పంచాయితీలు, పంచాయతీ సెక్రటరీల ప్రాముఖ్యతపై ఉద్యోగులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పంచాయితీలకు ఒకటికన్నా ఎక్కువ సచివాలయాలు ఉన్నా కూడా ఉద్యోగుల కేటాయింపు సరిగ్గా జరగలేదని ఉద్యోగులు చెబుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఒకే ఉద్యోగికి రకరకాల పనులు కేటాయించడం వలన వారిపై పనిభారం పెరగడంతోపాటు వారిలో నైపుణ్యత కొరవడమే ప్రమాదం కూడా లేకపోలేదు. 
    ప్రతి పంచాయతీలో కార్యదర్శి ఉండేలా ఒక పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలని 2024లో ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేసి పంచాయతీలకు కార్యదర్శులను నియమిస్తున్నారు. దీని వల్ల 15 వేల మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉద్యోగులపై పనిభారం పెరగడంతో పాటు ప్రజలకు అందే సేవల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉంది. 
    కేవలం జగన్‌గారికి మంచి పేరొస్తుందనే కోపంతో ప్రజలకు ఇన్నాళ్లు విశిష్ట సేవలందించిన గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేయడం తగదు. రేషనలైజేషన్‌ పేరుతో ఉద్యోగులను గందరగోళంలోకి నెట్టడం సమంజసం కాదు. 

వాలంటీర్లపై అసత్య ప్రచారాలు:
    వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ నుంచే వలంటీర్లకు గౌరవ వేతనాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి బడ్జెట్‌ ఆర్డర్‌ కూడా ఉంది. ఆ శాఖ మంత్రిగా ఉన్న పవన్‌కళ్యాణ్‌కు కనీసం ఆ మాత్రం తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. జీవోలు చూపించినా తెలియనట్టు మాట్లాడటం చూస్తే 2.60 లక్షల మంది వలంటీర్లను మోసం చేయడానికి జరుగుతున్న కుట్రని అర్థం అవుతుంది. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదల్లో వలంటీర్ల సేవలు వాడుకున్న ప్రభుత్వం, అవసరం తీరాక అసలు ఆ వ్యవస్థే లేదని చెప్పడం నిజంగా సిగ్గు చేటు. 

గంటా నోటిదురుసు:
    టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహనం కోల్పోయి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవిపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డాడు. స్థానిక మహిళలు వీధి లైట్లు, డ్రైనీజీ, తాగునీరు వంటి అనేక రకాల సమస్యలు ఎమ్మెల్యే ముందు ఏకరువు పెట్టడంతో తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై విరుచుకుపడ్డారు.
    ‘ఛీ. గాడిదలు కాస్తున్నావా? పళ్లు రాలుతాయ్‌ రాస్కెల్‌. ఛీ ఛీ’ అంటే తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుతో ఆ ఉద్యోగి కన్నీటి పర్యంతమయ్యారు. 
    ఎమ్మెల్యే తీరును పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. తమ బాగోగుల చూస్తారని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే పట్టించుకోకుండా వదిలేసిన మీరు, గాడిదలు కాస్తున్నారా రాస్కెల్‌?.
    నిజానికి ఎమ్మెల్యే గంటాకి నోటి దురుసు కొత్తకాదు. గతంలోనూ ఒక స్కూల్‌ విజిట్‌కు వెళ్లిన ఆయన, దౌర్జన్యంగా కూర్చుని అందరినీ బెదిరించారు. ఉద్యోగులు తప్పు చేస్తే, ఫిర్యాదు చేయొచ్చు. అంతేకానీ, ఒక ఎమ్మెల్యే అయినంత మాత్రాన అధికారుల మీద నోరు పారేసుకునే అధికారం గంటాకు ఎవరిచ్చారని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి నిలదీశారు.

Back to Top