వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దం

దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్ట్‌లో వైయస్‌ఆర్‌సీపీ రిట్‌ దాఖలు

స్వార్థం కోసం బీజేపీ, టీడీపీ, జనసేనలు మత రాజకీయాలు

ముస్లిం సమాజంలో అభద్రతా భావం సృష్టించారు

అన్ని మతాల పట్ల సమధర్మం చూపాలి

ముస్లిం సమాజం మనోభావాలను గౌరవించాలి

లౌకికతత్వంకు భంగం కలిగించే చర్యలపై పోరాడుతాం

మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

తాడేపల్లి: దేశ లౌకిక వ్యవస్థకు భంగం కలిగిస్తూ, రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా చేసిన వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్ట్‌లో రిట్‌ 19575/2025 దాఖలు చేయడం ద్వారా వైయస్‌ఆర్‌సీపీ న్యాయపోరాటం సాగిస్తుందని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ, తెలుగుదేశం, జనసేనలు మత విద్వేషాలను రగిలించి, ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఈ చట్టాన్ని సమర్థించడం ద్వారా చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌లు ముస్లీంల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు. 

ప్రెస్‌మీట్‌లో పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..

    రాజ్యాంగంలోని వ్యక్తిగత, మతపరమైన స్వేచ్ఛలకు విఘాతం కలిగించేలా, న్యాయస్థానాల తీర్పులకు భిన్నంగా వక్ఫ్‌ సవరణ చట్టంను కేంద్రం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం చేసిన రాజ్యాంగ విరుద్దమైన బిల్లును పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకించింది. వక్ఫ్‌ చట్టానికి వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకిస్తోదని చెప్పగానే తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు మూడు కలిసి సాక్షి ఆస్తులన్నీ వక్ఫ్‌ భూముల్లో ఉన్నాయని, అందుకే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ను ప్రారంభించాయి. దీనిపై స్పందించిన సాక్షి యాజమాన్యం తమ ఆస్తులకు సంబంధించిన భుముల లింక్‌ డాక్యుమెంట్లతో సహా బయటపెట్టింది. దీనితో వాస్తవాలు అందరికీ తెలియడంతో వెంటనే దీనిపై కూటమి పార్టీల నేతలు మాట మార్చారు. లోక్‌సభలో వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఓటు వేశారు కానీ, రాజ్యసభలో వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ ఎంపీలకు పార్టీ విప్‌ జారీ చేయలేదంటూ కొత్త పాట అందుకున్నారు. రాజ్యసభలో వైయస్‌ఆర్‌సీపీ జారీ చేసిన విప్‌ను పార్టీ బయటపెట్టగానే, అప్పటి వరకు దీనిపై దుష్ప్రచారం చేసిన కూటమి నేతల నోళ్ళు మూతపడ్డాయి. విప్‌ జారీ చేశారు కానీ వ్యతిరేకంగా ఓటు వేయలేదంటూ మరో తప్పుడు ప్రచారంకు పాల్పడ్డారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది, మేం ఓటు వేయకపోతే దానిని బయటపెట్టాలని డిమాండ్‌ చేయడంతో, కూటమి నేతలు మళ్లీ దీనిపై మాట్లాడకుండా ముఖం చాటేశారు. 

మొత్తం ముస్లిం సమాజం చంద్రబాబుపై ఆగ్రహంతో ఉంది
    ఎప్పుడైతే వక్ఫ్‌ సవరణ చట్టంను కేంద్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందో, దేశవ్యాప్తంగా ముస్లింల్లో అభద్రతాభావం జీవం పోసుకుంది. ముస్లింల్లో అలజడి ప్రారంభమై, నిరసన కార్యక్రమాలు చేపట్టగానే సిగ్గు లేకుండా తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆ కార్యక్రమాల్లో పాల్గొని తమ మద్దతు తెలియచేస్తున్నాయి. ముస్లింల మనోభావాలు దెబ్బతినడానికి, వక్ఫ్‌ బిల్లు చట్టరూపం దాల్చడానికి పూర్తి మద్దతు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ, దానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు. దేశం మొత్తం టీటీడీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. కానీ ఏపీలో ఏ మాత్రం జంకు లేకుండా, సిగ్గుపడకుండా తెలుగుదేశం నేతలు ముస్లింలతో కలిసి వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

