వైయస్ జ‌గ‌న్‌ను అంతం చేసేందుకు కుట్రలు 

ఈ మేరకు బయటపడ్డ టీడీపీ కుటిల యత్నాలు

అందులో భాగంగానే ఆయ‌న భ‌ద్ర‌త‌ను త‌గ్గించారు 

కుట్రల్లో భాగంగానే జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడితో మాజీ డీజీపీ ఏబీవీ భేటీ

వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫైర్

ఏబీ వెంకటేశ్వరరావు విద్వేష‌ రాజ‌కీయాలను ప్రోత్స‌హిస్తున్నారు

వైయ‌స్ జ‌గ‌న్ పై  హత్యాయత్నం కేసులో నిందితుడిని కలవడంపై అనుమానాలు

ఏబీవీ రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలతో స‌మాజంలో అశాంతిని సృష్టిస్తున్నాడు 

ప్రశ్నించేవారి ఉనికిని లేకుండా చేయడానికే ఏబీవీని ప్రయోగిస్తున్నారు

మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం

హైద‌రాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వ‌హించిన‌ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయని వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఒక పథకం ప్రకారం వైయస్ జగన్‌కు హాని తలపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైయస్ జగన్‌పై హత్యాయత్నంకు పాల్పడిన నిందితుడితో తెలుగుదేశం ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా భేటీ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి ఉనికిని లేకుండా చేయడానికే ఏబీవీని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...  

ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీని టార్గెట్ చేస్తూ కూట‌మి ప్ర‌భుత్వం విద్వేషపూరిత రాజ‌కీయాల‌కు తెర‌లేపుతోంది. మాజీ ముఖ్య‌మంత్రి జగన్‌ని అంతం చేయాల‌న్న కుట్ర‌కు టీడీపీ ప‌థ‌క ర‌చ‌న చేస్తుందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో 2018 అక్టోబ‌ర్ 25న అప్పటి ప్ర‌తిప‌క్ష నేత  వైయ‌స్ జ‌గ‌న్ పై శ్రీనివాస్ అనే వ్య‌క్తి హ‌త్యాయ‌త్నంకు పాల్పడిన సంగ‌తి ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. ఈ ఘ‌ట‌న‌ను అప్పుడు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడ‌ట‌మే కాకుండా కేసును నీరుగార్చేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌ను హ‌త్యాయ‌త్నం జ‌రిగిన స‌మ‌యంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు తాజాగా వెళ్లి పరామ‌ర్శించడం చూస్తుంటే గ‌తంలో మిస్ చేసుకున్న అవ‌కాశాన్ని ఈసారి ప‌క్కాగా అమ‌లు చేయాల‌న్న కుట్ర క‌నిపిస్తోంది. ఏబీవీ ఆలోచ‌న‌పై అనుమానాలు ఉన్నాయి. మా అనుమానాల‌కు బ‌లం చేకూర్చేలా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో కూటమి సర్కార్ భ‌ద్ర‌తను  త‌గ్గించేసింది. గుంటూరు, అనంత‌పురం ప‌ర్య‌ట‌న‌ల్లో మాజీ ముఖ్య‌మంత్రికి క‌నీస భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో ఈ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిచింది. 

