బీసీలకు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ వెన్నుపోటు

వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ బీసీ పథకాలన్నింటికీ బ్రేక్‌

ఇప్పుడు బిచ్చం వేస్తున్నట్లుగా ఒకటి, రెండు పథకాలు

అవి అమలు చేయకపోయినా, చేస్తున్నట్లు భారీ ప్రచారం

అయినా బీసీలను తామే ఉద్ధరిస్తున్నట్లు గొప్పలు 

మాజీ మంత్రి సీహెచ్‌.శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజం

బీసీలపై చంద్రబాబు ప్రేమంతా కపట నాటకం

బీసీల అభివృద్ధిపై ఆయనకు ఏనాడూ చిత్తశుద్ధి లేదు

బీసీలను ఇన్నాళ్లూ ఓటు బ్యాంకుగానే వాడుకున్నాడు

బీసీలు ఎదిగితే తనకు ఇబ్బంది అని సీఎం ఆలోచన 

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియమ్‌ రద్దు వెనక కుట్ర

వైయ‌స్ జగన్‌గారు తీసుకొచ్చిన విద్యా విప్లవాన్ని నిర్వీర్యం చేశారు

మాజీ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడి

రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో బీసీ నాయకులపై దాడులు

అయనా బీసీలకు మేలు చేస్తున్నట్లు అదేపనిగా బిల్డప్‌

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ అమలు

ఇది దేశవ్యాప్తంగా అమలు. దానిపైనా చంద్రబాబు షో

ప్రెస్‌మీట్‌లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆక్షేపణ

రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ.

రాజమహేంద్రవరం: బీసీల పేరుతో సీఎం చంద్రబాబు మరోసారి మోసానికి తెర లేపారని, టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉందంటూ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి సమావేశంలో పచ్చి అబద్ధాలు చెప్పారని తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని కబ్జా చేసిన చంద్రబాబు, బీసీలను రాజకీయంగా అణగదొక్కడమే లక్ష్యంగా పని చేస్తున్నారని రాజమహేంద్రవరంలో ప్రెస్‌మీట్‌లో శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.

చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఏమ‌న్నారంటే..

బీసీల వెన్ను విరిచిన టీడీపీ:
    బీసీలు ఎప్పటికీ కులవృత్తులకే పరిమితమై, స్థోమత లేని వర్గాలుగానే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తి సీఎం చంద్రబాబు. బీసీలు ఎదిగితే తనకు ప్రమాదం అని భావించే వ్యక్తి ఆయన. ఈ సమాజంలో బీసీలు కూడా అందరితో సమానంగా ఎదగాలని, అందుకు విద్య ఒక్కటే మార్గమని మహాత్మా జ్యోతిరావు పూలే నాడు భావించారు.  పురుషులతో పాటు స్త్రీలు కూడా ఎదిగితే సమాజం పురోగమిస్తుందని నమ్మారు. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో బీసీల కుల వృత్తులు ప్రోత్సహించి వారిని అణగదొక్కాలన్న మనువాదాన్ని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. అందుకే చంద్రబాబు, ఆయన పార్టీ నాడు, నేడు బీసీల వెన్ను విరుస్తోంది.

