విజయవాడ: తిరుపతి జిల్లా వెంకటగిరి మునిసిపల్ చైర్‌పర్సన్ ఉప ఎన్నిక సజావుగా నిర్వహించాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కోరారు. ఈ మేరకు సోమవారం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, వైయస్ఆర్‌సీపీ ఎస్‌సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 9నే ఉప ఎన్నిక నిర్వహించాలి: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెంకటగిరి మునిసిపాలిటీలో 25 కార్పొరేటర్లకు గాను 25 వైయస్ఆర్‌సీపీ గెలిచింది, కానీ ఇందులో కొంతమంది కార్పొరేటర్లను కూటమి నాయకులు ప్రలోభాలకు గురిచేసి, భయభ్రాంతులకు గురిచేసి ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టారు, దీనిపై ఈ నెల 9 న కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు, కానీ ఈ సమావేశాన్ని వాయిదా వేయించాలని కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నిక 9 నే జరపాలని, కౌన్సిలర్లకు తగిన భద్రత కల్పించాలని, అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చూడాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ జరపాలని ఈసీకి ఫిర్యాదు చేశాం. వైయస్ఆర్‌సీపీకి పూర్తి బలం ఉన్న చోట కూడా ఇంత దారుణంగా వ్యవహరించడాన్ని ఈసీ దృష్టికి తీసుకొచ్చాం. అవిశ్వాసానికి వైయస్ఆర్‌సీపీ సిద్ధం: వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్.చంద్రశేఖర్ రెడ్డి వెంకటగిరిలో అవిశ్వాసం ఎదుర్కోవడానికి వైయస్ఆర్‌సీపీ సిద్దంగా ఉంది. మా కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేయడం, వారిపై దౌర్జన్యం చేయడం చేస్తున్నారు, అయినా కూడా 9న జరిగే అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాం, ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం, ఎన్నిక వాయిదా వేయకుండా జరపాలని కోరుతున్నాం. ఇంత దారుణంగా దౌర్జన్యాలు చేయడం ఎక్కడా చూడలేదు. తక్షణమే ఈసీ స్పందించాలి: వైయస్ఆర్‌సీపీ ఎస్‌సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు వెంకటగిరి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిష్పక్షపాతంగా జరపాలని మేం కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ఆర్‌సీపీ స్ధానిక సంస్ధల పదవులను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వైయస్ఆర్‌సీపీకి అధికారం ఇచ్చిన తర్వాత చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తూ స్ధానిక సంస్ధల ఉప ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు, తక్షణమే ఈసీ స్పందించి ఎన్నిక సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మేం కోరుతున్నాం.