వైయ‌స్ జగన్‌పై హత్యాయత్నం కేసు నిర్వీర్యంకు ఏబీ వెంకటేశ్వరరావు యత్నం

జ‌గ‌న్‌ను అంతం చేయాల‌నే కుట్ర‌తోనే ఎయిర్‌పోర్ట్‌లో మెడ మీద పదునైన క‌త్తితో శ్రీనివాస్ దాడి చేశాడ‌ని, దీనికోసం ప‌క్కాగా ముందస్తు వ్యూహం ఉంద‌ని జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌పై ఎన్ఐఏ త‌న చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ కేసును త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌ణాళిక రూపొందించుకుని తాజాగా ఏబీవీ నిందితుడిని వెళ్లి క‌లిశాడు. జ‌గ‌న్‌పై త‌న‌కున్న వ్య‌క్తిగ‌త ద్వేషాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. గ‌తంలో ఏబీవీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్న స‌మ‌యంలో అత్యాధునిక ప‌రిక‌రాలు కొనుగోలు చేసి వైయ‌స్సార్సీపీ నాయ‌కుల ఫోన్ల‌ను ట్యాప్ చేసి మా పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల‌లో కీల‌క పాత్ర పోషించాడు. ఈ కార్య‌క్ర‌మానికి పాల్ప‌డిన కార‌ణంగా వైయస్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు పోస్టింగ్ ఇవ్వ‌ని అంశాన్ని మ‌న‌సులో పెట్టుకుని ఇప్పుడు ప‌థ‌కం ప్ర‌కారం విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నాడు. కులాల స‌మావేశాలు ఏర్పాటు చేసుకుని జ‌గ‌న్‌పై త‌న‌కున్న కోపాన్ని ప్ర‌ద‌ర్శించ‌డంతోపాటు ప్ర‌తిప‌క్ష నేత గురించి త‌ప్పుడు ప్ర‌చారం చేసి విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నాడు. యువ‌త‌లో చెడు ఆలోచ‌న‌లకు బీజం వేస్తున్నాడు.  

హింసను ప్రోత్సహించడమే వారి విధానం

జగన్‌పై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కేసుపై మాకు మొద‌టి నుంచీ అనేక అనుమానాలున్నాయి. నిందితుడు శ్రీనివాస్ పై గ‌తంలోనే అనేక కేసులున్నాయి. అలాంటి వ్య‌క్తి ఎయిర్‌పోర్ట్ క్యాంటీన్‌లో ఎలా చేరాడు?  ఈ క్యాంటీన్ ను టీడీపీ నాయ‌కుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చౌద‌రికి ఎవ‌రు ఇప్పించారు?  వైయ‌స్ జ‌గ‌న్ ఉన్న వీఐపీ లాంజ్‌లోకి ఈ శ్రీనివాస్ ప్ర‌వేశించి అతి ద‌గ్గ‌ర నుంచి దాడి చేయ‌డం వెనుక ఎవ‌రు ప్రోత్సాహం ఉంది?  వంటి అనేక అనుమానాల‌ను మేం వ్య‌క్తం చేసినా నాటి చంద్రబాబు ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. ఆ తర్వాత 2019 ఎన్నిక‌ల‌కు ముందు పులివెందుల‌లో వైయ‌స్ వివేకానంద‌రెడ్డిని దారుణంగా చంపేశారు. ఆయ‌న్ను ఏ విధంగా దారుణంగా చంపామ‌న్న‌ది నిందితులే పోలీసుల ముందు అంగీక‌రించారు. చంపిన త‌ర్వాత కూడా ఆయుధాల‌ను ఏం చేశామ‌న్న‌ది కూడా వివ‌రంగా పోలీసుల‌కు చెప్పారు. నిందితుల‌ను అప్రూవ‌ర్‌గా మార్పించి బెయిల్ ఇప్పించి స్వేచ్ఛ‌గా బ‌య‌ట తిప్పుతున్నారు. వివేకా హ‌త్యలో ఏదో జ‌రిగింద‌ని ప్ర‌జ‌ల‌ను డైవ‌ర్ట్ చేసేందుకు రోజుకో తప్పుడు క‌థ‌నం ప్ర‌చారంలోకి తెస్తున్నారు. వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోపాల‌ను అవ‌కాశంగా తీసుకుని తమకు గిట్ట‌ని వారి మీద బుర‌ద‌జ‌ల్ల‌డమే ప‌నిగా పెట్టుకున్నారు. 

అస‌మ‌ర్థ పాల‌న ఎవ‌రిది బాబూ? 

