తాడేపల్లి: రాజధాని నిర్మాణ సంస్థల నుంచి దండుకున్న కమిషన్లతో అమరావతిలో అయిదెకరాల్లో అత్యంత విలాసవంతమైన తన రాజప్రసాదాన్ని చంద్రబాబు నిర్మిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన నివాసం కోసం దాదాపు రూ.170 కోట్ల రూపాయలతో భూమిని కొనుగోలు చేశారంటే, దానిలో ఎన్ని వందల కోట్లతో కనీవినీ ఎరగని రీతిలో గొప్ప ఇంధ్రభవనాన్ని నిర్మిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రెండెకరాల్లో తన నివాసం, పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న మాజీ సీఎం వైయస్ జగన్ నిర్మాణాన్ని నిత్యం తాడేపల్లి ప్యాలెస్ అంటూ విషప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు వందల కోట్లతో నిర్మిస్తున్న తన రాజప్రసాదాన్ని ఏమని పిలుస్తారని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... రాజధానిలోని వెలగపూడిలో ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు తన కోడలు నారా బ్రాహ్మణి పేరుతో సర్వే నంబర్ 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను రూ.18.75 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే గజం రూ.7,500 చొప్పున ఖరీదు చేసినట్టుగా చూపించారు. కానీ చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చదరపు గజం రూ.60 నుంచి 70 వేలు పలుకుతోందని ఆయనే స్వయంగా చెబుతుంటారు. ఈ ప్రకారం చూస్తే నాలుగు వైపులా రోడ్డు ఉన్న వెలగపూడిలోని స్థలం విలువ సుమారు రూ.170 కోట్ల వరకు ఉంటుంది. మరి దానిలో రాజభవనం నిర్మాణానికి ఇంకెన్ని రూ.వందల కోట్లు వ్యయం చేస్తారో మన ఊహకే అందడం లేదు. - రాజధాని నిర్మాణ సంస్థల నుంచి ముడుపులతోనే వెలగపూడిలో చంద్రబాబు నిర్మిస్తున్న విలాసవంతమైన రాజభవనంకు భూమి కొనుగోలు నుంచి నిర్మాణ వ్యయం వరకు తాజాగా రాజధాని నిర్మాణ సంస్థలకు ఇచ్చిన కాంట్రాక్ట్‌ల నుంచి వచ్చిన కమీషన్లతోనే చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రూ.వేల కోట్ల కొత్త కాంట్రాక్టులను అనుకూల సంస్థలకు, నిబంధనలను పట్టించుకోకుండా కట్టబెట్టింది. కాంట్రాక్టు విలువను 3.94 నుంచి 4.34 శాతం అధిక ధరలకు పెంచేసి మొత్తం 59 ప్యాకేజీల్లో కాంట్రాక్టులు ఇచ్చారు. వైయస్ జగన్ తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసి చంద్రబాబు, లోకేష్ ఎవరి పేరుచెబితే వారికి కాంట్రాక్టులు అప్పగించేస్తున్నారు. 2014-19 మధ్య రూ. 5వేల కోట్లు అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ఇస్తే కనీసం చంద్రబాబు రోడ్లను కూడా వేయలేకపోయాడు. టెండరింగ్ విధానం లేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలో వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను తన వారికి చంద్రబాబు కట్టబెట్టేశాడు. ఎన్‌సీపీకి రూ. 6124.08 కోట్ల కాంట్రాక్టులు, బీఎస్సార్ ఇన్‌ఫ్రాకు రూ. 6216.46 కోట్లు, ఆర్వీర్ ప్రాజెక్స్ట్‌కు రూ. 6003.17 కోట్లు, మెఘా రూ. 