తాడేపల్లి: రాష్ట్రంలో ఆక్వారంగాన్ని ఆదుకోవడంలో కూటమి సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని అప్సడా మాజీ వైస్ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ రైతువిభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందిస్తున్న ఆక్వాపై ఎగుమతి సుంకాల వల్ల కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ముందుచూపుతో వాటికి పరిష్కార మార్గాలను చూపాల్సిన కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో ఆక్వారైతులను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనతో ఆక్వా రైతులు చితికిపోతున్నారని ధ్వజమెత్తారు. బయట మార్కెట్‌లో ప్రతికూలత, స్థానికంగా కూటమి పెద్దల చేతుల్లో ఉన్న ఆక్వాసంస్థలతో భారీగా పెంచిన సీడ్, ఫీడ్ ధరల మోతతో ఆక్వారైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... రాష్ట్రంలో ఆక్వా రంగం కుదలైపోతుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. ఆక్వా రంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుని రైతులు అలమటిస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. కూటమి ప్రభుత్వం రాగానే వంద నుంచి రూ. 200 వరకు ఫీడు రేటు తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు రైతులు నష్టపోతున్నా పట్టించుకోవడం లేదు. నాన్ ఆక్వా జోన్ పరిధిలో కూడా యూనిట్ విద్యుత్‌ను రూ. 1.50కే ఇస్తామని చెప్పినా 10 నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఆక్వా, నాన్ ఆక్వాజోన్‌లకు విద్యుత్ సబ్సిడీ కింద ఎంత ఖర్చు చేశామో కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఆక్వా రేట్లు గణనీయంగ పడిపోతున్నాయి. వాటిని స్థిరీకరించే ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరగడం లేదు. మరోవైపు కూటమి పెద్దలే ఆక్వారంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని మార్కెట్‌ను శాసిస్తున్నారు. ఫీడ్, సీడ్ రేట్లను తమ ఇష్టం వచ్చినట్లు పెంచడం వల్ల ఆక్వారైతులు పెట్టుబడుల కోసం అప్పులు చేసి, తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు అమెరికా టారీఫ్‌ల పేరుతో మార్కెట్‌ను తగ్గించడంతో మధ్య దళారీలు రంగంలోకి దిగి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఆక్వా రైతులకు న్యాయం చేయాలి. రైతులకు మేలు జరిగే వరకు వారి పక్షాన వైయస్సార్సీపీ నిలబడి పోరాడుతుంది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో 'అప్సడా' ఏర్పాటు గతంలో వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడం జరిగింది. ఫీడ్, సీడ్, హేచరీ యాక్టులను ఒకే గొడుకు కిందకు ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను కంట్రోల్ చేశారు. కోవిడ్ సమయంలో రెండేళ్లపాటు ప్రభుత్వమే ధరలను నిర్ణయించి రైతులకు మేలు చేశారు. వంద కౌంట్ కనీస ధర రూ. 210 లుగా నిర్ణయించారు. కోవిడ్ సమయంలో ధర ఏనాడూ రూ. 240కి తగ్గలేదంటే రైతులకు ఏవిధంగా మేలు చేశారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఫీడు ధర మూడుసార్లు రేట్లు పెంచడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం కలుగజేసుకుని ఆక్వా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తగ్గించడం జరిగింది. ఆక్వారంగంలో కొత్త విధానాలు, సీడ్ తీసుకురావాలనే సంకల్పంతో నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్వా రైతులంతా చెన్నై వెళ్లి టెస్టులు చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో విశాఖ జిల్లాలోని నక్కపల్లి మండలం బంగారుగూడెంలో రూ. 