    ఇటీవలే తెలుగుదేశంకు చెందిన ఒక ముస్లిం నాయకుడు మాట్లాడుతూ ఈ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నామని చెప్పడం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. లోక్‌సభలో తెలుగుదేశం, జనసేన ఎంపీలు మద్దతు ఇవ్వకపోతే ఈ బిల్లు చట్టంగా ఆమోదం పొందేదేనా? కేంద్రంలోని ప్రభుత్వం నిలబడిందే టీడీపీ ఎంపీల మద్దతుతోనే. టీడీపీ మద్దతు లేకపోతే ఈ రోజు నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉండేవారేనా? చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల మద్దతుతోనే కేంద్రప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. అలాంటి కేంద్రంలో వక్ఫ్‌ సవరణ బిల్లుకు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు తమ వ్యతిరేకత తెలిపితే ఈ బిల్లు చట్టంగా వచ్చేదీ కాదు. ఒకవైపు ఢిల్లీలో వక్ఫ్‌ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఏపీలోని గల్లీల్లో ఈ చట్టానికి వ్యతిరేకమని రెండు నాలుకల దోరణితో మాట్లాడుతున్నారు. నారా లోకేష్‌ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ వైయస్‌ఆర్‌సీపీ ద్వంద వైఖరితో వ్యవహరించింది, వక్ఫ్‌ సవరణ బిల్లుపై రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటు వేయలేదంటూ అబద్దపు ప్రకటనలు చేశారు. 

మత ధర్మానికే విరుద్దం ఈ చట్టం
    హిందూ ఆలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగస్తులుగా కూడా ఉండటానికి వీలు లేదని ఎండోమెంట్‌ చట్టం చెబుతోంది. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో ఎండోమెంట్‌ విభాగాన్ని పర్యవేక్షించే అధికారి హిందువు కాకుండా ఉంటే హిందువులుగా మనం అంగీకరిస్తామా? కానీ 1995 వక్ఫ్‌ చట్టానికి కేంద్రం తాజాగా తీసుకువచ్చిన సవరణ ప్రకారం వక్ఫ్‌ బోర్డ్‌కు కానీ, కేంద్ర వక్ఫ్‌ కమిటీకి చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ ముస్లిం అయ్యి ఉండాల్సిన అవసరం లేదని చట్ట సవరణ చేశారు. ఇది ధర్మమా అని ప్రశ్నిస్తున్నాం. పవన్‌ కళ్యాణ్‌ గతంలో బాప్టీజం తీసుకున్నారు, తరువాత ముస్లిం సంప్రదాయాలను పాటిస్తున్నాను అని చెప్పారు. డిప్యూటీ సీఎం అయిన తరువాత డిక్లైర్డ్‌ సనాతన ధర్మ పరిరక్షకుడుగా అవతారం ఎత్తారు. కాబట్టి ఆయనను ప్రశ్నించడం అనవసరం. మిగిలిన చంద్రబాబు, లోకేష్‌ లను వైయస్‌ఆర్‌సీపీ నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నాం.

