చంద్రబాబు దళితుల వ్యతిరేకి

ఆయన దళిత సమాజాన్ని అణగదొక్కారు

టీజేఆర్‌ సుధాకర్‌బాబు, నందిగం సురేష్‌ ఫైర్‌ 

ఓట్ల కోసమే చంద్రబాబు అంబేడ్కర్‌ పేరు వాడుతున్నారు

చంద్రబాబు పాలనలో దళితులకు నిత్యం కష్టాలు 

ఎస్సీల భవిష్యత్తును చంద్రబాబు కాల రాశారు

కేసులతో వేధిస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు

టీజేఆర్‌ సుధాకర్‌బాబు, నందిగం సురేష్‌ ధ్వజం

అంబేడ్కర్‌ స్మృతివనంపై చంద్రబాబు కుట్రలు

పవిత్ర స్థలాన్ని వాణిజ్య కేంద్రంగా మార్చే యోచన 

ప్రైవేటుపరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు

అదే జరిగితే చంద్రబాబును దళితవాడల్లో తిరగనివ్వం

ప్రెస్‌మీట్‌లో సుధాకర్‌బాబు, నందిగం సురేష్‌ వార్నింగ్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు, పార్టీ పీఏసీ మెంబర్, మాజీ ఎంపీ నందిగం సురేష్‌.

తాడేపల్లి: సీఎం చంద్రబాబు దళితుల వ్యతిరేకి అని, ఆయన దళిత సమాజాన్ని అణగదొక్కారని.. ఇప్పుడు ఓట్ల కోసమే ఆయన అంబేడ్కర్‌ పేరు వాడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు, పార్టీ పీఏసీ మెంబర్, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ ధ్వజమెత్తారు. ఓట్ల కోసమే చంద్రబాబు అంబేడ్కర్‌ పేరు వాడుతున్నారన్న వారు, ఆయన పాలనలో దళితులకు రోజూ కష్టాలే అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు స్పష్టం చేశారు.

టీజేఆర్‌ సుధాకర్‌బాబు, నందిగం సురేష్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

కూటమి పాలన దళితులకు శాపం:
    చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులను అణగదొక్కుతూనే ఉన్నారు. దళితుల జీవితాలను ఆయన చిన్నాభిన్నం చేస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు అమలు చేయడం ద్వారా జగన్‌గారు తన 5 ఏళ్ల పాలనలో వెనుకబడిన వర్గాల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా, కూటమి ప్రభుత్వంలో ఈ 10 నెలల చంద్రబాబు పాలన దళితులకు శాపంలా మారింది. నాడు జగన్‌గారు తీసుకొచ్చిన విద్య, వైద్య విప్లవాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. దళితులకు అండగా నిలిచే ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా ప్రధాన లబ్ధిదారులుగా ఉన్న దళితుల భవిష్యత్తు ఆశలను చంద్రబాబు చిదిమేశారు. అలా దళితులను అభివృద్ధికి మరింత దూరం చేసిన చంద్రబాబు, వారి భవిష్యత్తును ఎలా బాగు చేస్తారు?.

అంబేడ్కర్‌ స్మృతివనాన్ని ఎందుకు సందర్శించలేదు?:
    అంబేడ్కర్‌ అందరివాడని చెబుతున్న చంద్రబాబు, విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ స్మృతివనాన్ని చంద్రబాబు ఎందుకు సందర్శించలేదు? స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్టేడియమ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినా, పక్కనే ఉన్న అంబేడ్కర్‌ స్మృతివనాన్ని పట్టించుకోలేదు. ఆ వనాన్ని సందర్శించకపోగా నిర్వహణ బాధ్యత కూడా విస్మరించారు. అంతేకాకుండా, ఆ స్మృతివనంలో శిలాఫలకంపై అప్పటి సీఎం జగన్‌గారి పేరు ఉంటే, టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే దాన్ని ధ్వంసం చేసింది. ఇది అత్యంత హేయం.

వైయ‌స్ జగన్ హయాంలోనే దళితులకు మేలు:
    దళిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు, అమ్మ ఒడి, చేయూత, ఆసరా, లబ్ధిదారుల ఇళ్లకు కూడా వెళ్లి ఉంటే, తన పాలనలో ఆ కుటుంబాలు ఎంతగా చితికిపోయాయో తెలిసేది. ఇంగ్లిష్‌ మీడియం ఎత్తేసిన ప్రభావం దళిత కుటుంబాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. వైయస్‌ జగన్‌ డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన రూ.2.75 లక్షల కోట్లలో ఎస్సీల వాటా అక్షరాలా రూ. 69,598.67 కోట్లు. 
    చంద్రబాబు ఎన్ని డ్రామాలు చేసినా ఆయన ఎప్పటికీ దళిత వ్యతిరేకే. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న చంద్రబాబు దళితుల అభ్యున్నతి పట్ల ఎలా ఉంటాడో అర్థం చేసుకోలేమా?. నాడు చంద్రబాబు క్యాబినెట్‌లో ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులు శుభ్రంగా ఉండరు అని, వారి పట్ల అక్కసు ప్రదర్శించారు. ఇంకా, మీరు దళితులు. మీకెందుకురా రాజకీయాలు? అంటూ వెక్కిరించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను చంద్రబాబు, కనీసం పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు. ఇంకా చంద్రబాబు ఎప్పుడూ మాట్లాడే రాజధాని ప్రాంతమైన అమరావతిలో దళితులకు 54 వేల ఇళ్ల పట్టాలు ఇస్తే దాన్ని సహించలేని చంద్రబాబు కోర్టును ఆశ్రయించి సామాజిక అసమతుల్యత  (డెమోగ్రాఫిక్‌ ఇంబ్యాలెన్స్‌) ఏర్పడుతుందని వాదించారు, అంటే తన నివాసానికి సమీపంలో దళితులెవరూ ఉండటానికి వీల్లేదని చంద్రబాబు అనుకోవడమే కదా?.

దళిత నాయకులపై అక్రమ కేసులు:
    గ్రామసభలు ఏర్పాటు చేసి వైయస్‌ జగన్‌ హయాంలో, చంద్రబాబు పాలనలో దళితులకు జరిగిన మేలు గురించి చర్చిద్దాం రండి. తన 15 ఏళ్ల పాలనను, వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనతో పోల్చి మాకన్నా ఎక్కువగా దళితులకు ఏం చేశారో చెప్పగలరా? నందిగం సురేష్‌ లాంటి ఒక సామాన్యుడిని ఎంపీగా చేయగలరా?  చేయకపోగా ఆయన మీద అక్కసుతో సురేష్‌ మీద కేసులు పెట్టి కొన్ని నెలలు జైల్లో పెట్టి వేధించారు.
    వైయస్‌ జగన్‌ ఐదుగురు దళితులను మంత్రులుగా చేస్తే చంద్రబాబు కేవలం ఇద్దర్ని మాత్రమే మంత్రులను చేశాడు. దళిత మహిళను హోం మంత్రిని చేసిన ఘనత కూడా జగన్‌దే. ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని పాటించే పరిస్థితి కూడా జగనే తీసుకొచ్చాడు కాబట్టే కూటమి ప్రభుత్వంలో దళిత మహిళకు హోం మంత్రి పదవి దక్కింది.     ఇంకా పలువురు దళితులకు జగన్‌గారు, కార్పొరేషన్‌ ఛైర్మన్లుగా అవకాశం కల్పించారు. మాల, మాదిగలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వైయస్‌ జగన్‌ దళితులను రాజకీయంగా ప్రోత్సహిస్తే చంద్రబాబు సీఎం అయ్యాక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, నందిగం సురేష్, మొండితోక సోదరులు, మేరుగ నాగార్జున.. ఇలా ప్రతి దళిత నాయకుడి మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులను చేయాలని చూస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోరాడతాం. 

స్మృతివనాన్ని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం:
    పీపీపీ పద్ధతిలో అంబేడ్కర్‌ çస్మృతివనాన్ని ప్రైవేటుపరం చేస్తే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్‌లో ఉన్న ఎన్టీఆర్‌ ఘాట్‌లో సమాధి మాత్రమే ఉంచి మిగతా ప్రాంతంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ కడతామంటే మీరు, మీ పార్టీ కార్యకర్తలు అంగీకరిస్తారా? అని చంద్రబాబుని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి అలాంటప్పుడు దళితులు దేవుడుగా కొలిచే అంబేడ్కర్‌ స్మృతివనాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలనుకోవడం హేయం. 
    చంద్రబాబూ ఖబడ్దార్‌. దాని జోలికి వెళ్తే యుద్ధం ప్రకటిస్తాం.  మీరు దళితవాడల్లోకి రాకుండా అడ్డుకుంటాం. అంబేడ్కర్‌ కాళ్లకు నమస్కరించి క్షమాపణలు కోరే వరకు విశ్రమించబోమని టీజేఆర్‌ సుధాకర్‌బాబు, నందిగం సురేష్‌ ప్రకటించారు.

అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు పేరుతో మోసం: నందిగం సురేష్‌.
– 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి ప్రాంతంలోని ఐనవోలు దగ్గర అంబేడ్కర్‌ విగ్రహం ప్రతిష్టిస్తామని చెప్పి, కనీసం రాయి కూడా వేయలేదు. అదే జగన్‌గారు విజయవాడ నడిబొడ్డున రూ.450 కోట్లతో సగర్వంగా 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మొదటి దాడి అంబేడ్కర్‌ విగ్రహం మీదనే జరిగింది. 
మా కుటుంబంపై దాడులు:
    ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఉ. 10.45 గం.కు మా ఇంటి మీద దాడి చేసి నా భార్యను కాలితో తన్నారు. మా అమ్మ, సోదరి మీద దాడి చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా నావద్ద ఉన్నాయి. ప్రజలకు మేలు చేయమని అధికారం ఇస్తే దళితుల మీద దాడులకు దిగుతున్నారు. నన్ను 5 నెలలు జైల్లో పెట్టి వేధించారు. నా భార్య, కుటుంబ సభ్యులు లాయర్ల దగ్గరకు వెళ్లినా ఫాలో కావడంతో పాటు,  బెదిరించడం, విదేశాల నుంచి రాంగ్‌ కాల్స్‌ చేసి భయపెట్టడం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆధారాలన్నీ ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతానని సందిగం సురేష్‌ వివరించారు.

Back to Top