ప్రేమ ఉంటే.. పథకాలు ఎందుకు లేవు?:
    సీఎం చంద్రబాబుకు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే, గత ప్రభుత్వంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అమలు చేసిన పథకాలు ఎందుకు కొనసాగించడం లేదు? 
    గత ఏడాది నుంచి ఎందుకు అమ్మ ఒడి అమలు చేయడం లేదు. బీసీలకు ఎంతో ప్రయోజనకారిగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యాదీవెన)ను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు. వేల కోట్ల బకాయిలు ఎందుకు పెడుతున్నారు. వసతి దీవెనను ఎందుకు ఆపేశారు?. విదేశీ విద్యా దీవెనకు ఎందుకు మంగళం పాడారు? 
    నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకుల వంటి కులవృత్తుల వారికి చేదోడు కింద ఏటా రూ.10వేల ఆర్థిక సాయం చేశాం. దాన్ని ఇప్పుడు ఎందుకు ఆపేశారు? 45 ఏళ్లు నిండిన మహిళలకు చేయూత ద్వారా నాలుగేళ్లలో రూ.75 వేలు సాయం చేశాం. చేనేతలకు నేతన్న నేస్తం కింద ఏటా రూ.24వేలు ఇచ్చాం. చేపలవేట నిషేధ సమయంలో మత్స్యకారులకు, ప్రత్యేకంగా మత్స్యకార భరోసా కింద సాయం చేశాం. 
    సన్న, చిన్నకారు రైతుల్లో ఎక్కువ మంది బీసీలే. రైతు భరోసా ఇవ్వకుండా వారినీ మోసం చేశారు. ఇన్ని చేసిన మీరు, బీసీలను ఎలా ఉద్ధరించినట్లు? వారికి ఎలా మేలు చేస్తున్నట్లు?. పైగా బీసీల మీద వల్లమాలిన ప్రేమ ఉన్నట్టు నటించడం దౌర్భాగ్యం. 
    రాష్ట్రంలో తానే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటారు. ఒకవేళ అదే నిజమనుకుంటే, రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చెందే నాటికి అందులో ప్రవేశించిన వారంతా ఉన్నత వర్గాలకు చెందిన వారే. బీసీలు ఎవరూ ఐటీ రంగంలోకి అడుగుపెట్టలేకపోయారు. ఆ విధంగా కూడా చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశారు. అదే 2004లో వైయస్సార్‌గారు సీఎం కాగానే పక్కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయడంతో, బీసీ విద్యార్థులు ఉన్నత చదువులకు దగ్గరయ్యారు. బీసీ బిడ్డలు ఇంజనీరింగ్, ఎంసీఏతో పాటు, పీజీ కోర్సులు చదివారు. 2010 తర్వాత వారంతా ఐటీలోకి ప్రవేశించారు.

గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమం:
    కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకుని ఐటీలో రాణించడానికి ఇంగ్లిష్‌లో  కోచింగ్‌ ఇప్పించానని చెప్పుకునే చంద్రబాబు, గవర్నమెంట్‌ స్కూల్స్‌లో జగన్‌ ప్రవేశపెట్టిన ఇంగ్లిష్‌ మీడియం, ఐబీ సిలబస్‌ ఎందుకు ఎత్తేసినట్టు?  జగన్‌ తీసుకొచ్చిన విద్యా విప్లవాన్ని అడ్డుకోవడం ఉద్దేశపూర్వకంగా బీసీలకు అన్యాయం చేయడం కాదా?.
    గడిచిన ఐదేళ్ల జగన్‌ పాలనలో బీసీలు ఎవరి దగ్గరా సాయం కోసం చేయి చాచింది లేదు. ఈ ప్రభుత్వం మాది అనే భరోసాతో వారున్నారు. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో బీసీల ఖాతాల్లో జమ చేసిన మొత్తం ఏకంగా రూ.1,29,866 కోట్లు. ఇంకా నాన్‌ డీబీటీ విధానంలో బీసీలపై చేసిన వ్యయం మరో రూ.1.82 లక్షల కోట్లు. ఈ స్థాయిలో గతంలో ఏ సీఎం కూడా బీసీలకు అండగా నిలవలేదు. ఆ ఘనత కేవలం జగన్‌గారికి మాత్రమే దక్కింది. 

56 కార్పొరేషన్ల ఏర్పాటు:
    56 కార్పొరేషన్లు తామే పెట్టామని చంద్రబాబు నిన్న మరో పచ్చి అబద్ధం చెప్పారు. రాష్ట్రంలో 139 కులాలు ఉండగా, వారి కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ, వైయస్సార్‌సీపీ ప్రభుత్వం 2020, అక్టోబరు 16న జీఓ ఎం ఎస్‌ నెం.26 జారీ చేసింది. జగన్‌గారు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు, చంద్రబాబు తన క్రెడిట్‌ ఇచ్చుకోవడం సిగ్గుచేటు. నిజానికి 2019కి ముందు రాష్ట్రంలో కేవలం 19 కార్పొరేషన్లు మాత్రమే ఉండగా ఎన్నికలకు ముందు హడావుడిగా మరో 13 కార్పొరేషన్లు చంద్రబాబు ఏర్పాటు చేసినా, వాటిలో కనీసం కుర్చీలు కూడా వేయలేదు. వాటికి ఎలాంటి విధివిధానాలు లేవు.
    ఇంకా బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. కానీ 2014–19 మధ్య ఆయన పాలనలో బీసీల కోసం చేసిన ఖర్చు కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే.