    ముస్లింలు అయిదుపూట్ల నమాజు చేసుకునే మసీద్, దాని ఆలనాపాలనా చూడటం, ముస్లింలు మరణిస్తే అంతిమ సంస్కారాలు చేసే ఖబ్రస్తాన్, దేవుడి మీద విశ్వాసంతో భగవంతుని సేవలో ఉండి స్వర్గస్తులయ్యే బాబాలకు భక్తితో నిర్మించే దర్గాలకు ముస్లిమేతరులు సీఈఓగా ఉండటం ధర్మమా? మన రాజ్యాంగంలో ప్రతి మతానికి స్వేచ్ఛ ఉండాలని నిర్ధేశిస్తోంది. 1995 వక్ఫ్‌ చట్టంలో కూడా వక్ఫ్‌ బోర్డ్‌ సీఈఓ ఖచ్చితంగా ముస్లిం అయి ఉండాలని చాలా స్పష్టంగా చెబుతోంది. ఎండోమెంట్‌ చట్టంలోనూ హిందూ దేవాలయ ఆస్తులు, హైందవ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆస్తులను కాపాడే ఉద్యోగులు ఖచ్చితంగా హిందువులే ఉండాలని దేవాదాయ, ధర్మాదాయ చట్టంలో రాసుకున్నాం. అదే విధంగా ముస్లింలకు వారి మతపరమైన సంస్థలకు ముస్లింలు ఉండాలనే హక్కును, నిబంధనను ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నాం. వారి మనోభావాలను దెబ్బతినేలా బీజేపీ, టీడీపీలు ఎందుకు వ్యవహరిస్తున్నాయి?

వక్ఫ్‌ ఆస్తులకు రక్షణ ఏదీ?:
    ఎండోమెంట్‌ ఆధీనలో పనిచేసే ఆ ఆలయాలు అయినా, లేదా ధర్మాదాయ సంస్థలకు హిందూ ఆఫీసర్లే ఉంటారు. దానిలోని కమిటీ సభ్యులు కూడా పూర్తిగా హిందువులే ఉంటారు. కానీ వక్ఫ్‌ కమిటీల్లో ఇద్దరు ముస్లిమేతరులు ఉండాలని మోదీ, పవన్‌ కళ్యాణ్, చంద్రబాబులు కలిసి చట్టం తీసుకువచ్చారు. వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లింలు కాని వారు ఉండవచ్చని అంటున్నారు. ఎక్కడైనా వక్ఫ్‌ బోర్డ్‌ ఆస్తులకు సరైన డాక్యుమెంట్లు లేకపోతే ఆ భూములను కబళించాలని చూస్తున్నారు. గెజిట్‌ డిక్లరేషన్‌ తరువాత వక్ఫ్‌ బై యూజర్‌ కింద  ముస్లింలు తమ మత సంప్రదాయాల కోసం వినియోగించే అన్ని భూములు ఆస్తులు కూడా వక్ఫ్‌ పరిధిలోకి వస్తాయి. అటువంటి వక్ఫ్‌ బై యూజర్‌ను తొలగించడం దుర్మార్గం కాదా? జిల్లా కలెక్టర్‌లకు విశేష అధికారాలను ఇస్తూ, ఇది వక్ఫ్‌ ఆస్తి కాదు అని సదరు అధికారి నిర్ణయిస్తే, దానిపై వక్ఫ్‌ ఉన్న అధికారం తొలగిపోతుందని చట్టాన్ని సవరించడం దారుణం కాదా?.
    
రాజకీయాల కోసం ముస్లింల్లో అభద్రతా భావాన్ని పెంచి, దానిని చూపి హిందువుల ఓట్లు దండుకోవాలని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయి. వక్ఫ్‌ చట్టంకు మూడు సవరణలు చేశామని నారా లోకేష్‌ చెబుతున్నారు. వక్ఫ్‌ బై యూజర్‌ అధికారాలను తొలగిస్తున్న దానిని, ముస్లింలు కాని వారు సీఈఓగా ఉండవచ్చనే దానిని, వక్ఫ్‌ బోర్డ్‌లో ముస్లింలు కాని వారు ఇద్దరు సభ్యులుగా ఉండవచ్చనే దానిని ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందా? మమతా బెనర్జీ మా రాష్ట్రంలో వక్ఫ్‌ సవరణ చట్టాన్ని అమలు చేయం అని అసెంబ్లీలో తీర్మానం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే అలాంటి తీర్మానం చేయగలరా అని సవాల్‌ చేస్తున్నాం. మాతో పాటు సుప్రీంకోర్ట్‌లో ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం కూడా రిట్‌ దాఖలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

జాతీయ స్థాయిలో రెండో స్థానం అంటూ అబద్దాలు:
    జాతీయ స్థాయిలో జీఎస్డీపీలో ఏపీ రెండోస్థానంలో ఉందని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని దినపత్రికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూటమి ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. ఇందులో ఇసుమంతైనా నిజం ఉందా? 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 2025 వరకు ఏపీ సొంత పన్ను ఆదాయాలు 2.16 శాతం వార్షిక వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. ఏ రాష్ట్రంలో అయినా పన్నుల ద్వారా వచ్చే ఆదాయాలు ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని సూచిస్తాయి. అంతేకాకుండా పన్నల ఆదాయాల ద్వారా వచ్చే వృద్ధి జీఎస్డీపీ వృద్దికి సమానంగా ఉంటుంది. అలాంటప్పుడు గత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 8.21 శాతంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసి చెప్పడం సమర్థనీయమా?.

    ఇక పెట్టుబడి వ్యయాలు పెద్ద ఎత్తున పెట్టారా అని చూస్తే 42.78శాతం పెట్టుబడి వ్యయం తక్కువగా ఉంది. అలాంటప్పుడు జాతీయ స్థాయిలో జీఎస్డీపీలో రెండో స్థానంలో ఏపీ ఎలా నిలబడింది. అంటే ఇంకా భారీగా అప్పులు తెచ్చుకునేందుకు గానూ ఈ దొంగ లెక్కలతో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. రెండోస్థానంలో ఉన్నట్లు చెబుతున్న లెక్కలను కాగ్‌ ఎక్కడైనా ఆమోదించిందా? ఇంకా చాలా రాష్ట్రాలు దీనిపై కేంద్రానికి లెక్కలు పంపలేదు. మరి ఏపీ రెండో స్థానంలో ఉందని ఎవరు చెప్పారు? ఈ వివరాలన్నింటినీ ఆయా రాష్ట్రాలే కేంద్రంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటస్టిక్స్‌ విభాగాలకు పంపాయి. ఇవి కూడా 2024–25కి సంబంధించి ఆయా రాష్ట్రాల ముందస్తు అంచనాలు మాత్రమే. 

ప్రతినెలా చంద్రబాబు డ్రామాలు:
    ప్రతి నెలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేసుకుని మరీ ఒక దళితుడి ఇంటికి వెడుతున్నాడు. యథాలాపంగా వెడుతున్న సీఎం కాన్వాయ్‌ ఒక్కసారిగా ఆగిపోతుంది. సీఎం ఒక్కరే తన కారు దిగుతాడు. మొత్తం సెక్యూరిటీ సినిమా చూస్తున్నట్లుగా ఒక్కరు కూడా కిందకు దిగరు. కేవలం స్థానిక ఎమ్మెల్యే మాత్రమే కారు దిగి చంద్రబాబు వద్దకు పరిగెత్తుకు వస్తారు. చంద్రబాబు తాపీగా కనిపించిన ఇంటిలోకి యథాలాపంగా వెడుతున్నట్లుగా ఒక ఎంపిక చేసుకున్న దళితుల ఇంట్లోకి వెళతారు. ఆ ఇంట్లో వాళ్ళను సీఎం అప్యాయంగా పలుకరిస్తారు. ఇలాంటి ఇంట్లో ఎలా ఉంటున్నారంటూ ఆశ్చర్యపోతారు. తానే నాలుగుసార్లు సీఎంగా పనిచేశాననే విషయం మరిచిపోయి, వారి పరిస్థితిని కొత్తగా చూసినట్లు మాట్లాడతారు. మీ పరిస్థితిని మార్చేస్తాను అంటూ అప్పటికప్పుడు వారికి ఒక పక్కాఇల్లు మంజూరు చేస్తారు. ఇది ప్రతినెలా ఒకసారి జరిగే తంతు. చూసేవారికి సీఎం హటాత్తుగా ఒక పేద వ్యక్తికి ఇంటికి వెళ్లి, వారి యోగక్షేమాలు తెలుసుకుని, అప్పటికప్పుడు స్పందించారనే విధంగా ఒక బిల్డప్‌ ఇస్తారు. దీనిని తమకు అనుకూలమైన మీడియాలో భారీగా ప్రచారం చేసుకుంటారు.

