తాడేపల్లిగూడెం: టీటీడీ గోశాలలో గోవుల మృత్యుఘోషపై వైయస్ఆర్‌సీపీ వాస్తవాలను బయటపెట్టడంతో టీటీడీ, కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతున్నాయని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గోవుల మరణాలు అబద్దమంటూ బుకాయిస్తూనే, విధిలేని పరిస్థితుల్లో వాస్తవాలను అంగీకరించారని అన్నారు. శ్రీవారి క్షేత్రంలో తాము చేస్తున్న పాపాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం, టీటీడీ ఈఓ, చైర్మన్ తంటాలు పడుతున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే... తిరుపతి గోశాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వలన గోమాతలు భారీగా చనిపోతున్నాయి. గోశాల యాజమాన్యం గోవుల ఆలనాపాలన సరిగా చూడకపోవడంతో ఈ దారుణం జరిగింది. దీనిపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వాస్తవాలను మీడియా ముందుకు తీసుకురావడంతో యావత్త్ హిందూసమాజం నివ్వెరపోయింది. హిందువుల మనోభావాలను గౌరవించే వ్యక్తిగా, టీటీడీ చైర్మన్ గా పనిచేసిన అనుభవంతో గోవులు మరణాలను చూసి, టీటీడీ నిర్లక్ష్యంను ఎండగట్టేందుకు ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. దానిని సరిదిద్దుకోకుండా ప్రభుత్వం రాజకీయం చేయడం దుర్మార్గం. గోవుల సంరక్షణపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్‌కి పాల్పడుతోంది. ఆఖరుకి ప్రభుత్వాధికారి అయిన టీటీడీ ఈవో శ్యామలారావు టీడీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అజెండాను మోయడమే లక్ష్యంగా ఆయన వైయస్సార్సీపీ మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఫేక్ అంటూనే వాస్తవాలను ఒప్పుకున్నారు గోశాలలో గోవులు చనిపోవడంపై భూమన కరుణాకర్‌రెడ్డి ఆధారాలతో సహా వివరాలను బయటపెడితే చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సహా టీటీడీ అధికారులు అదంతా ఫేక్ ప్రచారం అంటూ కొట్టిపారేశారు. అదేరోజు టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు భానుప్రకాష్‌రెడ్డి వైయస్సార్సీపీపై ఆరోపణలు చేస్తూనే గోవులు చనిపోవడం నిజమేనని అంగీకరించారు. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇవన్నీ ఫేక్ న్యూస్‌లు, మార్ఫింగులు అంటూనే నలభై వరకు గోవులు చనిపోయాయని ఒప్పుకున్నాడు. గోవుల మరణంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడిన మాటలు హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయి. 22 గోవులే చనిపోయాయని, ఇంట్లో మనుష్యులే చనిపోతున్నప్పుడు గోవులు చనిపోవడం తేలికైన అంశం అన్నట్టు అవహేళన చేశాడు. ఇలాంటి వ్యక్తిని చంద్రబాబు టీటీడీ చైర్మన్ ను చేశాడు. చివరికి ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టిన ఈవో శ్యామలారావు 43 గోవులు మరణించిన మాట వాస్తవమేనని అంగీకరించాడు. శ్రీవారి ఆగ్రహానికి గురికాక తప్పదు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తిరుమలలో రోజుకో అపచారం జరుగుతూనే ఉంది. శ్రీవారి ఆలయ పవిత్రతను, సంప్రదాయాలను దెబ్బతీస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అతి పవిత్రమైన తిరుమల లడ్డులో కొవ్వు కలిసిందని ప్రచారం చేసి, దానికి ఆధారాలు చూపించడంలో దారుణంగా విఫలమయ్యారు. ఆధారాలు లేకుండా కల్తీ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానం కూడా ఆక్షేపించింది. లడ్డూ కల్తీ జరిగిందంటూ సీఎం చంద్రబాబు, ఈవో శ్యామలారావు ఎలాగైతే భిన్నమైన ప్రకటనలు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారో.. ఇప్పుడు గోవుల మరణం విషయంలోనూ రకరకాల ప్రకటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పును సరిదిద్దుకోవాల్సిందిపోయి టీటీడీని రాజకీయ ప్రచారానికి వాడుకోవడం సిగ్గుచేటు. 11 నెలల్లో టీటీడీని ఎలా భ్రష్టుపట్టించారో ప్రపంచం మొత్తం చూస్తోంది. గోబెల్స్ ప్రచారం చేసి రాజకీయంగా తనకు సహకరించిన వారిని చంద్రబాబు వివిధ పదవుల్లో టీటీడీలో చేర్చారు. అందులో భాగంగానే బీఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్ పదవి, లోకేష్‌కి సహకరించిన శ్యామలారావును ఈవోగా నియమించారు. అత్యంత పవిత్రమైన తిరుమలను చంద్రబాబు రాజకీయ వేదికగా మార్చేశారు. దాని పర్యవసానంగా తిరుమలలో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. తిరుమలలో చేసిన అక్రమాలన్నింటికీ బాధ్యులైన ప్రతిఒక్కరూ తప్పకుండా శ్రీవారి ఆగ్రహానికి గురికాకతప్పదు.