7వేల కోట్లు, ఎంవీఆర్ ఇన్‌ఫ్రాకు రూ. 796 కోట్లు, బీఎస్‌పీఎల్ కి రూ. 779.82 కోట్లు, ఎల్ అండ్ టీకి రూ. 809.88 కోట్లు, కేఎంవీపీకి రూ. 429.23 కోట్లు కాంట్రాక్టులు చంద్రబాబు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టాడు. అంతేకాదు వీరికి ముందుగానే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు కూడా ఇచ్చి, దాని నుంచి తనకు రావాల్సిన కమిషన్లను ముందుగానే వసూలు చేసుకుంటున్న ఘనుడు చంద్రబాబు. - గతంలోనూ ఇదే విధంగా అవినీతి దందా 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని డిజైన్ల రూపకల్పన కోసం టోక్యోకు చెందిన మకీ అసోసియేట్స్‌ను ఎంపిక చేసింది. కొంతమందిని లోకల్ అసోసియేట్లుగా చేసుకోవాలని వారిని కోరితే వారు అంగీకరించకలేదు. దీనిలో వారిని డిస్‌క్వాలిఫై చేసి లండన్‌కి చెందిన నార్మన్ పోస్టర్స్ ను ఎంపిక చేశారు. దీంతోపాటు హైదరాబాద్‌కి చెందిన జెనిసిన్ ప్లానర్స్‌ను కూడా ఎంపిక చేశారు. తొలుత రూ. 67.86 కోట్లుగా నిర్ణయించిన ఫీజును ఏకంగా రూ. 250 కోట్లకుపైనే పెంచేశారు. ఈవిధంగా భారీగా పెంచిన ఫీజుతోనే ముడుపులు స్వీకరించి 2014-19 మధ్య జూబ్లిహిల్స్ లో తన ఇంటిని రెనోవేషన్ పేరుతో పాత భవనాన్న పూర్తిగా నేలమట్టం చేసేసి అద్భుతమైన ఇంద్రభవనం నిర్మించుకున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే గుసగుసలాడుకున్నారు. ఈ ఇంటి కోసం చుట్టుపక్కల ఉన్న స్థలాలను చంద్రబాబు కొనుగోలు చేసి విశాలమైన ఇంద్ర భవనాన్ని నిర్మించుకున్నాడు. కొండాపూర్ ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మాణానికి కాంట్రాక్టు ఇచ్చి కమీషన్లు తీసుకున్న డబ్బులతోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మించుకున్నారని ప్రజలందరికీ తెలుసు. ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టు ఇచ్చి దానికి బహుమతిగా మంగళగిరిలో టీడీపీ సెంట్రల్ ఆఫీసు నిర్మాణం చేసుకున్నామని సొంత టీడీపీ నాయకులే చెబుతుంటారు. - ప్రజాధనంతో చంద్రబాబు ఇంధ్రభవనాలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనంతోనే తనకు విలాసవంతమైన ఇంధ్రభవనాలను నిర్మించుకుంటున్నారు. జూబ్లిహిల్స్ ఇంటి నిర్మాణం కోసం రూ. 100 కోట్లు, మదీనాగూడ ఫాం హౌస్ విలువ రూ. 500 కోట్లు, కరకట్ట ఇల్లు ఎవరిదో తెలియదు. ఇప్పుడు అమరావతిలో నిర్మాణం చేయబోయే రాజభవనం ఇంటి స్థలం విలువే రూ. 170 కోట్లు అయితే, ఇంటి నిర్మాణం ఇంకెంత అవుతుందో? చంద్రబాబు ప్రజాధనాన్ని మంచినీళ్ల కన్నా హీనంగా ఖర్చు చేస్తున్నాడు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను క్యాంప్ ఆఫీసుగా ప్రకటించి రెనోవేట్ చేశారు. దానికి చేసిన ఖర్చెంత? అందులో పది రోజులైనా ఉండకుండానే కాంగ్రెస్ నాయకుడైన టి. సుబ్బిరామిరెడ్డికి చెందిన పార్క్ హయత్ హోటల్ లో చంద్రబాబు కుటుంబం మారిపోయింది. దానికోసం చంద్రబాబు చెల్లించిన బిల్లుల విలువెంత, వాటర్ బాటిల్స్ ఖర్చెంత? చంద్రబాబు అమరావతిలో కట్టబోయే