తాడేపల్లి: డ్రామాలు ఆడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు రాజకీయాల్లో ఎవరూ లేరని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్కిల్ స్కామ్‌లో రాజమండ్రి జైలుకు వెళ్ళినప్పుడు చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడారో మరిచిపోయారా అని ప్రశ్నించారు. రామగిరిలో వైయస్ జగన్‌కు భద్రతావైఫల్యంను కప్పిపుచ్చుకునేందుకు అవ్వన్నీ డ్రామాలంటూ చంద్రబాబు మాట్లాడటంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే... జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న మాజీ సీఎం వైయస్ జగన్‌కు భద్రత కల్పించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ అవన్నీ అనంతపురం డ్రామాలు అని చంద్రబాబు ఎగతాళి చేశారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలంటూ ఆడినవే అసలైన డ్రామాలు. జైలు పోలీసులు మినహా మరెవ్వరూ చంద్రబాబు ఉన్న గదుల వైపు వెళ్ళే అవకాశమే లేకుండా బందోబస్త్ ఉంటే, తనకు రక్షణ లేదంటూ గగ్గోలు పెట్టడం డ్రామా కాదా? జైలుకు వెళ్ళే వరకు ఆరోగ్యంగా ఉన్న చంద్రబాబు, లోనికి వెళ్ళగానే హటాత్తుగా అలర్జీ వచ్చిందని చేసినవి నాటకాలు కాదా? జైలులో చంద్రబాబు సత్యాగ్రహం చేస్తున్నారంటూ తెలుగుదేశం వారితో డ్రామాలు ఆడించడం మరిచిపోయారా? తన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందంటూ తన పార్టీనేతలతో అబద్దాలు చెప్పించారు. డెబ్బై అయిదేళ్ళ వయస్సున్న తనతో పరుగుపందెంకు రావాలని వైయస్ఆర్‌సీపీ వారిని సవాల్ చేసిన చంద్రబాబు, జైలుకు వెళ్ళగానే ఆరోగ్యం ఆందోళనకరమని ప్రచారం చేసుకున్నారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయని, ఆయన ప్రాణాలకు దోమల వల్ల ముప్పు ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి, బరువు తగ్గారు, గుండె సమస్యలు పెరిగాయి, ఎక్కడకు వెళ్ళినా అంబులెన్స్ లేకుండా వెళ్లకూడదంటూ న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలు డ్రామాలు కాదా? రాజకీయాల్లో డ్రామాలు చేయాలంటే అది చంద్రబాబుకే సొంతం. గతంలో తన చేతికి దెబ్బతగిలిందంటూ కట్టుతో వచ్చి, ఆ కట్టులో ఒకసారి కుడిచేయి, మరోసారి ఎడమచేయి పెట్టిన ఘనుడు చంద్రబాబు. కూటమి ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు మా నాయకుడిపై బుదరచల్లుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని, కూటమి నేతలను, అక్కడ ఉన్న పోలీసులను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఒక నాయకుడు హెలికాఫ్టర్‌లో వచ్చిన తర్వాత ఆ హెలికాఫ్టర్‌ను తనకు తానుగా ఉద్దేశపూర్వకంగా పంపించివేసి, రోడ్డు మార్గంలో వెళ్తారా? హెలిపాడ్‌లో ఉన్న హెలికాఫ్టర్ వద్దకు కావాలని జనాన్ని ఎగదోసి, ఆ హెలికాఫ్టర్ దెబ్బతినాలని ఏ నాయకుడైనా కోరుకుంటాడా? నిజంగా అంతమంది జనాన్ని అక్కడకు పంపిస్తే, వారి