కూటమి దౌర్జన్యాలకు తెర.. తిరిగింది ఫ్యాన్‌ గిరగిర

అధికార కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి విజయకేతనం

టీడీపీ ఆశలకు గండి కొడుతూ కడప జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవం 

త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలి చున్నీ లాగిన టీడీపీ నేత 

పుల్లల చెరువులో భర్త మాట కాదని వైఎస్సార్‌సీపీకి మద్దతిచి్చన భార్య 

భర్త ఏమంటారోనని ఆపై పుట్టింటికి పయనం 

రామగిరిలో ఎస్‌ఐ సాయంతో పరిటాల చిల్లర రాజకీయం 

పెనుకొండలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ భారతి కిడ్నాప్‌.. కాకినాడ రూరల్‌లో కూటమి నేతల బరితెగింపు

 అధికార కూటమి ప్రభుత్వ బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డంకుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తన హవాను చాటుకుంది. అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. ఎక్కడికక్కడ అధికార కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు తీవ్ర బెదిరింపులకు పాల్పడినా చాలా చోట్ల వారి ఆటలు సాగలేదు. పలు చోట్ల ఎంతగా ఒత్తిడి ఎదురైనా ఎంపీటీసీ/జెడ్పీటీసీ/వార్డు సభ్యులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారుల పక్షానే నిలిచి ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పారు. 

తీవ్ర నిర్బంధాలు.. ప్రలోభాలు.. భయపెట్టడాలు.. దాడులు.. వైఎస్సార్‌సీపీ సభ్యులపైకి పోలీసుల ప్రయోగాలు.. అయినప్పటికీ అధికార కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేసినా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తాము గెలిచిన పార్టీ వైఎస్సార్‌సీపీ జెండాను గట్టిగా పట్టుకుని మరోసారి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా అధికార టీడీపీ వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. 

ఒక జడ్పీ చైర్మన్, 24 ఎంపీపీ, 17 వైస్‌ఎంపీపీ, 8 కో ఆప్షన్‌ సభ్యుల స్థానాలు మొత్తం కలిపి 50 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగగా, 40 స్థానాల్లో (ఇందులో ఒక వైస్‌ ఎంపీపీ రెబల్‌) వైఎస్సార్‌సీపీ గెలిచింది. ఆరు స్థానాల్లో టీడీపీ, రెండు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ.. ప్రలోభాలతో గట్టెక్కారు. 7 స్థానాల్లో ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది. 210 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గురువారం ఎన్నికలు నిర్వహించింది. 

ఇందులో 184 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక పూర్తయింది. వార్డు సభ్యుల పదవి ఖాళీగా ఉండటం వల్ల 16 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక రద్దయింది. మరో పది పంచాయతీల్ల్లో ఉప సర్పంచు ఎన్నిక వాయిదా పడింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన వైఎస్సార్‌ కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ముత్యాల రామగోవిందరెడ్డి ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు.  
దౌర్జన్యకాండ.. వైఎస్సార్‌ జిల్లా గోపవరంలో  వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్‌ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డిపై దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు 
 
వైఎస్సార్‌ జెడ్పీ పీఠంపై ఫ్యాన్‌ రెపరెపలు   
వైఎస్సార్‌ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ డిక్లరేషన్‌ అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం ఉదయం 10 గంటలకు సహాయ ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ వద్ద నామినేషన్‌ దాఖలు చేశారు. 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రామగోవిందురెడ్డి అభ్యరి్థత్వాన్ని మాత్రమే జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించడం, బలపర్చడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్‌ ప్రకటించారు. 

జిల్లాలోని 48 మంది జెడ్పీటీసీ సభ్యుల్లో ఒక్కరు మాత్రమే టీడీపీ సభ్యుడు. ఐదుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులను టీడీపీ నేతలు బలవంతంగా, ప్రలోభాలతో ఆ పారీ్టలోకి లాక్కున్నారు. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీకి నికరంగా 42 సభ్యుల మద్దతు ఉండగా, వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి మాతృమూర్తి వియోగంతో ఎన్నికకు హాజరు కాలేకపోయారు. దీంతో 41 మంది జెడ్పీటీసీ సభ్యులు రామగోవిందురెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  

దాడులకు తెగబడ్డ టీడీపీ శ్రేణులు 
వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌ ఎన్నికలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  టీడీపీ కార్యకర్తలు యథేచ్ఛగా దాడులకు తెగించారు. రెండు కార్లలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన 14 మంది వార్డు సభ్యులు రాగా, గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని పెద్దమ్మ గుడి వద్ద పోలీసులు వారిని నిలిపేశారు. 

అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలని చెప్పడంతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్‌ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి కారు దిగబోయాడు. అంతలోనే వందల సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కారు వద్దకు వచ్చి అతడిపై దాడి చేస్తూ ఈడ్చుకెళ్లారు. తర్వాత ఆయన అక్కడి నుంచి తప్పించుకుని  గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి చేరుకున్నారు. కానీ మిగిలిన వార్డు సభ్యులు కారులోనే ఉండిపోయారు. దీంతో టీడీపీ నేతలు కారు అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో వాహన డ్రైవర్‌తో పాటు వార్డు మెంబర్లకు గాయాలయ్యాయి.  

పంచాయతీ కార్యాలయంలోకి చొరబడిన టీడీపీ నాయకులు 
టీడీపీ నాయకులు బచ్చల పుల్లయ్య, బచ్చల ప్రతాప్, తోట మహేశ్వరరెడ్డి, వంగనూరు మురళీధర్‌రెడ్డి, చీమల రాజశేఖరరెడ్డి, గంటా వెంకటేశ్వర్లు, బొగ్గుల సుబ్బారెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఎన్నిక జరుగుతున్న కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమేశారు.   ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి కోరం తప్పకుండా ఉండాలని చెప్పడంతో టీడీపీ నాయకులు 10వ వార్డు మెంబర్‌ కందుల బీబీ, 9వ వార్డు మెంబర్‌ షేక్‌ ఖాదర్‌ బాషా, 4వ వార్డు మెంబర్‌ కేశవ స్థానంలో నకిలీ గుర్తింపు కార్డులతో కొత్త వ్యక్తులను వార్డు సభ్యులు అని చెప్పి కార్యాలయంలోకి పంపారు.   

విచారణలో వారు వార్డు సభ్యులు కాదని నిర్ధారించారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వచ్చేందుకు కారులో ఉన్న వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు ప్రయతి్నంచగా టీడీపీ నాయకులు మళ్లీ దాడులకు పాల్పడ్డారు. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ఒంటిమిట్ట వైస్‌ ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ బెదిరింపులు, ప్రలోభాల పర్వంతో చేజిక్కించుకుంది. ఖాజీపేట ఉప మండలాధ్యక్షురాలిగా వైఎస్సార్‌సీపీ (రెబల్‌) అభ్యర్థి ముమ్మడి స్వప్న విజయం సాధించారు. రాయచోటి రూరల్‌ మండల ఉపాధ్యక్షురాలు–2గా వైఎస్సార్‌ సీపీకి చెందిన శిబ్యాల ఎంపీటీసీ సభ్యురాలు నాగ సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

త్రిపురాంతకంలో టీడీపీకి దిమ్మ తిరిగేలా షాక్‌
ప్రకాశం జిల్లాలో గురువారం రెండు ఎంపీపీలు, ఒక వైస్‌ ఎంపీపీ, కో–ఆప్షన్, నాలుగు ఉప సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు జరిగాయి. రెండు ఎంపీపీలతో పాటు వైస్‌ ఎంపీపీ, కో–ఆప్షన్‌ సభ్యుడిని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. మార్కాపురం ఎంపీపీగా బండి లక్ష్మిదేవి, త్రిపురాంతకం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ, పుల్లలచెరువు వైస్‌ ఎంపీపీగా లింగంగుంట్ల రాములు, యర్రగొండపాలెం కో–ఆప్షన్‌ సభ్యునిగా సయ్యద్‌ సాధిక్‌లు వైఎస్సార్‌సీపీ తరుఫున ఎన్నికయ్యారు. 

సృజన, కృష్ణలతో ఎంపీపీ సుబ్బమ్మ 

త్రిపురాంతకంలో ఎంపీ­టీసీ సభ్యురాలు ఎం.సృజనను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన టీడీపీకి ఆమె దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. ఎంపీపీ ఉప ఎన్నికలో పాల్గొనేందుకు టీడీపీ మద్దతు వర్గంతో వచ్చిన ఆమె వైఎస్సార్‌సీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన ఆళ్ల సుబ్బమ్మకు మద్దతుగా చేయి ఎత్తారు. దీంతో మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి ఆమె చున్నీ పట్టుకుని లాగాడు. చేయిదించమని గట్టిగా అరుస్తూ గద్దించినా సృజన చలించలేదు. 

దీంతోపాటు మేడపి గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండిపెండెంట్‌ ఎంపీ­టీసీ సభ్యుడు పి.కృష్ణ నేరుగా వచ్చి సుబ్బమ్మకు మద్దతిచ్చారు. ఫలితంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ ఎంపీపీగా ఎన్నికైంది. పుల్లల­చెరువులో కూడా బలం లేక­పో­యినా టీడీపీ కుయు­క్తులు పన్నింది. రెండు వర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీలో వైఎస్సార్‌సీపీ వైస్‌ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది.

జగనన్న పార్టీకే జై  
‘మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి వెంటే ఉంటానని మాట ఇచ్చాను. నిలబెట్టుకున్నాను. నేను మొదటి నుంచి జగనన్న అభిమానిని. ఆయన చరిష్మాతోనే ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచా. కొంత మంది నన్ను మభ్య పెట్టాలని చూ­­శారు. మూడు రోజులుగా హౌస్‌ అరెస్ట్‌ చేసి ఇప్పుడు ఎన్నిక సందర్భంగా ఇక్కడికి తీసుకొ­చ్చారు. 
– ఎం.సృజన, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం–2 ఎంపీటీసీ సభ్యురాలు

ధీరనారి... నాగేంద్రమ్మ
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం వైస్‌ ఎంపీపీ పదవికి గురువారం జరిగిన ఉప ఎన్నికలో టీడీపీకి ఓటు వేయాలని భర్త ఒత్తిడి తెచ్చినా, భార్య మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఓటు వేసి అటు నుంచి అటే పల్నాడులోని పుట్టింటికి వెళ్లింది. పుల్లల చెరువు మండలం ముటుకుల విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో పోలయ్య నైట్‌ వాచ్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య వి.నాగేంద్రమ్మ  మర్రివేముల ఎంపీటీసీ సభ్యురాలు. 

మండల వైస్‌ ఎంపీపీగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు పోలయ్యపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు.  చేసేదిలేక పోలయ్య తన భార్యతో ఓటు వేయిస్తానని చెప్పారు.  ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగానే ఆమె వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైస్‌ ఎంపీపీ పోటీలో ఉన్న రాములుకు మద్దతుగా చేయి ఎత్తారు. ఆ తర్వాత తన భర్తతో మాట పడాల్సి వస్తుందని అటునుంచి అటే పల్నాడు జిల్లా దాచేపల్లిలోని తన పుట్టింటికి వెళ్లారు.

రామగిరిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల అడ్డగింత
శ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చిల్లర రాజకీయం చేశారు. రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ను అడ్డు పెట్టుకుని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. ప్రలోభాలకు గురిచేసే యత్నం చేశారు. మొత్తంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేసి ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని భావించారు. తీవ్ర గందరగోళం మధ్య ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. 

కంబదూరు ఎంపీపీగా ఎన్నికైన లక్ష్మీదేవితో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీ తలారి రంగయ్య  

రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచారు. ఎంపీపీ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈ క్రమంలో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ ఇటీవల మరణించారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే టీడీపీ తరఫున ఒక్క మహిళా సభ్యురాలు కూడా లేకపోవడంతో ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపారు. టీడీపీ తరఫున ఒక్కరే ఉన్నారు. 

భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు టీడీపీలోకి లాక్కున్నారు. ముగ్గురూ పురుషులే కావడంతో టీడీపీ తరఫున నామినేషన్‌ వేసేందుకు అభ్యర్థి కూడా లేరు. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆరుగురు రామగిరికి వస్తుండగా.. కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌ ప్లాజా వద్దకు పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. 

హైకోర్టు ఉత్తర్వుల మేరకు బందోబస్తు మధ్య రామగిరికి తామే తీసుకెళ్తామని, మిగతా వాళ్లు రాకూడదని చెప్పారు. ఈ క్రమంలో ఆలస్యం కావడంతో నామినేషన్‌ దాఖలు చేసేందుకు గడువు మీరిందని.. ఎన్నికను మరుసటి రోజుకు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సంజీవయ్య ప్రకటించారు. దీంతో మార్గం మధ్యలో ఉన్న వైఎస్సార్‌సీపీ సభ్యులను పెనుకొండ తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. 

ఈ నేపథ్యంలో ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ అక్కడికి చేరుకుని వైఎస్సార్‌సీపీ సభ్యులతో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌కు వీడియో కాల్‌ కలిపారు. డబ్బులు, పదవులు ఆశ చూపి.. పార్టీ మారాలని వారు కోరగా.. వైఎస్సార్‌సీపీ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అనారోగ్యంగా ఉందని.. వాంతి వస్తోందని పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతి వాహనం నుంచి కిందకు దిగారు. 

వెనుకే వస్తున్న టీడీపీ నేతలు ఆమెను బలవంతంగా వారి వాహనం ఎక్కించుకుని ఉడాయించారు. మిగిలిన ఐదుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులను కర్ణాటక సరిహద్దు వరకు పోలీసులు వదిలివచ్చారు. కాగా, కూటమి పార్టీల నేతలు చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 

వ్యవస్థకు చెడ్డపేరు తెస్తోన్న ఎస్‌ఐ 
మొన్నటి వరకు సెలవులో ఉన్న రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ ఉన్నఫలంగా ఎంపీపీ ఎన్నికల సమయంలో విధులకు రావడం దేనికి? బందోబస్తులో భాగంగా రామగిరిలో డ్యూటీ ముగించుకుని వెంటనే.. ప్రత్యేక వాహనాల్లో వైఎస్సార్‌సీపీ సభ్యుల వెంట వెళ్లడం.. పరిటాల సునీత, శ్రీరామ్‌తో వీడియో కాల్స్‌ మాట్లాడించి.. బెదిరింపులకు దిగడం సబబు కాదు. 

రక్షణ కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ ప్రవర్తించాడు. గత ఎన్నికల్లోనూ ఆయన అనంతపురం జిల్లాలో టీడీపీ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు.
– తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

కర్నూలు జిల్లాలో ఫ్యాన్‌ ప్రభంజనం
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జెడ్పీ కోఆప్షన్‌ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదర్ఖాన్‌ ఇలియాజ్‌ఖాన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణగిరి కోఆప్షన్‌ సభ్యునిగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు చిన్నషాలును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తుగ్గలి మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా మండలంలోని శభాష్‌పురం ఎంపీటీసీ సభ్యురాలు రాచపాటి రామాంజనమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెల్దుర్తి ఎంపీపీగా ఎల్‌.నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మిదేవమ్మను ఎన్నుకున్నారు. 

నందిగామ పీఠం వైఎస్సార్‌సీపీదే  
ఎనీ్టఆర్‌ జిల్లా నందిగామ మండల పరిషత్‌ పీఠాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం నిర్వహించిన ఎన్నికలో రాఘవాపురం ఎంపీటీసీ సభ్యురాలు పెసరమల్లి రమా­దేవి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

కిడ్నాప్‌ చేసి దక్కించుకున్న టీడీపీ  
పల్నాడు జిల్లా అచ్చంపేటలో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యుల్లో 16 మంది వైఎస్సార్‌ సీపీ, ఒక్కరు టీడీపీ. వారిలో గ్రంధశిరి ఎంపీటీసీ సభ్యుడు చిలకా జ్ఞానయ్య అనారోగ్యంతో మృతి చెందారు. మిగిలిన 16 మందితో ఎన్నిక నిర్వహించవలసి ఉంది. అయితే బుధవారం పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు తొమ్మిది మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేశారు. 

ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ వారికి పచ్చ కుండువాలు కప్పి బలవంతంగా ఎన్నికకు తీసుకువచ్చారు. వైఎస్సార్‌సీపీకి మద్దతిస్తున్న ఆరుగురు ఎంపీటీసీలను ఆలస్యంగా వచ్చారన్న సాకుతో ఎన్నికకు రాకుండా అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నూతన ఎంపీపీగా భూక్యా స్వర్ణమ్మ భాయి ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.   

నరసరావుపేటలో ఎన్నిక బాయ్‌కాట్‌ 
నరసరరావుపేట వైస్‌ ఎంపీపీ ఎన్నిక కోరం లేదన్న కారణంతో ఆగిపోయింది. మొత్తం 17 మంది ఎంపీటీసీలకు గాను అన్ని స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇందులో గతంలో వైస్‌ ఎంపీపీగా గెలిచిన యాంపాటి లక్ష్మీ మరణించడంతో గురువారం ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం రాత్రి ఎంపీపీ భర్త మూరబోయిన శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ మండల కనీ్వనర్‌ తన్నీరు శ్రీనిసవారావు, పాలపాడు ఎంపీటీసీ మెట్టు రామిరెడ్డిలను పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు అపహరించారు. దీనికి నిరసనగా ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు పాల్గొనలేదు.  

విడవలూరులో ఏకపక్షంగా ఎన్నిక 
నెల్లూరు జిల్లా విడవలూరు  ఎంపీపీని గురువారం ఏకపక్షంగా ఎన్నుకున్నారు. మొత్తం 14 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 12, సీపీఎం 2 స్థానాల్లో గతంలో విజయం సాధించాయి. అయినప్పటికీ బెదిరింపులతో టీడీపీ బలపరిచిన ఏకుల శేషమ్మను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  దగదర్తిలో వాయిదా వేశారు.  

విశాఖలో వైఎస్సార్‌సీపీకి నాలుగు
ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఫ్యాన్‌ జోరు పెంచింది. మొత్తం 5 ఎంపీపీ, 2 వైఎస్‌ ఎంపీపీ, ఒక కోఆప్షన్‌ మెంబర్‌కు గురువారం ఎన్నికలు జరిగాయి. వీటిలో 4 ఎంపీపీ, ఒక వైఎస్‌ ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

సీఎం సొంత జిల్లాలో టీడీపీ అరాచకం  
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గురువారం జరిగిన నాలుగు మండలాల ఎంపీపీ ఉప ఎన్నికల్లో మూడింట్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోని రామకుప్పం ఎంపీపీ స్థానాన్ని, వైస్‌ ఎంపీపీ స్థానాన్ని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. రామకుప్పంలో ఉప ఎన్నిక సందర్భంగా ఎనిమిది మంది ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ భరత్‌కృష్ణ మండల పరిషత్‌ కార్యాలయానికి బయలు దేరారు. వీరి వాహనాన్ని టీడీపీ మూకలు పథకం ప్రకారం పట్రపల్లి క్రాస్, అన్నవరం క్రాస్, రాజుపేట క్రాస్‌లో అడ్డుకున్నారు. 

ఎంపీటీసీల వాహనానికి ముందు, వెనుక కార్లు, ట్రాక్టర్లు, టెంపో వాహనాలను అడ్డుపెట్టి ముందుకు కదలకుండా చేశారు. మరి కొన్నిచోట్ల చెట్లను నరికి రోడ్డుకు అడ్డుగా వేశారు. అడ్డుగా ఉన్న వాహనాలు, చెట్లను తొలగించుకుంటూ రామకుప్పం మండల పరిషత్‌ కార్యాలయం చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. ఆ లోపు టీడీపీ ఆరుగురు ఎంపీటీసీలతో ఎంపీపీ ఎన్నికను పూర్తి చేయించుకున్నారు. చివరకు ఎంపీపీగా టీడీపీ బలపరచిన సులోచనమ్మ, వైస్‌ ఎంపీపీగా టీడీపీ బలపరచిన వెంకట్రామయ్య గౌడ్‌ గెలుపొందారు.  

ఆ మూడు మండల పరిషత్‌లు వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే.. 
తిరుపతి జిల్లాలోని తిరుపతి రూరల్‌ మండల అధ్యక్షుడిగా మూలం చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా సదుం మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా మాధవి, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్‌­సుందర్‌రాయల్‌ రెడ్డి విజయం సాధించారు. వీరు ముగ్గురూ వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులే. చిత్తూరు జిల్లా విజయపురం మండల ఉపాధ్యక్షురాలిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన కన్నెమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కో–ఆప్షన్‌ సభ్యురాలిగా వైఎస్సార్‌సీపీ బలపరచిన నసీమా ఎన్నిక­య్యా­రు. తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలోని చింతగుంట పంచాయతీ ఉప సర్పంచ్‌గా వైఎస్సా­ర్‌­సీపీ మద్దతుదారు అన్నపూర్ణ గెలుపొందారు. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె ఉప సర్పంచ్‌గా టీడీపీ బలపరచిన వెంకటరమణ గెలుపొందారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లె పంచాయతీ ఉప సర్పంచ్‌ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది.  

భయపెట్టినా..నిలబడ్డారు   
నామమాత్రపు బలం లేకపోయినా బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పన్నిన కుట్రలు భగ్నమయ్యాయి. పిట్టలవానిపాలెం ఎంపీపీ పరిధిలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 10 మంది ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీ తరఫున పోటీకి దిగిన దిందుకూరి సీతారామరాజుకు మద్దతుగా నిలిచి ఓట్లేశారు. ఆయన ఎంపీపీగా ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండల పరిషత్‌ కో–ఆప్షన్‌ సభ్యుడిగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు సయ్యద్‌ నబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం ఉప సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికకాగా, రేపల్లె మండలం పేటేరు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారు శ్రీదేవి ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండలం పెదపులివర్రు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారుడు   శ్రీనివాసరావు, పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు పలికిన వాసంతి విజయం సాధించారు. 

పశ్చిమగోదావరిలో ప్రజాస్వామ్యం ఖూనీ  
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం జరిగిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, ఉప సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ పచ్చమూకల­ు రెచి్చపోయాయి. అత్తిలిలో 20 ఎంపీటీసీ స్థానాలకు గాను ఒక ఎంపీటీసీ గల్ఫ్‌లో ఉండగా, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీకి 13, కూటమికి ఆరుగురు సభ్యుల సంఖ్యాబలం ఉంది. ఐదుగురు సభ్యులను తమవైపు తిప్పుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. 

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం నుంచి ఉదయం 13 మంది సభ్యులు బయలుదేరుతుండగా అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు ఇంటిని చుట్టుముట్టారు. రోడ్డుకు మోటారు సైకిళ్లు అడ్డంగా పెట్టి దమ్ముంటే తీసుకువెళ్లమంటూ గొడవకు దిగారు. ఒకానొక దశలో గేట్లు తోసుకుంటూ లోపలకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఎంపీటీసీ సభ్యులు కారుమూరి నివాసంలోకి వెళ్లి తలదాచుకోవాల్సి వచి్చంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక వాయిదా వేసినట్టు సమాచారం అందాక కూటమి శ్రేణులు కారుమూరి నివాసం నుంచి వెళ్లారు.

యలమంచిలిలో హైడ్రామా
కూటమి హైడ్రామా నడుమ యలమంచిలి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. 17 మంది ఎంపీటీసీలకు గాను 13 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు కాగా, నలుగురు కూటమి సభ్యులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీపీ ఎన్నిక లాంఛనమే కావాల్సి ఉంది. తమకు ఓటేయాలని వైఎస్సార్‌సీపీ నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ కూటమి సభ్యులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, అధికారులు ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. కైకలూరు వైస్‌ ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకానికి తెగబడ్డారు. 

వైఎస్సార్‌సీపీకి చెందిన భుజబలపట్నం ఎంపీ­టీసీ సభ్యుడు పెన్మత్స సూర్యనారాయణరాజును కూటమి నేతలు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకున్నారు. ఈ సన్నివేశాన్ని ఫొటోలు తీస్తున్న స్థానిక జర్నలిస్ట్‌ కురేళ్ల కిషోర్‌ను కూటమి నేతలు చితకబదారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ­టీసీని రాకుండా అడ్డుకోవడంతో నియోజకవర్గ ఇన్‌చార్జి దూలం నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేశారు. కూటమి పార్టీకి చెందిన తొమ్మిది మంది మాత్రమే ఎన్నికకు హాజరుకావడంతో కోరం లేక ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు.   

Back to Top