మహనీయుడి స్మృతులను చెరిపేసే కుట్ర

అంబేద్కర్ స్మృతివ‌నంను పథకం ప్రకారం నాశ‌నం చేస్తున్నారు

పీపీపీ మోడ‌ల్‌లో ప్రైవేటుకి అప్ప‌గించేందుకు యత్నం

 మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్ర‌హం

విజ‌య‌వాడ‌ స్వరాజ్ మైదానంలో అంబేద్క‌ర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహం వద్ద నివాళుల‌ర్పించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోనే తలమానికంగా రాజ్యాంగ ప్రధాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ స్మృతులను ముందు తరాలనకు అందించాలనే గొప్ప సంకల్పంతో వైయస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనంను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్వరాజ్ మైదానంలో ఉన్న 125 అడుగుల కాంస్య విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయ‌న భాగ్యలక్ష్మి, త‌దిత‌రులతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని అణగారిన వర్గాలకు ఆరాధ్యుడైన మహనీయుడి స్మృతులను చెరిపేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. స్మృతివనంను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

భార‌త‌దేశానికి రాజ్యాంగాన్ని ప్ర‌సాదించిన మ‌హానుభావుడు డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్‌. ఆనాటికీ దేశంలో ఉన్న అస్పృశ్య‌త, అంట‌రానిత‌నం మీద పోరాటం చేసి అంద‌రికీ స‌మాన హ‌క్కులు క‌ల్పించిన గొప్ప నాయ‌కుడు. అంబేద్క‌ర్ ఆశ‌యాలు, ఆలోచ‌న విధాన‌ల‌తో పాల‌న చేసిన గొప్ప వ్య‌క్తి వైయ‌స్ జ‌గ‌న్‌. స‌మాజంలో వెనుక‌బ‌డిన వ‌ర్గాలు ఎద‌గాలంటే చ‌దువు మాత్ర‌మే మార్గ‌మన్న అంబేద్క‌ర్ ఆశ‌యాలకు అనుగుణంగా ఉచితంగా నాణ్య‌మైన విద్య‌ను అందించి వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ వెన్నెముక‌గా నిలిచారు. రాజ‌కీయంగానూ చేయూత‌నందించిన గొప్ప నాయ‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ న‌డిబొడ్డున రూ. 450 కోట్ల‌తో 125 అడుగుల అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి అంబేద్క‌ర్ ఆలోచ‌న విధానం భావిత‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డాల‌నే సందేశానికి స‌మాజానికి పంపారు. 

అంబేద్కర్ స్మృతివనంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం

గడిచిన ఐదేళ్లు వైయస్ జగన్ సర్కార్ అంబేద్కర్‌ను గౌర‌వించి ఆయ‌న ఆశ‌యాల‌ను అమ‌లు చేస్తే , కూట‌మి ప్ర‌భుత్వం మాత్రం ఇప్పుడు అంబేద్కర్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తోంది. ఆయన జ్ఞాపకాలను కనుమరుగు చేసే ప్రయత్నం ప్రారంభించింది. గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు అంబేడ్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటు చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు రాలేదు. గత ప్రభుత్వం నిర్మించిన స్మృతివ‌నం నిర్వ‌హ‌ణను క్రమంగా నిర్లక్ష్యం చేస్తోంది. అత్యంత ప‌విత్ర‌మైన ఈ ప్రాంతానికి ఎవ‌రూ రాకుండా చేయాల‌న్న కుట్రతో క‌నీసం నిర‌వ‌ధికంగా క‌రెంట్ కూడా స‌ర‌ఫ‌రా చేయ‌డం లేదు. అంబేడ్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటు చేసిన ఈ ప్రాంతాన్ని గతంలో చంద్ర‌బాబు లులూ గ్రూప్‌కి కేటాయించాడు. విలువైన ఈ నేల‌పై క‌న్నేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇప్పుడు అంబేడ్క‌ర్ స్మృతివ‌నాన్ని పీపీపీ మోడ‌ల్ లో ప్రైవేటుకు అప్ప‌గించాల‌ని ప్ర‌భుత్వం కుట్ర‌లు చేస్తోంది. అదే జ‌రిగితే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రిస్తున్నాం. 

అంబేద్కర్‌ను అవ‌మానిస్తున్నారు : మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

గ‌తంలో అంబేద్కర్ విగ్ర‌హాన్ని అమ‌రావ‌తిలో నిర్మిస్తాన‌ని చెప్పి ప‌ట్టించుకోకుండా చంద్రబాబు మోసం చేస్తే, వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయ్యాక విజ‌య‌వాడ న‌డిబొడ్డున 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. ఆ కోపంతో వైయ‌స్ జ‌గ‌న్ ఏర్పాటు చేసిన ఈ స్మృతివ‌నం ప‌రిర‌క్ష‌ణ‌పై కూట‌మి ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప‌ది నెల‌లుగా ఇక్క‌డ‌ లిఫ్టులు, వాట‌ర్ ఫౌంటెయిన్ ప‌నిచేయ‌డం లేదు. గ్రీన‌రీని ప‌రిర‌క్షించ‌డం లేదు. ప‌విత్రమైన ఈ ప్రాంతాన్ని డ్వాక్రా బ‌జార్‌కి అద్దెకిచ్చారు. రాబోయే రోజుల్లో రైతు బ‌జార్ తీసుకురావాల‌ని కుట్ర చేస్తున్నారు. 2 వేల మంది కూర్చునే విధంగా నిర్మించిన‌ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ను మూసేశారు. పీపీపీ మోడ‌ల్‌లో ప్రైవేటుకు క‌ట్ట‌బెట్టాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటి చ‌ర్య‌ల‌తో ఈ ప్ర‌భుత్వం అంబేద్కర్‌ను అవ‌మానిస్తోంది. అంతేకాకుండా కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి దాదాపు పదినెలల కాలం అవుతున్నా ప్ర‌భుత్వం నుంచి ఎవ‌రూ ఇంత‌వ‌ర‌కు వ‌చ్చి అంబేద్కర్ విగ్ర‌హం వ‌ద్ద నివాళులు అర్పించిన పాపాన పోలేదు. ఈ అంశంపై ప్ర‌భుత్వం మీద తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త రావ‌డంతో ఇప్పుడు ఇన్‌చార్జి మంత్రిని పంపిస్తామ‌ని చెబుతున్నారు.

ద‌ళితుల‌ను అక్ర‌మ కేసుల‌తో వేధిస్తున్నారు: ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్

డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం భార‌త‌దేశానికి దిక్సూచి వంటిది. వెనుక‌బ‌డిన వ‌ర్గాలు కూడా ఉన్న‌తంగా పురోగమిస్తున్నాయంటే దానికి కార‌ణం అంబేద్క‌ర్ మాత్ర‌మే. మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ కూడా గ‌డిచిన త‌న ఐదేళ్ల పాల‌న‌లో అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను కొన‌సాగించారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వెనుక‌బ‌డిన ద‌ళిత వ‌ర్గాల‌ను అక్ర‌మ కేసుల‌తో వేధింపుల‌కు గురిచేస్తోంది.

Back to Top