తిరుపతి: ప్రపంచంలోనే అత్యంత పవిత్రక్షేత్రమైన తిరుమలలో టీటీడీ నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకున్న మహాపాతకంకు సంబంధించిన సంచలన వాస్తవాలను మాజీ టీటీడీ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి బయటపెట్టారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీ గోశాలలో మూడు నెలల్లోనే వందకు పైగా గోవులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డ వైనంకు సంబంధించిన వివరాలను మీడియా ముందుకు తెచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత వరుసగా జరుగుతున్న ఈ గోమరణాలను టీటీడీ ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మొత్తం హిందూసమాజం అత్యంత పవిత్రమైనది భావించే గోవులకు టీటీడీ గోశాలలో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని, వరుస గోమరణాలపై తక్షణం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... దేశంలో గోవును అత్యంత పవిత్రమైన జంతువుగా హిందువులు పూజిస్తుంటారు. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాలలో సకల దేవతల స్వరూపిణీ అయినటువంటి గోమాతకు దారుణమైన పరిస్తితి దాపురించింది. హైందవ ధర్మాన్ని కాపాడతామని, తిరులమ పవిత్రతను రక్షించడమే ధ్యేయంగా పాపప్రక్షాళన చేస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వంలో టీటీడీ గోశాలలో గత మూడు నెలల్లో దాదాపు వందకు పైగా గోవులు మృత్యువాత పడ్డాయి. దీనిని బయటకు రానివ్వకుండా దాచిపెట్టారు. గోవులు తాకితే, గోప్రదక్షిణ చేస్తేనే పుణ్యం లభిస్తుందని హిందువులు భావిస్తుంటారు. శ్రీవారి ఆలయ పరిరక్షణలో, సాక్షాత్తు వెంకటేశ్వరస్వామికే గోక్షీరాన్ని ఇచ్చిన గోమాతను మరింత పవిత్రమైనదిగా పూజిస్తుంటారు. ఆ గోవును అదిలించేందుకు గోపాలుడు విసిరిన గొడ్డలి దెబ్బ నుంచి గోవును రక్షించేందుకు స్వామివారే అడ్డపడి, ఆ దెబ్బను కాచుకున్న ఉదంతం కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీవారి ఆలయ తలుపులు తెరిచేది కూడా గోసంరక్షకుడే. అంత పవిత్రమైన గోవును తిరుమల క్షేత్రంలో ఎంతో పుణ్యప్రధమైనదిగా పూజిస్తుంటారు. అలాంటి గోవులకు తిరుమల క్షేత్రంలో ఎటువంటి దుస్థితి దాపురించిందో ప్రజలకు తెలియచేసేందుకు ఈ మీడియా సమావేశంలో వాటి దుస్థితికి అద్దం పట్టే ఫోటోలను ప్రదర్శిస్తున్నాం. దేశవాళీ అవులు ఎంత దారుణంగా మృత్యువాత పడ్డాయి, వాటిని ఏ రకంగా టీటీడీ గోశాల నిర్వాహకులు వదిలేశారనే దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఈ మీడియా సమావేశంలో మొత్తం ప్రజలంతా చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం. అర్థాంతరంగా ఎన్ని ఆవులు ఎలా చనిపోయాయో తెలుసుకునేందుకు కనీసం పోస్ట్‌మార్టం కూడా నిర్వహించలేదు. వందకు పైగా ఆవులు మృత్యువాత పడుతుంటే అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక డీఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్‌చార్జిగా నియమించారు. ఆయనకు గోపరిరక్షణకు ఎటువంటి సంబంధం లేదు. వీటిమీద వెంటనే విచారణ జరిపించాలి. కొండమీద ఇంత దారుణాలు జరుగుతుంటే, వాస్తవాలను బయటకు రానివ్వకుండా దాచిపెడుతున్నారు. వైయస్ జగన్ హయాంలో గోమాతకు అత్యున్నత స్థానం వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా గత అయిదేళ్ళ పాలనలో తిరుమల క్షేత్ర పవిత్రతను, గోమాత గొప్పదనంను అత్యున్నత స్థానంలో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. స్వామి వారి కైంకర్యాలకు స్వచ్ఛమైన పాలు, వెన్న, నెయ్యిని అందించేందుకోసం 550 నాణ్యమైన, ఉన్నత జాతి దేశవాళీ ఆవులను దేశం నలుమూలల నుంచి ఎంపిక చేసి ఇక్కడ ఏర్పాటు చేసిన గోశాలకు తరలించాం. ఇందుకోసం సాహీవాల్, గిర్, కాంకీర్ వంటి జాతుల ఆవులను గుజరాత్, పంజాబ్, రాజస్తాన్ నుంచి సమీకరించి అప్పటి రైల్వేశాఖ మంత్రితో చర్చించి రైలుమార్గంలో వాటిని సురక్షితంగా తిరుమలకు తరలించాం. స్వామివారికి నిత్యం 1500 లీటర్ల పాలను కైంకర్యాలకు వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ టీటీడీ గోశాల నుంచి నిత్యం వంద కేజీల స్వచ్ఛమైన నెయ్యిని స్వామివారికి అందించాలనే లక్ష్యంతోనే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఈ గోశాలలో మేలుజాతి దేశీయ ఆవులను తీసుకువచ్చింది. ఈ ఆవుల నుంచి వచ్చే పాలను కూడా సంప్రదాయ కవ్వంతో చిలికి, దాని ద్వారా వెన్నను తీసేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇందుకోసం దాదాపు రూ.5 కోట్లను ఖర్చు చేశాం. నేడు కూటమి ప్రభుత్వంలో దానిని పట్టించుకునే నాథుడు లేదు. స్వచ్ఛమైన నెయ్యినే స్వామి వారి కైంకర్యాలకు వినియోగించాలనే మంచి లక్ష్యంతో వైయస్ జగన్ గారి ప్రభుత్వం శ్రీవారిపై ఎంతో భక్తిప్రవక్తులతో ఈ చర్యలు తీసుకుంది. దాదాపు రెండువేల ఆవులను రైతు సాధికారిత సంస్థ ద్వారా గోశాల నుంచి రైతులకు పంపిణీ చేయడం జరిగింది. వాటిని రైతులు ఎంతో జాగ్రత్తగా పోషిస్తున్నారు. రోజుకు 15వేల కేజీల నెయ్యి సాధించాలనే లక్ష్యంతో ఈ బ్రీడింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. కవ్వంతో చిలికి వెన్న, తద్వారా నెయ్యిని తీసే కార్యక్రమాన్ని చేశాం. మొట్టమొదటిసారిగా స్వామివారికి నవనీత సేవను తీసుకువచ్చాం. శ్రీవారి సేవకుల ద్వారా నలబై గిర్ ఆవుల నుంచి పాలను కాచి, దాని నుంచి వెన్నను తీసి నవనీత సేవలకు వినియోగిస్తున్నాం. శ్రీవారి పట్ల, పవిత్రమైన గోవుల పట్ల వైయస్ జగన్ గారికి ఉన్న చిత్తశుద్ది అది. వైయస్ రాజశేఖరరెడ్డి గారి హయాంలో దేశంలోని హైందవ ధార్మికులను పిలిచి మూడు రోజుల పాటు వందే గోమాతరం పేరుతో సదస్సు నిర్వహించాం. నిపుణులతో గోవును ఎలా రక్షించుకోవాలనే దానిపై సదస్సులను నిర్వహించాం. గోమూత్రం, గోమయంతో సుగంధ ద్రవ్యాలను తయారు చేశాం. వాటిని భక్తులకు విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించి, గోశాల కోసం వినియోగించాం. గోఆధారిత ఉత్పత్తులతో పదిహేను రకాల వస్తువులను తయారు చేసి భక్తులకు విక్రయించాం. దాదాపు రూ.యాబై కోట్ల వ్యాపారం అగర్‌బత్తీలు, సుగంథ ద్రవ్యాలు, పంచగవ్య ఉత్పత్తుల విక్రయం ద్వారా టీటీడీకి లభించింది. రూ.50 కోట్లతో మేలుజాతి ఆవుల పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటు ఎన్‌డీడీపీ వారి సహకారంలో రూ.50 కోట్లతో సాహీవాల్, కాంకేర్, గిర్, బాహుబలి ఆవుల పునరుత్పత్తి కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటు చేశాం. దాదాపు పూర్తి కావొచ్చిన ఈ కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూలనపడేశారు. మంచి బ్రీడింగ్ ద్వారా గోఆధారిత పంటలను ప్రోత్సహించడానికి, ఏపీలో ఒక కొత్త ఉద్యమాన్ని వెంకటేశ్వరస్వామి ఆలయం ద్వారా చేయాలనే లక్ష్యంతో గత సీఎం వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు టీటీడీ బోర్డ్ చర్యలు తీసుకుంది. ఎన్డీడీపీ చైర్మన్‌ను తీసుకువచ్చి, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్లాంట్‌ను పెట్టేందుకు కృషి చేశాం. మంచి బ్రీడింగ్ ద్వారా దేశవాళీ ఆవులను ఉత్పత్తి చేసి రైతులకు అందించాలని సంకల్పించాం. ఈ ఆవుల నుంచి శ్రీవారి సేవలు, లడ్డూ ప్రసాదం కోసం రోజుకు 15000 కేజీల స్వచ్ఛమైన నెయ్యిని రైతుల నుంచి సమీకరించాలనే ఆశయంతో వైయస్ జగన్ గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నేడు ఈ కేంద్రంను గురించి పట్టించుకునే వారు లేరు. వైయస్ జగన్ ప్రభుత్వం శ్రీవారి కోసం చేసిన ప్రతి మంచిపనినీ తుడిచేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. టీటీడీ గోశాలలో నేడు దుర్భర పరిస్థితులు వైయస్ జగన్ ప్రభుత్వంలో ఎంతో ఘనంగా నిర్వహించిన టీటీడీ గోశాల నేడు మృత్యుఘోషతో కనిపిస్తోంది. నిత్యం గోవులు మరణిస్తున్నాయి. కనీసం పోషకాహారం లేక గోవులు బక్కచిక్కి దుర్బరంగా జీవిస్తున్నాయి కనీసం రోజుకు 500 లీటర్ల పాలు కూడా కొండకు వెళ్ళడం లేదు. అనారోగ్యంతో ఉన్న గోవులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. ఇద్దరు వైద్యులు, ఇద్దరు కాంపౌండర్లతో కాలం వెళ్ళదీస్తున్నారు. కనీసం పూర్తిస్తాయి గోశాల పరిరక్షక అధికారి నియామకం లేదు. వేరే విభాగానికి సంబంధించిన అటవీశాఖ అధికారిని గోశాల ఇన్‌చార్జ్‌గా నియమించారు. గోవులకు అందిస్తున్న దాణా కూడా చెత్త పడేసినట్లుగా వేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే సాహీవాల్ జాతికి చెందిన గర్భంతో ఉన్న గోవు గోశాల నుంచి తప్పించుకుని వెళ్ళి రైలు కింద పడి ఆవు, దాని గర్భంలోని దూడ కూడా మరణించాయి. అవి టీటీడీకి సంబంధించినవి అని తెలియకుండా ఉండేందుకు చనిపోయిన గోవుల చెవులకు ఉన్న ట్యాగ్‌లను కనిపించకుండా చెవులను కూడా కత్తిరించిన దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు నెలల్లో వందకు పైగా గోవులు చనిపోతుంటే, ఎందుకు అవి మృత్యువాత పడుతున్నాయో తెలుసుకునేందుకు కనీసం పోస్ట్‌మార్టం కూడా నిర్వహించలేదు. చనిపోయిన వాటిని గుప్పుచప్పుడు కాకుండా చేసే ప్రయత్నం జరిగింది. దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి. గోవుల మరణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి. గోశాలకు పూర్తిస్థాయి అధికారిని నియమించాలి. దారుణ స్థితిలో ఉన్న గోవులకు సత్వర వైద్యం జరిపించాలి. గోదాణా విషయంలో జరుగుతున్న అవకతవకలను సరిచేయాలి. గోమాత పట్ల జరుగుతున్న పాపంకు బదులేది? టీటీడీ గోశాలలో గోమాత పట్ల జరుగుతున్న పాపంకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సనాతన ధర్మపరిరక్షణకు కంకణం కట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బదులు చెప్పాలి. నిత్యం వైయస్ జగన్ గారిపైన విషం చిమ్మడంలోనే వీరు నిమగ్నమయ్యారు. తిరుమల శ్రీవారిని కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ గత ప్రభుత్వంపై చెప్పలేనంత బుదరచల్లే ప్రయత్నం చేశారు. ఈ రోజు వారి ప్రభుత్వంలో గోమాతకు జరుగుతున్న అపచారం పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న హిందూసంఘాలు స్పందించాలి. గో పరిరక్షణకు ముందుకు రావాలి.