విజయవాడ: అక్రమ కేసులు పెట్టి తనను భయపెట్టలేరని మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి సర్కార్‌ను హెచ్చరించారు. తన పై అక్రమంగా కేసు పెట్టి ఏదో సాధించాలనుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు మాకు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాబు కుర్చీ కోసం సొంత పుత్రుడు.. దత్తపుత్రుడు పోటీపడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. మాజీమంత్రి జోగి రమేష్ ఈ రోజు సీఐడీ విచారణను హాజరయ్యారు. విచారణ అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ విచారణకు హాజరయ్యాను. నాకు తెలిసిన పూర్తి సమాచారాన్ని అధికారులకు అందించాను. టీడీపీ నేత, ఇప్పటి స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలో అసభ్యకరంగా వైయస్ జగన్ దూషించారు. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న వ్యాఖ్యలున్నాయి. ఆయన వ్యాఖ్యల పై చంద్రబాబు దగ్గరకు వెళ్లి నిరసన చేపట్టాం. మా నిరసనతోనైనా అయ్యన్న వంటి వ్యక్తులకు చంద్రబాబు బుద్ధి చెబుతారేమో అనుకున్నాను. నిరసనకు వెళితే నాపై దాడి చేశారు. నా కార్లు ధ్వంసం చేశారు. నాపై అక్రమంగా కేసు పెట్టి ఏదో సాధించాలనుకుంటున్నారు. నేను విద్యార్ధి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నాను. ఈ మధ్యే ఒక సర్వే వచ్చింది. ఈరోజు ఎన్నికలు పెడితే 75 మందికి డిపాజిట్లు గల్లంతైపోతాయి. కడుపునిండా అన్నం పెట్టిన జగనన్నను వదులుకుని పలావు పెడతానని చెప్పిన చంద్రబాబును నమ్మి ఓటేసినందుకు జనం బాధపడుతున్నారు. కేసులు పెట్టి మమ్మల్ని ఏం చేయగలరు?. ప్రజలు మీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 70 శాతం శాతం ప్రజలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. బూడిద, మట్టి ఇసుకను దోచుకుంటున్నారు. దోచుకోవడం కోసం ఆరాట పడుతున్నారు. చంద్రబాబు సీట్లో ఎవరు కూర్చోవాలో కొట్టుకుంటున్నారు. బాబు కుర్చీ కోసం సొంత పుత్రుడు.. దత్తపుత్రుడు పోటీపడుతున్నారు. మూడేళ్ల క్రితం ఘటనపై కేసుపెట్టి వేధించాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు మాకు లేదా?. న్యాయం, ధర్మం ఇంకా బ్రతికే ఉన్నాయి. న్యాయస్థానాల్లో కొట్లాడతాం. జగన్ ను చూసి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పది నెలల కాలంలో ఈ ప్రభుత్వ దుర్మార్గాలపై ప్రజలు విసిగిపోయారు. నన్ను అరెస్ట్ చేసి ఆనందం పొందాలని చూస్తున్నారు.. మంచి చేయండి.. దోచుకోవడం మానుకోండి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం. పిల్లల ఫీజులు, పేదల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. నన్ను అరెస్ట్ చేసి ఆనందం పొందాలని చూస్తున్నారు. ఎన్నాళ్లు రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతారు. ఏడాది తర్వాత రెడ్ బుక్ మడిచి ఎక్కడ పెట్టుకుంటారు. ఎల్లకాలం మీరే ఉండరు గుర్తుపెట్టుకోండి. సూపర్ సిక్స్ తో ప్రజలను మోసం చేశారు. ప్రజలకు పండుగలు లేకుండా చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. చంద్రబాబు పాలన వైఫల్యాలను ఎందుకు పత్రికల్లో రాయరు. చంద్రబాబు ఇంటికి నేను దాడికి వెళ్లలేదు. కేవలం నిరసన చేసేందుకే వెళ్లాను. మీరు మంచి పాలన ఇస్తే ప్రజలు జై కొడతారు. సీఐడీ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తాను’ అని జోగి రమేష్ పేర్కొన్నారు.