ఫీజు కోసం కూలీ పనికి నా ఏడేళ్ల వయసులో నాన్న చనిపోయారు. బతుకుదెరువు కోసం అమ్మమ్మ వాళ్ల ఊరు కోసిగికి వచ్చాం. మా అమ్మ భాగమ్మ కూలీ పనులకు వెళుతూ నన్ను చదివిస్తోంది. సొంతిల్లు లేదు. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు. ఫీజు చెల్లిస్తేనే ప్రాజెక్టు వర్క్‌కు అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో ఒకవైపు ఇంటర్న్‌షిప్ చేస్తూ మరోవైపు భవన నిర్మాణ పనులకు వెళుతూ ఫీజు డబ్బులు జమ చేసుకుంటున్నా. ప్రభుత్వం స్పందించి సకాలంలో ఫీజులు చెల్లిస్తే నా చదువు పూర్తి చేసుకుని ఏదైన చిరుద్యోగంతో బతుకుతా. – ఎం.రాకేష్, బీటెక్ ఈసీఈ ఫైనల్ ఇయర్, హెచ్.మురవణి, కర్నూలు జిల్లా. అమరావతి: టీడీపీ కూటమి సర్కారు పాలనలో గతి తప్పిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఊసేలేని వసతి దీవెనతో పేద కుటుంబాల్లోని పిల్లల చదువులు అగమ్యగోచరంగా మారాయి. ఒకపక్క విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా.. ఫీజులు చెల్లించకుండా పరీక్షల ముంగిట పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజులు కట్టాకే సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొన్ని కుటుంబాల్లో డబ్బులు కట్టలేక, అప్పులు పుట్టక కాలేజీ విద్యార్థులు కూలీలుగా మారుతున్న దుస్థితి దాపురించింది. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన చెల్లింపులు జరిపి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దాదాపు రూ.18,663.44 కోట్లతో 27 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం త్రైమాసికం ముగిసిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసి విద్యా సంస్థలకు వారే స్వయంగా చెల్లించడం ద్వారా జవాబుదారీతనానికి బాటలు వేసింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లూ సజావుగా, చింత లేకుండా సాగిన పిల్లల చదువులు ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యాయి. విద్యార్థుల చదువుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ధోరణి అవలంబిస్తుండటం విద్యావేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ల పేరుతో ఫీజుల్లో కొంత మొత్తమే ఇచ్చి మిగిలిన భారాన్ని పేదింటి బిడ్డలపైనే వదిలేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేశారు. విద్యార్థి కష్టపడి చదువుకుంటే ఎంత ఫీజు అయినా సరే చెల్లించేందుకు వెనుకాడలేదు. తద్వారా ఐదేళ్లలో లక్షలాది మంది విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునేలా చదువులకు పూర్తి అండగా నిలిచారు. మళ్లీ చేటు కాలం దాపురించింది..! గత ఐదేళ్లూ ఉజ్వల ప్రగతితో పురోగమించిన ఉన్నత విద్య ప్రతిష్ట కూటమి సర్కారు నిర్వాకాలతో మసకబారుతోంది. వెంటాడుతున్న ఫీజుల భయంతో విద్యార్థులు దినదిన గండంలా కళాశాలలకు వెళ్తున్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారు మెయింటెనెన్స్ ఖర్చులు అందక అలమటిస్తున్నారు. కన్న బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూలినాలి చేసైనా, మెడలో పుస్తెలు తాకట్టు పెట్టైనా అప్పులు తెచ్చి కళాశాలలకు రూ.వేలకు వేలు ఫీజులు కడుతున్నారు. కూటమి ప్రభుత్వ కుటిల పన్నాగంతో పేద పిల్లలకు ఈ దుర్గతి దాపురించింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజుల చెల్లింపులపై షెడ్యూల్ విధానాన్ని గాలికొదిలేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకు జమ చేస్తామని ప్రకటించింది. త్రైమాసికం విధానాన్ని పూర్తిగా ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది. ముగుస్తున్న విద్యా సంవత్సరం.. షెడ్యూల్ ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులకు టీడీపీ కూటమి సర్కారు స్వస్తి పలికింది. 2024 – 25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.3,900 కోట్లు చెల్లించాలి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో రూ.3,900 కోట్లు కూడా కలిపితే మొత్తం రూ.7,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. ఫీజుల కింద ఇప్పటివరకు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన రూ.300 కోట్లు పాక్షికంగా మాత్రమే జమ అయినట్లు కాలేజీలు చెబుతున్నాయి. ఇక 2025–26 విద్యా సంవత్సరానికి రూ.3,900 కోట్లు అవసరం అయితే బడ్జెట్‌లో కూటమి సర్కారు కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపింది. బడ్జెట్‌లో తగిన మేరకు కేటాయింపులు చేయకపోవడం విద్యా వ్యవస్థపై సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. హాస్టల్ మెయింటెనెన్స్ డబ్బులేవి? కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకపక్క ఫీజుల గండంతోపాటు మరోపక్క వసతి దీవెన (పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్–ఎంటీఎఫ్) ఊసే లేకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో వసతి దీవెనలో విద్యార్థులకు ఖర్చుల కింద రూ.4 వేల నుంచి రూ.10 వేల మధ్య స్లాబ్ పెట్టి మాత్రమే ఇవ్వగా వైఎస్ జగన్ పాలనలో ఆ విధానాన్ని తొలగించి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4,275.76 కోట్లు అందచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్ (హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు) రూ.1,100 కోట్లు చెల్లించకపోవడంతో ఖర్చుల కోసం పిల్లలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. నాడు నిశ్చింతగా చదువులు.. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా విద్యా వ్యవస్థలో పారదర్శకత, పేదింటి తల్లిదండ్రుల పట్ల విద్యా సంస్థలు జవాబుదారీతనంతో నడుచుకోవడం, ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు త్రైమాసికాల వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏటా షెడ్యూల్ ప్రకారం సకాలంలో నిధులను విడుదల చేస్తూ చింతలేని చదువులు అందించింది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను ఏప్రిల్‌లో ప్రాసెస్ చేసి షెడ్యూల్ ప్రకారం మే నెలలో చెల్లింపులు చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకుండా, పిల్లల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తుంగలో తొక్కింది. 2024 ఏడాదికి సంబంధించి మే, ఆగస్టు, నవంబర్ నెలల్లో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు, ఏప్రిల్–మేలో ఇవ్వాల్సిన వసతి దీవెన (హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు) నిధులను తొక్కిపెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ప్రైవేటులో పీజీకి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని చెప్పి విద్యార్థులను నిలువునా ముంచేసింది. ఫీజుల అప్పు ప్రభుత్వమే తీర్చాలి ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. గత ప్రభుత్వలో టంచన్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేది. రెండేళ్ల పాటు చదువుకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఇవ్వలేదు. దీంతో పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంట్లో వాళ్లు అప్పు చేసి డబ్బు కట్టారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తేగానీ ఆ అప్పు తీరదు. మా అప్పును వడ్డీతో సహా తీర్చడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – నిద్దాన తిరుమల ప్రసాద్, విద్యార్ధి, విజయనగరం జిల్లా మా పాలిట శాపం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఇంజనీరింగ్ కళాశాలలకు ఇవ్వడం లేదు. కౌన్సిలింగ్‌లో ఉచిత సీటు వచ్చినా ఫీజు కింద రూ.22 వేలు చెల్లించాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం మాలాంటి పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. – రెడ్డి మహమ్మద్, ఈఈఈ, సెకండ్ ఇయర్ విద్యార్ధి, అన్నమయ్య జిల్లా అప్పులు చేయాల్సి వస్తోంది నూజివీడులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతున్నా. నాన్న ట్రాక్టర్ డ్రైవర్. అమ్మ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీ. జగనన్న విద్యాదీవెన పథకంతో రెండేళ్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుకున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజులు చెల్లించలేదు. ఇప్పటికే రూ.47 వేలు అప్పుచేసి కాలేజీకి కట్టాం. ఈ ఏడాది మళ్లీ అప్పు చేయాల్సి వస్తోంది. – జలసూత్రం మాధవి, విద్యార్థిని, వడ్లమాను, ఏలూరు జిల్లా పరీక్షలు వస్తున్నాయి.. భయంగా ఉంది శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నాన్న లేడు. అమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ నన్ను చదివిస్తోంది. ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు. ఈనెల 22 నుంచి పరీక్షలున్నాయి. హాల్‌టికెట్ జారీ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. కళాశాలకు రూ.35 వేల వరకు కట్టాల్సి ఉంది. పేద కుటుంబం కావడంతో అప్పులు పుట్టే పరిస్థితి లేదు. – కె.మోహన్ కందా, డిగ్రీ విద్యార్ధి, శ్రీకాళహస్తి రెడ్‌బుక్‌లో విద్యార్థులూ ఉన్నారేమో! రామచంద్రపురంలోని కళాశాలలో బీటెక్ చదువుతున్నా. నాకు మూడు టర్మ్‌లకు రూ.38 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాలి. విద్యా సంవత్సరం అయిపోతున్నా ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. బహుశా విద్యా శాఖ మంత్రి రెడ్‌బుక్‌లో విద్యార్థులు కూడా ఉన్నారేమో! కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలి. – కె.భాస్కర్, బీటెక్ విద్యార్ధి, రాజమహేంద్రవరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు డిగ్రీ పూర్తి చేశా. ఇంకా రూ.9 వేలు కాలేజీకి ఫీజు చెల్లించాలి. ఫీజు మొత్తం చెల్లించాకే సర్టిఫికెట్లు తీసుకెళ్లమని చెబుతోంది. నాన్న అహమ్మద్ హుస్సేన్ దినసరి కూలి. డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక పీజీ చదవాలన్న కోరిక కలగానే మిగిలిపోయేలా ఉంది. ప్రస్తుతం ఓ ఎరువుల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నా. – షేక్ రిజ్వాన్ బాషా, డిగ్రీ విద్యార్ధి, ప్రకాశం జిల్లా