చంద్ర‌బాబుకి పాల‌న చేత‌కావ‌డం లేదు. సూప‌ర్ సిక్స్ హామీలు అమ‌లు చేయ‌లేక చేతులెత్తేశాడు. ఓటేయించుకుని త‌మ‌ను వంచించాడ‌ని ఏడాది కూడా కాకుండానే ప్ర‌జ‌లకు కూడా అర్థ‌మైపోయింది. దీన్ని భ‌రించ‌లేక చంద్రబాబు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప‌దే ప‌దే విధ్వంస పాల‌న అంటూ గ‌త మా వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాడు. ఉమ్మ‌డి రాష్ట్రంలో రైతుల‌కు ఉచిత విద్యుత్‌, ఫీజురీయింబ‌ర్స్‌మెంట్‌, ఆరోగ్య‌శ్రీ వంటి అనేక వినూత్న కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టి పేద‌లకు వెన్నుద‌న్నుగా నిలిచిన వైయ‌స్సార్ పాల‌న క‌న్నా గొప్పగా చంద్రబాబు ఏం చేశారు. ఆఖ‌రుకి గ‌డిచిన ఐదేళ్ల పాల‌న‌లో వైయ‌స్ జ‌గ‌న్ విద్యావ్య‌వ‌స్థ‌లో వినూత్న ఆలోచ‌న‌ల‌తో సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తే చంద్ర‌బాబు ప‌ది నెలల్లోనే నిర్వీర్యం చేశాడు. నాడు-నేడు కార్య‌క్ర‌మం ద్వారా కార్పొరేట్ స్థాయిలో పాఠ‌శాల‌ల‌ను తీర్చిదిద్దితే నేడు క‌నీనం చిన్నారుల‌కు నాణ్య‌మైన మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా అంద‌ని దుస్థితికి విద్యావ్య‌వ‌స్థ‌ను దిగ‌జార్చారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో పేద విద్యార్థులు చ‌దువులకు దూర‌మ‌వుతున్నారు. సంపద సృష్టించేలా పోర్టులు, ఫిషింగ్ హార్బ‌ర్ల నిర్మాణం చేప‌ట్టారు. నాడు-నేడు ద్వారా రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎవ‌రూ చేయ‌ని విధంగా 17 మెడిక‌ల్ కాలేజీల నిర్మాణం చేప‌డితే చంద్రబాబు వాటిని ప్రైవేటుకు క‌ట్ట‌బెట్టే ఆలోచ‌న చేస్తున్నాడు. ఈ ప్ర‌భుత్వంలో రైతు భ‌రోసా లేదు. మ‌ద్ద‌తు ధ‌ర లేదు. చంద్ర‌బాబు ఇస్తాన‌ని చెప్ప‌న అన్న‌దాత సుఖీభ‌వ హామీని ఇప్ప‌టికీ అమ‌లు చేయ‌లేదు. అప్పుల‌పై అబ‌ద్ధాలు చెప్పి త‌ప్పుడు ప్ర‌చారం చేసి జ‌గ‌న్ పై బుద‌ర‌జ‌ల్లారు.   

రాష్ట్రంలో నింయంత పాల‌న న‌డుస్తోంది

రాష్ట్రంలో నెల‌కొని ఉన్న ప‌రిస్థితులను చూస్తే నియంత పాలన న‌డుస్తోందని అర్థమవుతోంది. త‌మ‌కు న‌చ్చ‌ని వారిని, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిని ఎలా చంపాలన్న ఆలోచ‌న చేయ‌డానికి మాజీ పోలీస్ అధికారి అయిన ఏబీవీని నియమించుకున్నారు. సుదీర్ఘ కాలంపాటు సివిల్స్ స‌ర్వీస్‌లో ప‌నిచేసిన వ్య‌క్తి ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డ‌టం స‌మంజ‌స‌మేనా అని ఆలోచించుకోవాలి. ప్ర‌జ‌ల‌కు మంచి చేసి పేరు సంపాదించుకోవాల‌నే ఆలోచ‌న చేయ‌కుండా త‌ప్పుడు ఆలోచ‌న‌ల‌తో ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్కాల‌నుకోవడం అవివేకం. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకి ప్ర‌జాస్వామ్యంపై గౌర‌వం ఉంటే ఇలాంటి త‌ప్పుడు ఆలోచ‌న‌లు మానుకోవాలి. త‌న‌కు ఏదైనా అన్యాయం జ‌రిగింద‌ని భావించి ఉంటే న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించాలి. వైయ‌స్ జ‌గ‌న్ పైన వ్య‌క్తిగ‌త ద్వేషాన్ని పెంచుకోవ‌డం స‌రికాదు. త‌న‌కు ఏదైనా అనుమానాలుంటే వాటిని నివృత్తి చేయ‌డానికి మేం సిద్ధంగా ఉన్నా. బ‌హిరంగ చ‌ర్చ‌కు ఎక్క‌డికి ర‌మ్మ‌న్నా నేను వ‌స్తాం.

Back to Top