అప్పులు చేసినా పథకాలేవి?:
    రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్లు అప్పులున్నాయని చెబుతూనే, సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక గల్లా పెట్టె ఖాళీగా ఉందని నాలుక మడతేశారు. కరోనా ఉన్నా సరే ప్రజలను ఆదుకోవడంలో జగన్‌గారు ఎక్కడా వెనకడుగు వేయలేదు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఆయన చేసిన అప్పులు ఏడాదికి కేవలం రూ.50 వేల కోట్లు మాత్రమే. కానీ చంద్రబాబు ఈ 10 నెలల్లోనే ఏకంగా రూ.1.52 లక్షల కోట్ల అప్పులు చేశారు. అయినా ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు. అయినా, ప్రతి దానికి గత ప్రభుత్వాన్ని, జగన్‌గారిని నిందిస్తూ, కాలం వెళ్లదీస్తున్నారు.

బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకున్నది బాబే:
    స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు తానే కల్పించానని చంద్రబాబు అదే పనిగా అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవానికి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశవ్యాప్తంగా 33.37 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సవరణ వచ్చినప్పుడు ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా, దాన్ని పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు చేసిన రాజకీయ నాటకం కారణంగానే రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గాయి.
    స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, బీసీ, మైనారిటీలకు 59.85 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ.. 2019, డిసెంబర్‌ 28న జీవో నెం.176 జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత అవే రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని 2020, జనవరి 8న హైకోర్టు తీర్పు ఇవ్వగా.. రెండు రోజుల్లోనే.. అంటే 2020, జనవరి 10న చంద్రబాబు, టీడీపీ నాయకుడైన బిర్రు ప్రతాపరెడ్డి చేత రిజర్వేషన్‌ 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన సుప్రీకోర్టు ఆ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదంటూ 2020, జనవరి 15న తీర్పు చెప్పింది. ఆ ప్రకారమే 2020, మార్చి 2న హైకోర్టు కూడా స్థానిక సంస్థల్లో 50 శాతం మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని ఆదేశించింది. ఆ విధంగా బీసీలు 9.85 శాతం రిజర్వేషన్లు కోల్పోవడానికి చంద్రబాబే కారకుడయ్యాడు.  
    బీసీలకు రిజర్వేషన్లు పెంచేలా జగన్‌ ప్రయత్నిస్తే తన అనుచరులతో సుప్రీంకోర్టులో కేసులేసి అడ్డుకున్న చంద్రబాబు, 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించాడని జగన్‌ మీద తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. 

బీసీలపై దాడులు చేయిస్తూ ఉద్దరింపు మాటలు:
    బీసీలంటే చంద్రబాబుకి ఎప్పటికీ చిన్నచూపే. మొన్న మీటింగ్‌లో బీసీలు కేవలం ఆ పూట కోసం ఆలోచిస్తారని నీచంగా మాట్లాడాడు. గతంలో మత్స్యకార సోదరుల తోలు వలుస్తా అన్నాడు. నాయీ బ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు అన్నాడు. జగన్‌ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఆపేసి బీసీలను ఉద్దరిస్తానని, అందుకోసం పథక రచన చేస్తానని చెప్పడం హాస్యాస్పదం.
    కూటమి పాలనలో బీసీలపై దాడులు పెరిగిపోతున్నాయి. బీసీ నాయకులు, మాజీ మంత్రి జోగి రమేష్, అతని కుమారుడుని కేసులతో వేధిస్తున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కూడా అక్రమంగా అరెస్ట్‌ చేశారని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గుర్తు చేశారు.

Back to Top