ఇంట్లో ఉండబోయేది లోకేష్, చంద్రబాబు మాత్రమే. అత్తాకోడళ్లు, మనవడు హైదరాబాద్‌లోనే ఉంటారు. ఇద్దరు ఉండేదాని కోసం 5.16 ఎకరాల్లో ఇల్లు నిర్మించుకోవడాన్ని ఏమనాలి? పదేళ్లుగా నివాసం ఉంటున్న లింగమనేన గెస్ట్ హౌస్ విషయంలో చంద్రబాబు పలుమార్లు మాటలు మార్చేశాడు. ఒకసారి తనదేనని, ఇంకోసారి అద్దెకు ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఏంటో చెప్పాలి. ఆ ఇళ్లు ఎవరిదో చంద్రబాబు స్పష్టం చేయాలి. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, కేసీఆర్‌కి భయపడి ఆంధ్రాకి వచ్చేడు. ఆ సమయంలో లింగమనేని ఇంట్లో చేరిపోయాడు. ఆ రోజే సొంత ఇంటిని చంద్రబాబు ఎందుకు నిర్మించుకోలేదు? అంటే అమరావతి నిర్మాణం పూర్తవుతుందో లేదోనని చంద్రబాబుకి ఆరోజు నుంచే ఆయనలో భయం ఉందన్నమాట. - వైయస్ జగన్ నివాసంపై విషం చిమ్మారు తానేదో శుద్ధపూస అయినట్టు ఎదుటివారి మీద దుష్ప్రచారం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. అక్రమంగా ఆర్జించిన వందల కోట్లతో ప్యాలెస్‌లు, రాజప్రాసాదాలు, ఇంద్ర భవనాలను నిర్మించుకుంటూనే జగన్ ఇంటి గురించి చంద్రబాబు చేయని తప్పుడు ప్రచారం లేదు. వైయస్ జగన్ రెండెకరాల స్థలంలో పార్టీ కార్యాలయంతోపాటు తాను నివాసం ఉండేందుకు ఇంటిని నిర్మించుకున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ తనయుడు, స్వతహాగా బిజినెస్ మేన్. ఎప్పటికప్పుడు ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తున్నాడు. ఆయన కట్టుకున్న ఇళ్ల మీద, పార్టీ కార్యాలయాల మీద చంద్రబాబు చేసిన అసత్య ప్రచారం అంతా ఇంతా కాదు. రెండెకరాల్లో పార్టీ కార్యాలయం, ఇళ్లు కట్టుకుంటే మాది తాడేపల్లి ప్యాలెస్ అంటూనే ఆయన ఐదెకరాల్లో భారీ ఇంటిని కడుతున్నాడు. జూబ్లీ హిల్స్ లో ఇంద్రభవనం కట్టుకున్నా, కరకట్టలో అక్రమ నివాసంలో పదేళ్లుగా పైగా నివసిస్తున్నా, సంపన్నులు నివాసం ఉండే కొండాపూర్‌లో అత్యంత విలువైన స్థలంలో ఫామ్ హౌస్ ఉన్నా ఆయన మాత్రం గురవింద సామెత మాదిరిగా ఇతరులను విమర్శిస్తూనే ఉంటాడు. తనను ప్రజలెవరూ విమర్శించరు, తనను పట్టించుకోరని చంద్రబాబు ఆలోచన. జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు నిర్మించుకున్ని ఇంటిని ఇంతవరకు ఏ ఒక్కరికీ చూపించలేదు. ఆ ఇంట్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదు. 2014లో ముఖ్యమంత్రి కాకమునుపు ఎలా ఉండేదో, ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఇంటిని ఎలా మార్చేశారో అన్నది ఇప్పడు చేసిన వారికి మతిపోతుంది. ఇంటి ఫ్లోరింగ్ నుంచి టెర్రస్ దాకా పూర్తిగా మార్చేశారు. ఖరీదైన వస్తువులతో ఇంటిని సుందరీకరించారు. విదేశాల నుంచి తెచ్చిన మొక్కలతో టెర్రస్‌ను సుందరీకరించారు. ఇంత భారీ ఖర్చుతో చంద్రబాబు ఇంటిని ఎలా నిర్మించాడని అనుకుంటోరోనని ఆ ఇంట్లోకి ఎవర్నీ అనుమతించరు. - అమరావతిలో భూమి పూజకు మంత్రులకే ఆహ్వానం లేదు అమరావతిలో సువిశాల ప్యాలెస్ నిర్మాణానికి ఇటీవలే