ఒత్తిడికి అది నేలమీదకు ఒరిగిపోయి బాగా దెబ్బతినే అవకాశం ఉండదా? ఇది ఏ నాయకుడైనా కోరుకుంటారా? వచ్చిన హెలికాఫ్టర్ బరువు తక్కువగా ఉండే తేలికపాటి హెలికాఫ్టర్. నిజంగా అది జనం తాకిడి వల్ల ఒరిగి పక్కకు పడిపోతే అందులో ఉన్న చమురు ట్యాంక్ దెబ్బతింటే భారీ ప్రమాదం జరుగుతుంది కదా? ఏ నాయకుడైనా ఇది కోరుకుంటాడా? ఈ మాత్రం ఆలోచించే ఇంగితం కూటమి నాయకులకు లేదా? నిజంగా ఇలాంటివి చేయాలనుకుంటే అవి ఎవరికి సాధ్యమో రాష్ట్ర ప్రజలకు తెలియదా? శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడ్ పర్యటన ముందు రోజు నుంచి ఈ రోజు వరకు కూటమి పార్టీల నాయకులు మాట్లాడినవి చూస్తే వారి వైఖరి అర్థమవుతోంది. జగన్ గారు ఒకవైపు మాత్రమే హెలికాఫ్టర్ మాట్లాడుకున్నారు, రెండో ప్రయాణం కారులో వెళ్ళేలా మాట్లాడుకున్నారని అడ్డగోలుగా మాట్లాడారు. హెలికాఫ్టర్ ల్యాండింగ్ షెడ్యూల్ ఎలా ఇచ్చారో వీరికి తెలియదా? వైయస్ జగన్ హెలికాఫ్టర్ మీదికి జనంను పార్టీ వారే ఉసిగొల్పారు, హెలికాఫ్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతినేలా చేశారని కూడా మాట్లాడారు. హెలికాఫ్టర్ రెక్కలు ఆగకముందే జనాన్ని హెలిప్యాడ్ లోకి పార్టీ నేతలే తోలారంటూ కనీస ఇంగితజ్ఞానం లేకుండా విషం చిమ్మారు. హెలికాఫ్టర్ దెబ్బతినాలని వైయస్ఆర్‌సీపీ అనుకుంటుందా? రామగిరిలో జరిగిన భద్రతా వైఫల్యంకు ఇవిగో ఆధారాలు వైయస్ జగన్‌కు సినియాక్టర్‌ల కన్నా ఎక్కువ ఆదరణ ఉంది. అధికారం కూటమి వద్ద ఉంటే, జనం మాత్రం జగన్ వద్ద ఉన్నారనే ఏడుపు కూటమి పార్టీలది. మాజీ సీఎం, నలబైశాతం ఓటు బ్యాంక్ ఉన్న జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత ఉన్న నాయకుడు వైయస్ జగన్ ప్రజల్లోకి వస్తున్నప్పుడు ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం చేతుల్లో ఉంది. దానిని విస్మరించడం వల్లే వారిని ప్రశ్నిస్తున్నాం. హెలికాఫ్టర్ చుట్టూ ప్రజలు ఎలా వెళ్ళారో చూపించే ఫోటోలను ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఇలా రెక్కలు తిరుగుతుండగా జనం హెలికాఫ్టర్ వద్దకు ఎలా వెళ్ళగలిగారు? వారిని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? వారు తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తే జనం హెలికాఫ్టర్ దగ్గరకు ఎలా వెడతారు? ఇవి కూటమి ప్రభుత్వం ఆడుతున్న డ్రామా కాదా? 2019 ఎన్నికల సమయంలో వైయస్ జగన్ గారు విపక్ష నేతగానే ఉండి ఎన్నికల ప్రచారంకు హెలికాఫ్టర్‌లో వెళ్ళినప్పుడు పోలీసులు హెలిప్యాడ్‌లో పూర్తి భద్రత కల్పించారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా మీడియా సమావేశంలో ప్రజలు గమనించేందుకు చూపిస్తున్నాం. అప్పుడు ఎన్నికల కమిషన్ చేతుల్లో వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి పోలీసు బందోబస్త్ సక్రమంగా జరిగింది. జనంను దూరంగా ఉంచిన దృశ్యాలను గమనించవచ్చు. అప్పుడు కూడా హెలిప్యాడ్‌కు రక్షణగా వైయస్ఆర్‌సీపీ బారికేట్లు కట్టింది. దానికి పోలీసులు భద్రత కల్పించారు. దానికి సంబంధించిన అనేక ఫోటోలను ఉదాహరణగా చూపిస్తున్నాము. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేతుల్లో వ్యవస్థలు ఉండబట్టి రామగిరిలో హెలిప్యాడ్‌లో పోలీస్ బందోబస్త్ కనిపించలేదు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? దీనిపై వారు ఆడుతున్నది డ్రామాలు కావా? దెబ్బతిన్న హెలికాఫ్టర్‌పైనా ఎల్లో మీడియా వక్రీకరణలు హెలికాఫ్టర్ విండ్‌షీల్డ్ పగిలితే దానిలో పైలెట్ ఎలా వెళ్లారని ఒక మంత్రి ఎంతో తెలివితో ప్రశ్నించారు. సాధారణంగా హెలికాఫ్టర్ అన్ని విధాలుగా సిద్దంగా ఉంటే దానికి నిర్ధేశించిన వేగం, ఎత్తులో వెళతారు. అదే దానికి సమస్య ఉంటే తక్కువ ఎత్తులో, నిదానంగా వెళతారు. దీనిపైన కనీస అవగాహన లేదా? హెలికాఫ్టర్‌లు, విమానాలు డీజీసీఏ అనే కేంద్ర సంస్థ ఆధీనంలో ప్రయాణిస్తాయి. దానికి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి టీడీపీకి చెందిన ఎంపీ. ఆయన ద్వారా నివేదిక తెప్పించుకోండి. తప్పుంటే ప్రజల ముందు పెట్టండి. పోలీసులు హుటాహుటిన హెలికాఫ్టర్ వద్దకు వెళ్ళి అద్దాన్ని పరిశీలించారు. వెళ్ళాల్సిన చోటికి కాకుండా మరో చోటికి హెలికాఫ్టర్ వెళ్లిందని ఈనాడు ఒక తప్పుడు కథనాన్ని రాసింది. జనంకు డబ్బులు ఇచ్చి, హెలికాఫ్టర్ మీదికి వెళ్లాలని వైయస్ఆర్‌సీపీ నేతలు పంపించారంటూ మరో పాపపు రాతలతో కూడిన కథనం రాశారు. రామోజీ సంస్కరణసభకు వచ్చిన జనాలకు ఒకొక్కరికీ ఎంత ఇచ్చారో రామోజీ కుమారుడు కిరణ్ సమాధానం చెప్పాలి. సంస్కారం మరిచిపోయి తప్పుడు రాతలు రాస్తున్నారు. తెలుగుదేశం నేతలు ఈ రాతలు రాయిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై తప్పుడు కేసులు వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ ఉద్దేశపూర్వకంగా జనాన్ని రెచ్చగొట్టి, డీఎస్పీ నిలవరిస్తున్నా వినకుండా జనంను ప్రోత్సహించి హెలికాఫ్టర్ విండ్‌షీల్డ్‌ను పగులకొట్టించారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆయనపై కేసులు బనాయించారు. పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్‌ను కూడా మీడియా ద్వారా ప్రజలకు చూపిస్తున్నాం. ఎంత దారుణంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై ఎలాంటి అబద్దపు కేసును పెట్టారో ప్రజలు గమనించాలి. రామగిరిలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు రామగిరి హెలిప్యాడ్‌లో రక్షణ కోసం రెండంచల బారికేట్స్ కట్టుకున్నారు. దానికి రుజువుగా ఇదిగో ఫోటోలు, వీటిని కూడా మీడియా ద్వారా ప్రజలు పరిశీలించవచ్చు. కానీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో రెండంచెల భద్రతకోసం బారికేట్స్ లేవు అంటూ రాసుకున్నారు. ఈ ఫోటోలు న్యాయస్థానం ముందు కూడా పెడతాం. పోలీసుల బట్టలూడదీస్తానని వైయస్ జగన్ అన్నారని ఆక్షేపించారు. పోలీసులు ధరించే ఖాకీ యూనిఫారంకు అన్యాయం చేస్తూ చట్టాలకు విరుద్దంగా వ్యవహరిస్తారో వారి ఒంటిమీద ఖాకీ యూనిఫారం లేకుండా చేస్తామని వైయస్ జగన్ అన్నారు. దీనిలో తప్పేముందీ? మీరు తాజాగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై మీరు నమోదు చేసిన తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ను చూస్తే పోలీసులు ఎలా పనిచేస్తున్నారో ప్రజలకు అర్థమవుతోంది. హెలిప్యాడ్ వద్ద పోలీసులు ఉపయోగించే మైక్‌ను తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి పోలీసులే ఇచ్చి ఆయనతో కార్యకర్తలకు విజ్ఞప్తి చేయించారు. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మీడియా సమావేశంలో ప్రజలు గమనించేందుకు ప్రదర్శిస్తున్నాం. పోలీసులు లేరు, భద్రత ఇబ్బంది అవుతోందని, జనంను నియంత్రించాలంటూ ఆయనను పోలీసులు వేడుకున్నారు. తమ మైక్‌తోనే ఆయనతో విజ్ఞప్తులు చేయించారు. అలాంటి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై జనంను ఉసికొల్పారంటూ తప్పుడు ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేశారు? ఒకవైపు తక్కువ మంది పోలీసులు ఉన్నారు, జనంను నియంత్రించలేక పోతున్నాం, జనంను మీరు కట్టడి చేయాలంటూ ఆయన సహయం కోరిన పోలీసులు ఈ రోజు ఆయనపైనే తప్పుడు కేసు బనాయించారు. ఇదేనా ఖాకీయూనిఫాం వేసుకున్న వారు చేసేది? ఇలాంటి తప్పుడ పనులు చేస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉంటాం? బాధ్యతారహితంగా హోమంత్రి వ్యాఖ్యలు ఇక హోంమంత్రి మాట్లాడుతూ 1100 మంది పోలీసులను రామగిరి పర్యటనలో భద్రత కోసం నియమించామని చెప్పారు. పులివెందుల ఎమ్మెల్యేకు 200 మంది పోలీసులను హెలిప్యాడ్ వద్ద భద్రత కోసం నియమించాం అంటూ వైయస్ జగన్‌ను హేళనచేసేలా మాట్లాడారు. హోమంత్రి ఎకసెక్కాలు ఎక్కువ రోజులు ఇలాగే ఉండవు. మీ పదవి ఎప్పుడు చంద్రబాబు పీకేస్తాడో తెలియదు. ఇప్పటికే పవన్‌కళ్యాణ్ ద్వారా మీకు హెచ్చరిక కూడా చేయించారు. పదవిలో ఉన్నారని ఏదిపడితే అది మాట్లాడితే కుదరదు. 175 నియోజకవర్గాల్లో కూడా పులివెందుల ఎమ్మెల్యేనే మాకు ప్రత్యర్థి అని ఎన్నికల సమయంలో ప్రవర్తించారు. ఆయన గురించి చంద్రబాబు, పురంధేశ్వరీ, పవన్ కళ్యాణ్ రోజూ భజన చేశారు? ఒక పులివెందుల ఎమ్మెల్యే గురించి ఎలా కలవరపడ్డారు? పదవుల్లో ఉన్నవారు అహంకారంతో మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో ప్రజలు మీ మాటలకు సరైన సమాధానం చెబుతారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామాల్లో హింసాత్మక వాతావరణాన్ని కలిగించారు. చాలా మంది వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇళ్ళను వదిలి బయటి ప్రాంతల్లో తలదాచుకుంటున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చే వరకు వారు బయటే ఉండమనండి, వారికి రక్షణ కల్పించలేమని పోలీసులే చెబుతున్నారంటే ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో వైయస్ జగన్ గారికి భద్రత కొరవడుతోంది, సంఘ విద్రోహశక్తులను పురిగొల్పే అవకాశాలు ఉన్నాయని వైయస్ఆర్‌సీపీ ఆందోళన చెందుతోంది. వైయస్ జగన్ భద్రతపై కేంద్రం బాధ్యత తీసుకోవాలి గతంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, హోటల్‌లో క్యాంప్‌లు పెట్టి ఎమ్మెల్యేలకు ఎర వేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దానిని ప్రజాస్వామ్యం కింద చిత్రీకరించారు. ఆనాడు ఎన్టీఆర్ అమాయకుడు కాబట్టి ఆయనను బలితీసుకున్నారు. వైయస్ జగన్ గారు అర్జునుడిలా వారు పన్నిన అన్ని దుష్టవ్యూహంను ఛేదించుకుని తిరిగి క్షేమంగా బయటకు కూడా రాగలిగిన సత్తా ఉన్న నాయకుడు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దు, కూటమి ప్రభుత్వ తీరు మార్చుకోవాలని హెచ్చరిక చేస్తున్నాం. భస్మాసుర హస్తంలా మీరు చేస్తున్న పనులు భవిష్యత్తులో మీకు నష్టం చేస్తాయనే గుర్తించాలి. కేంద్రప్రభుత్వం స్పందించింది వైయస్ జగన్‌కు భద్రత కల్పించే విషయంలో బాధ్యత తీసుకోవాలి. నిన్నటి వరకు వైయస్ఆర్సీపీలో ఉన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు టీడీపీలో చేరగానే వైయస్ జగన్ చెడ్డగా కనిపిస్తున్నారా? సిగ్గులేకుండా లేఖలు రాస్తున్నారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... ఎక్సైజ్, మైనింగ్ మంత్రి కొల్లు రవీంద్ర అవినీతికి అంతు లేకుండా పోతోంది. అందుకే ఆయన ఓఎస్డీని ప్రభుత్వం తొలగించింది. ఆయనపైన కూడా ప్రభుత్వం కన్నెర్ర చేస్తే ఆ పదవులు కూడా ఉండవు. మైనింగ్‌లో వీరి అవినీతిని తట్టుకోలేక కీలకమైన పోస్ట్‌లో ఉన్న ఐఎఎస్ అధికారి సెలవుపై వెళ్లిపోయారు. అవినీతి ర్యాంకింగ్‌లో కొల్లు రవీంద్ర మొదటి స్థానంలో ఉంటారు. - సనాతన ధర్మాన్ని రక్షించడానికే ఉన్నట్లు చెప్పుకునే పవన్ కళ్యాణ్ టీటీడీ గోశాలలో జరుగుతున్న గోవుల మరణాలపై ఎందుకు స్పందించడం లేదు? అదే మా ప్రభుత్వంలో ఇటువంటివి జరిగితే ఎంత రచ్చ చేసేవారో అందరికీ తెలుసు. హిందూధర్మాన్ని కాపాడటంకు వైయస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసింది. చంద్రబాబు గుళ్ళు కూలిస్తే, వాటిని నిర్మించినది వైయస్ జగన్ ప్రభుత్వం. అంతర్వేధిలో రథంను దగ్ధం చేస్తే తక్షణం కొత్త రథాన్ని నిర్మించారు. దేవతా విగ్రహాల తలలను ఖండించిన సంఘటనల్లో వెంటనే అక్కడ అన్ని సంప్రదాయాలతో కొత్త విగ్రహాలను ప్రతిష్టించాం. రాష్ట్రంలో గోవులను రక్షించడం, గోశాలలను ఏర్పాటు చేసి ధర్మాన్ని కాపాడాం. హిందూ ధర్మాల పట్ల ఏ మాత్రం చిత్తశుద్దిలోని వ్యక్తులు పదవుల్లో ఉన్న ప్రభుత్వంలో టీటీడీ గోశాల వంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి.