తిరుపతి: టీటీడీ గోశాలలో గోవుల మరణాలపై వైయస్‌ఆర్‌సీపీ వాస్తవాలను బయటపెట్టడంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావులు తలోరకంగా స్పందిస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గోవుల మరణాలపై వైయస్ఆర్‌సీపీది దుష్ప్రచారం అన్న చంద్రబాబు దీనిపై విచారణకు ఆదేశిస్తారా అని సవాల్ చేశారు. ఇవి వాస్తవమని నిరూపించేందుకు మేం సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అసలు గోవుల మరణాలే జరగలేదంటుంటే, ఈఓ, టీటీడీ చైర్మన్‌లు మాత్రం ఆవులు మరణించాయని అంగీకరించారని, దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... సీఎం చంద్రబాబు టీటీడీ గోశాలలో ఒక్క గోవు చనిపోలేదని, కావాలనే వైయస్ఆర్‌సీపీ వివాదం సృష్టిస్తూ, దుష్ర్పచారం చేస్తోందని మాట్లాడారు. ఈరోజు ఉదయం టీటీడీ ఈఓ శ్యామలరావు 43 ఆవులు చనిపోయాయని ప్రకటించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయకుడు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ 22 ఆవులు చనిపోయాయని ప్రకటించారు. సీఎం ఒక్క గోవు కూడా చనిపోలేదని చెబుతుంటే, దానికి విరుద్దంగా టీటీడీ ఈఓ, చైర్మన్‌లు రెండు వేర్వేరు సంఖ్యల్లో ఆవుల మరణాలను గురించి ప్రకటనలు చేశారు. అంటే వీరిద్దరూ అబద్దాలు చెప్పారా? అలా మాట్లాడిన వారిని వారి పదవుల నుంచి చంద్రబాబు తొలగించగలరా? మార్ఫింగ్ ఫోటోలంటూ తప్పించుకునే యత్నం టీటీడీ గోశాలలో గోమాతలు చనిపోతున్నాయని మేం బయటపెట్టిన ఫోటోలు ఫేక్, మార్ఫింగ్ అంటూ టీటీడీ ఒక ప్రకటనలో ఖండించింది. దీనిని టీడీపీ తన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేసింది. మేం మరోసారి చాలా స్పష్టంగా భగవంతుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాం. ఏదైతే ఫోటోలు ఆరోజు మేం బయటపెట్టామో అవి నిజమైనవే. కాదు అని నిరూపించేందుకు ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తాం. ఎటువంటి విచారణకు అయినా మేం సిద్దంగా ఉన్నాం. ఒక్క ఫోటో కూడా మార్ఫింగ్ కాదు. అవి గోశాలలో చనిపోయిన ఆవుల ఫోటోలే. టీటీడీ ఈఓ, చైర్మన్ చెబుతున్న సంఖ్య కన్నా ఎక్కువగానే గోవులు మరణించాయి. మేం గోవుల మరణాలను బయటపెట్టగానే వెంటనే అవి అబద్దం అని టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈరోజు ఈఓ మాట్లాడుతూ నెలకు పదిహేను ఆవులు చనిపోతున్నాయని అన్నారు. ఉన్న మొత్తం పదిహేను వందల ఆవులు ఎన్ని సంవత్సరాల్లో చనిపోతాయో కూడా ఆయన చెప్పాలి. బీఆర్ నాయుడి బెదిరింపులకు భయపడేది లేదు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గోమరణాలపై స్పందిస్తూ ముసలీ, ముతక ఆవులు గోశాలలో 22 వరకు చనిపోయాయని ప్రకటించారు. మేం బయటపెట్టిన చనిపోయిన ఆవుల ఫోటోల్లో డెబ్బై శాతం లేగదూడల ఫోటోలే ఉన్నాయి. అంటే బీఆర్ నాయుడు చెబుతున్నట్లు ఈ ఫోటోల్లో కనిపిస్తున్న లేగదూడలు అన్నీ కూడా ముసలి గోవులేనా? మొదట్లో అసలు గోవులే చనిపోలేదని అన్నాడు. తరువాత 22 ముసలి అవులు చనిపోయాయని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. తిరుపతి ఎమ్మెల్యే మొత్తం 40 గోవులు చనిపోయాయని ప్రకటించారు. ఇందులో ఏది నిజం? మేం బయటపెట్టిన నిజాలను చూసి భయంతో ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంతే కాకుండా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ కరుణాకర్‌రెడ్డి అంతు చూస్తాను, రాష్ట్రమంతా క్రిమినల్ కేసులు పెడతామంటూ నన్ను హెచ్చరించారు. అంటే మీకు నచ్చని వారిని, ప్రశ్నించిన వారిపైన పనిగట్టుకుని రాష్ట్రం అంతా కేసులు పెడతారా? మీరు ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా వాటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం. భగవంతుడి పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించినందుకు మీరు నాపైన కేసులు పెడితే, శ్రీవారి భక్తుడిగా ఆనందంగా ఆ జైలుశిక్షను అనుభవిస్తాను. నేను చెప్పింది ఏదైనా తప్పైతే దానిపై ఎలాంటి దానికైనా సిద్దం. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నామంటున్నారు. పీఠాధిపతులు, సాధువులతో గోశాలకు చనిపోయిన కళేబరాలను వెలికితీసి, విచారణకు సిద్దమా? మేం రాజకీయం చేస్తున్నామంటూ బీఆర్ నాయుడు మాట్లాడుతున్నారు. నన్ను అన్యమతస్తుడు, మనిషి జన్మకు తగినవారు కాదు అంటూ దూషించారు. మీరే గడియకో మాట మాట్లాడుతున్నారు. ఆవులు చనిపోతున్నాయనే విషయాన్ని గుర్తించారు. మీ బాధ్యత సరైన తీరులో లేకపోవడం వల్లే గోవులు మరణిస్తున్నాయి. మీ వ్యవస్థను సరిదిద్దుకోకుండా మాపైన నిందలు వేస్తున్నారు. జైలుకు పంపుతామని నన్ను బెదిరిస్తున్నారు. అలజడి నా జీవితం, ఆందోళన నా ఊపిరి, తిరుగుబాటు నా వేదాంతం. భయపడేది లేదు. ప్రజాఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళాను. ఈ రోజు దేవుడి కోసం జైలుకు వెళ్ళడానికి సిద్దం. గోమాతకు మీరు చేసిన నష్టం గురించి మాట్లాడకుండా, భూమతాకు నేను నష్టం అని మాట్లాడుతున్నారు. రాజకీయనేతగా మాట్లాడుతున్న ఈఓ టీటీడీ ఈఓ శ్యామలరావు ఒక అధికారిగా కాక ఒక రాజకీయ నేతలా మాట్లాడుతున్నారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ గోశాలలో ఎన్ని గోవులు మరణించాయో తమ వద్ద ఆధారాలు లేవని, లేకుండా చేశారని అన్నారు. అదే ఆయన గత ఏడాది మొత్తం 179 గోవులు మరణించాయని అన్నారు. గోశాలకు సంబంధించి 2021-23 మధ్య విజిలెన్స్ విచారణ నివేదికలను ఈఓ బయటపెట్టారు. ఈ విజిలెన్స్ విచారణకు ఆదేశించిందే వైయస్ఆర్‌సీప ప్రభుత్వం. టీటీడీ గోశాలలో సక్రమంగా వ్యవహారాలు జరగడం లేదనే ఫిర్యాదులతో మా ప్రభుత్వం నిస్పక్షపాతంగా చర్యలు తీసుకునేందుకు ఆనాడు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పెద్ద ఎత్తున గోవులు మరణిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో మీరు వేసిన విజిలెన్స్ విచారణలు ఏవీ? వాటికి సంబంధించిన నివేదికలను బయటపెట్టండి. గతంలో విజిలెన్స్ వారిని గోశాలలోకి రానివ్వలేదని కూడా చెప్పారు. అలాంటప్పుడు విజిలెన్స్ విచారణ నివేదికలు ఎలా వచ్చాయి? గడువు ముగిసిన మందులను గోవులకు వాడారని ఈఓ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు అయ్యింది. ఇప్పుడే ఈ విషయం తెలిసిందా? ఈ పదినెలలుగా ఎందుకు దీనిపై విచారణకు ఆదేశించలేదు? అంటే ఈ పదినెలలుగా గడవు తీరిన మందులను ఆవులకు ఇచ్చి, వాటి మరణాలకు కారకులయ్యారా? గత ఒకటిన్నర నెల కిందటే ఏనుగుకు పెట్టే ఆహారంలో రాగులు, రాగిసంకటిని నిలిపివేశారు. టెండర్లు జరిగినా కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకోలేదు. గుర్రాలకు దాణా కూడా టీటీడీ కొనుగోలు చేయకపోతే, భక్తులు ఇస్తున్న దాణాతో వాటిని పోషిస్తున్నారు. టీటీడీని ముందు ప్రక్షాళన చేయాలి తిరుమలను ప్రక్షాళన చేస్తున్నాను అని చెప్పుకుంటున్న ఈఓ ముందు టీటీడీని ప్రక్షాళన చేయాలి. ఈఓ శ్యామలరావు ఒక అధికారిలా కాకుండా రాజకీయ నేతలా మాట్లాడుతున్నారు. గతంలో ఆవునెయ్యిలో కల్తీ జరిగిందని మళ్లీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. రూ.320 కే స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందా? ఆలోచించాలి కదా అని ఈఓ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రూ.280 కే కేజీ ఆవునెయ్యి ఎలా కొనుగోలు చేసి, వినియోగించారో ఈఓ చెప్పాలి. అంటే దానిలోనూ స్వచ్ఛత లేదు, కల్తీ కలిసిందని ఆయన అభిప్రాయమా? 2014-19 వరకు ఎంతకు ఆవునెయ్యిని కొనుగోలు చేశారో చూసి, దానిపై మాట్లాడాలి. టెండర్లలో ఎవరు తక్కువ కొటేషన్ వేస్తే, వారికి కాంట్రాక్ట్ ఇస్తారు. ప్రమాణాల ప్రకారం నెయ్యి లేకపోతే దానిపై చర్య తీసుకుంటారు. రోజుకు 1500 కేజీల ఆవుపాలే కింది నుంచి కొండమీదకు వెళ్ళడం లేదు. జవహర్‌రెడ్డి, ధర్మారెడ్డి ఈఓగా ఉన్నప్పుడు రోజుకు 100 కేజీల స్వచ్ఛమైన కవ్వంతో చిలికిన వెన్న నుంచి తయారు చేసిన ఆవునెయ్యిన స్వామివారి కైంకర్యాలకు వాడాలని సంక్పలించాం. అందుకోసం రూ.5 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దానిని అసలు ప్రారంభించకండా పక్కకు పెట్టేశారు. ఎన్డీడీపీతో దేశవాళీ మేలుజాతి ఆవుల పునరుత్పత్తి కేంద్రాన్ని రూ.50 కోట్లతో ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. రోజుకు 1500 కేజీల స్వచ్ఛమైన నెయ్యిని స్థానికంగా తయారు చేసుకోవాలని ప్రణాళిక సిద్దం చేశాం. దానికి నేటికీ అతీగతీ లేదు. నవనీతసేవ ద్వారా వెన్నను స్వామివారికి అందించేందుకు మా హయాంలో చర్యలు తీసుకున్నాం. కూటమి హయాంలో టీటీడీ పవిత్రత మంటగలుస్తోంది నాణ్యతతో అన్నప్రసాదాలను ఇస్తున్నామని ఈఓ చెప్పుకుంటున్నారు. అన్నప్రసాదాల్లో నాణ్యత ఎంతో భక్తులను అడిగితే చెబుతారు. గతంలో వైయస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సూచనతో క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, పాలు ఇవ్వడం ప్రారంభించాం. అప్పటి నుంచి ఇది కొనసాగుతూనే ఉంది, కొత్తగా ఈ రోజు ప్రారంభించింది కాదు. లడ్డూ నాణ్యత విషయంలో మొదట్లో కల్తీ జరగలేదని చెప్పారు. చంద్రబాబు కన్నెర్ర చేయడంతో కల్తీ జరిగిందని మాట మార్చారు. తరువాత వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మరోసారి చెప్పారు. ఇలా పదేపదే మాట మారుస్తూ వచ్చారు. కల్తీ జరిగిందని అనుమానించిన నెయ్యిని వాడకుండానే వెనక్కి పంపారు. అయినా కూడా లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఎలా చెప్పారు? ఈఓగా ఉన్న సీనియర్ ఐఎఎస్‌గా ఇలాంటి రాజకీయ ఆరోపణలు ఎలా చేస్తున్నారు? మీకంటే సీనియర్‌లు అయిన జవహర్‌రెడ్డి, థర్మారెడ్డి హయాంలో కల్తీ నెయ్యి వినియోగించారని చెప్పగలరా? తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకుని ఈఓ మాట్లాడుతున్నారు. టీటీడీలో దళారీ వ్యవస్థను నిర్మూలించామని శ్యామలరావు ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలో దళారీలదే రాజ్యంగా కొనసాగుతోంది. బ్లాక్‌లో పెద్ద ఎత్తున శ్రీవారి దర్శన టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. మీరు ప్రక్షాళన చేస్తే, కొండపై బెల్ట్ షాప్ ఎలా ఉంది? పోలీసులు పట్టుబడ్డ మద్యం సీసాలను ప్రదర్శించారు. కొండపైన ఎగ్ బిర్యానీలు తింటున్నారు. మా పాలనలోనే మద్యం సేవించిన వ్యక్తి వీరంగం సృష్టించారు. పాదరక్షలతో మహాద్వారం వరకు భక్తులు వచ్చినా నిద్రపోతున్నారు. సీఎం కార్యాలయం నుంచి రోజుకు ఏడువేల సిఫారస్ లకు వీఐపీ దర్శనాలు చేయిస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై బుదరచల్లారు వైయస్ జగన్ పాలనలో కొండపై చర్చి కడుతున్నారని టీడీపీ దుష్ర్పచారం చేయలేదా? అదే నిజమైతే ఈ పదినెలల్లో దీనిని ఎందుకు నిరూపించలేదు? ఇంతకంటే రాజకీయం ఉంటుందా? బ్రహ్మోత్సవం లైటింగ్ పోల్స్ సిలువ ఆకారంలో ఉన్నాయంటూ తప్పుడు ప్రచారానికి తెగబడలేదా? అయిదేళ్ళ పాలనలో అడుగడుగునా అన్యాయం, అక్రమం జరుగుతోందని ప్రచారం చేశారు. ఒక్క దానిని అయినా నిరూపించగలిగారా? చివరికి ఏదీ దొరకకపోవడంతో శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి అంటూ దిగజారుడు ఆరోపణలు చేశారు. ఇటువంటి ఆధారాలు లేని ఆరోపణలు ఎలా చేస్తారంటూ న్యాయస్థానం ముఖ్యమంత్రిని ఆక్షేపించలేదా? టీడీపీ వారు మాట్లాడితే పవిత్రత ఉంటుంది. మేం నిజాలు చెబితే దానిని రాజకీయం అంటారా? అడుగడుగునా దేవుడిని వాడుకున్నది టీడీపీ వారే. రోజుకు 1500 లీటర్ల పాలకు బదులు 500 లీటర్ల మేరకే కొండకు పాలు వెడుతున్నాయంటే దానికి సమాధానం లేదు. 2006-08 వరకు నేను చైర్మన్‌గా ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు ఇలాగే విమర్శలు చేశారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ధర్నా కూడా చేశారు. అప్పుడు నేను నేరుగా సీఎం రోశయ్య, గవర్నర్‌లను కలిసి చంద్రబాబు ఆరోపణలపై నాపై విచారణకు అభ్యర్థించాను. చివరికి కోర్ట్‌కు కూడా వెళ్ళాను. అమరణనిరాహార దీక్ష కూడా చేపట్టాను. చివరికి కుర్తాళం పీఠాధిపతి తిరుమలలో ఏ తప్పు చేయలేదని ప్రకటించిన తరువాతే పదిరోజుల తరువాత నిరాహారదీక్షను విరమించాను. ఇదీ నా చిత్తశుద్ది. గోవుల మరణాలను రాజకీయం చేయవద్దు నాపైన, వైయస్ జగన్‌పై దాడి చేయడం ద్వారా టీటీడీలో గోవుల మరణాలను పక్కదోవ పట్టించవద్దు. గోశాలలో జరిగిన పాపానికి టీటీడీ సరైన సమాధానం చెప్పాలి. ఇలాంటివి ప్రశ్నిస్తున్న నన్ను అన్యమతస్తుడు అని బీఆర్ నాయుడు నిందిస్తున్నారు. వైయస్‌ఆర్సీపీకి ఓటు వేసిన నలబై శాతం మంది కూడా అన్యమతస్తులే అని ఆరోపించగల ఘనులు తెలుగుదేశం నేతలు. నేను టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు దళితవాడలకు శ్రీవారిని తీసుకువెళ్ళి దళిత గోవిందం కార్యక్రమాన్ని నిర్వహించాను. ఈ రోజు ప్రపంచం అంతా జరుగుతున్న శ్రీవారి కళ్యాణ శోభ కు ఆనాడు నేను శ్రీకారం చుట్టాను. దాదాపు 36 వేల కళ్యాణాలను కళ్యాణమస్తు పథకం కింద చేయించాను. ఇదీ హిందూధర్మం పట్ల నాకు ఉన్న చిత్తశుద్ది. దాదాపు 75 మంది పీఠాధిపతులతో మూడుసార్లు సదస్సులు నిర్వహించి, శ్రీవారి క్షేత్రం నుంచి ఏ విధంగా హిందూధర్మ సేవలను చేయాలనే దానిపై సలహాలను స్వీకరించడం జరిగింది. చతుర్యుగ బంధం పేరుతో పెద్ద ఎత్తున హిందూధర్మ ప్రచారం నిర్వహించం. ఇవ్వన్నీ అన్యమతస్తులు చేస్తారా? వందే గోమాతరం అనే ప్రపంచ స్థాయి సదస్సు నిర్వహించాం. మళ్ళీ వైయస్ జగన్ గారు సీఎం అయిన తరువాత మరోసారి వందే గోమాతరం సదస్సును నిర్వహించాం. గోమాతను జాతీయ జంతువుగా గుర్తించాలని ఈ సదస్సు ద్వారా తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపాం. అలాంటి మాపైన అన్యమతస్తులు అంటూ నిందలు వేస్తారా? ఏడు కొండల పేర్లు అయినా బీఆర్ నాయుడు చెప్పగలరా?