చంద్రబాబు తన కుటుంబంతో కలిసి భూమి పూజ చేశారు. కానీ ఆ సమయంలో కేబినెట్ మంత్రులను కానీ, అమరావతి రైతు సంఘాలను కానీ, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ పార్టీ దళిత ఎమ్మెల్యేకు కూడా అనుమతి లేదు. అందరికీ నీతులు వల్లించే చంద్రబాబు, తన ఇంటి నిర్మాణ కార్యక్రమానికి ఎందుకు ఎవర్నీ ఆహ్వానించకుండా కేవలం ఐదుగురు కుటుంబసభ్యులతో మాత్రమే తెరలు కట్టుకుని గోప్యంగా భూమి పూజ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆ ఇంట్లోకి కనీసం మీడియా వారికి కూడా అనుమతి లేదు. ఏపీలో చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్‌కి సొంతంగా ఇళ్లు కూడా లేనప్పుడై తాడేపల్లిలో వైయస్ జగన్ ఇంటిని నిర్మించుకున్నారు. ఈ ఇంటికి చిరంజీవి, అంబాని, కేసీఆర్, అదానీ వంటి ప్రముఖులతోపాటు ఎంతో మంది మీడియా ప్రముఖులు కూడా వచ్చారు. తిరిగి చూశారు. - చంద్రబాబు అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటాం అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఎక్కడో మారుమూలన ప్లాట్లు కేటాయించారు. ఎప్పుడు డెవలప్ అవుతుందో ఎవరికీ తెలియదు. చంద్రబాబు కోరుకున్న వారికి మాత్రం విలువైన ప్రాంతంలో ప్లాట్లు దొరుకుతాయి. ఇప్పుడు చంద్రబాబు కట్టుకునే ఇంటికి నాలుగువైపులా రోడ్లు వచ్చాయి. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల పక్షాన నిలబడి వైయస్సార్సీపీ గతంలో గళం వినిపించింది. ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. ఇంత భారీగా ప్రజాధనాన్ని ఖర్చుచేస్తూనే వైయస్సార్సీపీ నాయకుడు వైయస్ జగన్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. జగన్ ఏం చేసినా తప్పే ఏది చేయకపోయినా తప్పేనంటూ తన అనుకూల మీడియాలో ఊదరగొట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడు. ఒకపక్క ప్రజాధనాన్ని లూఠీ చేస్తూనే ఈ చంద్రబాబు ప్రజలకు సలహాలిస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో వైయస్ జగన్ సతీమణిని దారుణంగా తిట్టిన టీడీపీ కార్యకర్త, సోషల్ మీడియా సైకో చేబ్రోలు కిరణ్‌కి రాచమర్యాదలు కల్పిస్తున్నారు. మా నాయకుడి సతీమణిని తిట్టిన వ్యక్తిని నిలదీయడానికి వెళ్లిన మాజీ ఎంపీ, బీసీ నాయకుడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి మాత్రం చీత్కారాలు ఎదురవుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్సార్సీపీ నాయకులను దొంగల్లా, నక్సలైట్ల మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలకు బతికే హక్కే లేదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. సామాన్యులను వైయస్ జగన్ రాజ్యసభకు, పార్లమెంట్‌లో కూర్చోబెడితే చంద్రబాబు తప్పుడు కేసులు నమోదు చేసి జైళ్లకి పంపుతున్నాడు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు చేసినా ప్రజా సమస్యలపై వైయస్సార్సీపీ పోరాటం ఆగదు. ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం.