విశాఖపట్నం: ఏపీ జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు గిమ్మిక్కులతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ జీఏస్డీపీలో రెండోస్థానంలో ఉందని సీఎంగా చంద్రబాబు గొప్పగా ప్రకటించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ఇటువంటి పబ్లిసిటీ స్టంట్‌ను ఆయనకు వంతపాడే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వాస్తవమే అనేంతగా ప్రజల్ని నమ్మించేందుకు పతాక శీర్షికల్లో వార్తలు ప్రచురించి బాకా ఊదడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ప్రజలకు వాస్తవాలను తెలియకుండా, తన పాలనలో అద్భుతమైన అభివృద్ది సాధ్యపడిందని పచ్చి అబద్దాలను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నాంటే.. 2024-25లో అద్భుతమైన ఆర్థిక వృద్ధి సాధించామంటూ చంద్రబాబు తాజాగా ప్రకటించారు. నిన్నటి దాకా రాష్ట్రం అప్పులపాలైందని, ఎన్నికల హామీలను కూడా అమలు చేయలేకపోతున్నామంటూ రోజూ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. నేడు హటాత్తుగా అభివృద్దిలో జాతీయ స్థాయిలో రాష్ట్రం దూసుకుపోయిందని, ఏకంగా జీఏస్డీపీలో రెండోస్థానంలో నిలబడిందంటూ తన ప్రతిభను గొప్పగా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండింటిలో నిజం ఏదో అర్థం కాక ప్రజలు అయోమయంలో ఉన్నారు. కేంద్ర సంస్థకు ఇచ్చే లెక్కల్లో హేతుబద్దత ఉందా? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ వారి నివేదిక ఆధారంగా రాష్ట్రం జీఏడీపీ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ సంస్థకు రాష్ట్రానికి సంబంధించిన వివరాలను ఎవరు అందించారా అని చూస్తే, రాష్ట్ర ప్రభుత్వమే తాను సాధించగలను అని అనుకుంటున్న అంచనాలను సదరు సంస్థకు ఇచ్చింది. దానినే వారు తమ నివేదికలో పొందుపరుస్తారు. అలాగే ఈ లెక్కలను కూడా పూర్తిస్థాయిలో ఖరారు చేసేందుకు ఒక ఆడిట్ ప్రక్రియ కూడా ఉంటుంది. ఇవ్వన్నీ జరిగిన తరువాత వచ్చేవే అసలైన జీఏస్డీపీ లెక్కలు. దానిలో మన రాష్ట్రం ఏ స్థానంలో ఉందో అధికారికంగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఎక్కడా జరగకుండానే రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని చెప్పుకోవడం చూస్తుంటే చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఎంత పీక్‌లో ఉందో అర్థమవుతుంది. కేంద్ర సంస్థకు ఇచ్చిన లెక్కల్లో హేతుబద్దత ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పలు రాష్ట్రాల నుంచి అంచనాలే రాలేదు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ సంస్థకు ఇంకా అనేక రాష్ట్రాల నుంచి అంచనాలు రాలేదు. యూపి, కేరళ, బీహార్, గుజరాత్, ఢిల్లీలు తమ అంచనాలు ఇంకా వీరికి ఇవ్వలేదు. ఇంకా అన్ని రాష్ట్రాల నుంచి అంచనాలు రాకపోయినా కూడా ఏపీ రెండోస్థానంలో ఉందని చాటడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుంది. దీనిని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పతాక శీర్షికల్లో ప్రచురించి, ఆహా అద్భుతం అన్నట్లుగా ప్రచారం ఇచ్చాయి. తమిళనాడు 9.69 శాతం, ఏపీ 8.21 శాతం, పుద్దుచ్చేరి 7.96 శాతం వారి రాష్ట్రాల జీఏడీపీలు ఉంటాయని రాసుకుంటూ వెళ్లారు. ఇవ్వన్నీ ఆయా రాష్ట్రాలు తమ ఆర్థిక గణాంకాలను అందిస్తూ, తాము సాధించబోయే దానిని గురించి అందించే వివరాలు మాత్రమే. రాష్ట్రాల ఆర్థిక స్థితికి అనుగుణంగా అంచనాలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు తమిళనాడు ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు వార్షికంగా 13.01 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దాని ఆధారంగా గత ఆర్థిక సంవత్సరానికి వారి జీఎస్డీపీ 9.68శాతం ఉంటుందని అంచనా వేశారు. ఏపీకి సంబంధించి సొంత పన్ను ఆదాయాలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకు 2.16 శాతం మాత్రమే వార్షిక వృద్ధిని నమోదు చేశాయని అధికారులే చెబుతున్నారు. మరలాంటప్పుడు రాష్ట్ర జీఎస్డీపీ 8.21 శాతం ఎలా సాధ్యమవుతుందో చెప్పాలి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్నులు కాకుండా వచ్చే ఇతర ఆదాయాలు వార్షికంగా 33.35 శాతం క్షీణతను నమోదు చేశాయి. మూలధన వ్యయం వార్షికంగా 42.78 శాతం తగ్గింది. వాస్తవాలు ఇలా ఉంటే దేశంలో నెంబర్ టూ అంటూ చేసుకుంటున్న ప్రచారానికి అర్థం ఉందా? తన పాలనలో అద్భుతమైన వృధ్ధిని సాధించానంటూ ఇంత దిగజారుడు గిమ్మిక్కులకు పాల్పడటం దారుణం. అప్పులతో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు మన ఆస్తులు పెరగాలంటే, మనకు ఆదాయాలు పెరగాలి. అలా కాకుండా వృద్ధిరేటు దేని ప్రకారం పెరుగుతుందో చెప్పాలి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2019 వరకు సుమారు రూ.3.90 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇవి రూ.7.20 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే రూ.3.70 లక్షల అప్పు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం చేసింది. ఇందులో కూడా రూ.2.70 లక్షల కోట్లు వివిధ సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా ప్రజలకు అందించింది. ఈ పదినెలల కాలంలోనే రూ.1.48 లక్షల కోట్లు కూటమి ప్రభుత్వం అప్పులు చేసింది. గత ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.70వేల కోట్ల వరకు అప్పులు చేస్తే, కూటమి ప్రభుత్వం పదినెలల్లోనే రూ.1.48 లక్షల కోట్లు అప్పులు చేసింది. మరి ఎలా జీఏస్డీపీ భారీగా పెరుగుతుందని చెబుతున్నారో అర్థం కావడం లేదు. ఈ తప్పుడు నివేదిక అంశాలపై మంత్రులు ముందుకు వచ్చి హర్షాలు వ్యక్తం చేయడం, గొప్పగా బుజాలు ఎగరేయడం ఎందుకు? అంత అభివృద్ధే ఉంటే హామీల అమలు ఏదీ? చంద్రబాబు చెబుతున్నంత అభివృద్ది నిజంగా ఉంటే ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? ఒక్క పెన్షన్ల పెంపు తప్ప ఏ ఒక్క పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా అమలు చేయడం లేదు. చివరికి ఏడాదికి ఇస్తామన్న మూడు సిలెండర్లలో ఒక్కటితోనే సరిపెట్టారు. ఇక తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణాలు ఎప్పుడో ఎవరికీ తెలియవు. ప్రతిసారీ తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే చంద్రబాబు గిమ్మిక్కులకు పాల్పడుతుంటారు. దానిలో భాగంగానే ఈ తాజా జీఏస్డీపీ వృద్ధి హంగామా కూడా.