    చంద్రబాబు చేస్తున్న ఈ డ్రామలు చూస్తుంటే, ఇంతకంటే ప్రజలను నమ్మించే వారు మరొకరు రారు అనే నమ్మకం కలుగుతోంది. వాస్తవం ఏమిటా అంటే ఆయన ముందుగానే ఒక ఇంటిని ఎంపిక చేసుకుంటారు. ఆ ఇంటికి వెళ్లేప్పుడు ఆయన చొక్కాకు మైక్‌ ఉంటుంది. అలాగే ఆ ఇంటిలోని వారికి కూడా మైక్‌ ఉంటుంది. సీఎం యథాలాపంగా ఒక ఇంటికి వెడితే ఈ మైక్‌లు ఎలా ఉంటాయి? సీఎం హటాత్తుగా, ఎటువంటి సమాచారం లేకుండా ఏదైనా ఇంటికి వెడితే, ముందుగానే ఇల్లంతా నీట్‌గా సర్థిఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇదీ చంద్రబాబు ఆడుతున్న డ్రామా. 

అంబేడ్కర్‌ జయంతి రోజున అరాచకం:
    నిన్న అంబేడ్కర్‌ జయంతి సాక్షిగా హిందూపురంలో ఇద్దరు బహుజన యువకుల చేతులకు సంకెళ్లు వేసి పోలీసులు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత, బహుజనుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపునకు ఇది నిదర్శనం. కేవలం సోషల్‌ మీడియాలోని పోస్ట్‌ను ప్రశ్నించడమే వారు చేసి నేరం. అలాంటి యువకులను కరుడుకట్టిన నేరస్తులను తీసుకు వెళ్ళినట్లు చేతులకు బేడీలు వేసి, నడిపించుకుంటూ తీసుకువెళ్ళారంటే, ఈ రాష్ట్రంలో దళిత, బహుజనులకు ఉన్న భద్రత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

వైయస్‌ఆర్‌సీపీ నేతల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు:
    2019 కి ముందు, ఆ తరువాత కూడా వైయస్‌ఆర్‌సీపీ నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారు. వైయస్‌ జగన్, ఆయనతో పనిచేసే సుమారు వంద మంది ఫోన్‌లను అప్పటి ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయిల్‌ నుంచి సాంకేతిక పరికరాలను, పరిజ్ఞానంను తీసుకువచ్చి ట్యాపింగ్‌ చేశారు. మమతా బెనర్జీ కూడా ఇదే విషయం చెప్పారు. అయినా చంద్రబాబు దానిని అంగీకరించలేదు. ఈ రోజు వాట్సాప్‌ వ్యవస్థను నడుపుతున్న మెటా 2018–19 మధ్య దాదాపు వందమంది ఫోన్‌లను ఏపీలో ట్యాప్‌ చేశారని హైకోర్ట్‌కు సమాచారం ఇచ్చింది.
    
చంద్రబాబు పాలన ఎంత అరాచకంగా ఉంటుందీ అనే దానికి ఇది నిదర్శనం. రాజధాని ప్రాంతంలో కొత్తగా నలబై నాలుగు వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారో, దానిలో ఎవరెవరి ఆస్తులు ఉన్నాయో, ఈ విస్తరణ వెనుక ఉన్న కుట్ర ఏమిటో త్వరలోనే బయటకు వస్తుంది. చంద్రబాబు తన స్వలాభం తప్ప రాష్ట్రం కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోరు.

Back to Top