30 కోట్లతో బీఎంసీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు వైయస్ జగన్ చొరవతో దిగుమతి సుంకం తగ్గింపు - నాటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ నేరుగా మాట్లాడి సోయా, ఫిష్ మీల్ పై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా ఫీడ్ ధరలు తగ్గేలా చూశారు. ఆ విధంగా గత వైయస్సార్సీపీ హయాంలో మూడు సార్లు ఫీడు ధరలు తగ్గిస్తే, దిగుమతి సుంకం తగ్గినా నేడు ఫీడు ధర రూ. 30 ల వరకు పెంచి వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. 40 ఏళ్ల అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబు ఏం చేయకపోయినా ఐదేళ్ల పాలనలోనే వైయస్ జగన్, ఆక్వా యూనివర్సిటీ, బీఎంసీ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఆక్వా రంగాన్ని పటిష్టమైన స్థితిలోకి తీసుకొచ్చారు. ధరలను 15 రోజులకు ఒకసారి నియంత్రించేలా కేబినెట్ మంత్రులతో కమిటీ వేసి పర్యవేక్షించారు. ఫిష్ ఆంధ్రా కార్యక్రమం ద్వారా స్థానికంగా మార్కెట్ పెంచుకోవాలనే ఉద్దేశంతో 18 సార్లు ఫిష్ అండ్ ఫ్రాన్స్ ఫెస్టివల్స్ నిర్వహించడం జరిగింది. దీంతో డొమిస్టిక్ మార్కెట్ బాగా వృద్ధి చెందండంలోనూ ఈ కార్యక్రమం దోహదపడింది. గతంలో మన ఆక్వా మార్కెట్‌పై దుష్ప్రచారం జరిగి ఎగుమతులన్నీ అస్సాం, నాగాలాండ్ లో రోడ్డుపైనే ఆగిపోతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడిన వైయస్ జగన్, 24 గంటల్లోనే గమ్యస్థానాలకు తరలిపోయేలా కృషి చేశారు. ఆక్వారైతులకు అండగా నిలచారు ఆక్వా రైతుల సంక్షేమం కోసం అడుగడుగునా ముందుచూపుతో ఆలోచించిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. చైనా, థాయ్‌లాండ్ నుంచి వైరస్ తో ఉన్న సీడ్ వచ్చిందని వార్తలు రావడంతో వెంటనే దాన్ని పరీక్షించి సీజ్ చేయడంతోపాటు వెంటనే రైతులకు మేలిరకమైన సీడ్ ను పంపిణీ చేయడం జరిగింది. మోనోడాన్ అనే టైగర్ సీడ్ కారణంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులు రూ. లక్షల్లో నష్టపోతే వారిని ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా ప్రభుత్వం వారికి కొత్తగా సీడ్, హేచరీ ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఇది వైయస్ జగన్ మంచి మనుసుకు నిదర్శనం. రాష్ట్రంలో రైతాంగాన్ని దగా చేస్తున్న కూటమి సర్కార్ రైతులు పడుతున్న కష్టాలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పాలన జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 10 నెలల కూటమి పాలనతో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. రైతులు అడుగడునా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎక్కడచూసినా దళారులదే రాజ్యం నడుస్తోంది. వైయస్సార్సీపీ పాలనలో ఐదేళ్లపాటు విత్తనం నుంచి అమ్మకం వరకు అడుగడుగునా రైతును చేయిపట్టి నడిపించిన ఆర్బీకే సెంటర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసింది. మిల్లర్లంతా సిండికేట్ గా ఏర్పడి రైతులని దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బుడమేరు ప్రాంతంలో మునిగిపోయిన రైతులకు, పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్రకాలువ ముంపు ప్రాంతంగా ఉన్న నాలుగైదు నియోజకవర్గాల రైతులను ప్రభుత్వం ఇంతవరకు ఆదుకోలేదు. గతంలో వైయస్సార్సీపీ హయాంలో పంట పెట్టుబడి సాయం, క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది. అన్నదాత సుఖీభవ పేరుతో ఓటేయించుకుని అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డును సందర్శించి రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం కొన్ని రోజులు హడావుడి చేసి వదిలేసింది తప్ప మిర్చి రైతులకు మేలు చేసే నిర్ణయం తీసుకోలేదు. తాజాగా వరి పంట చేతికొచ్చే సమయంలో రైస్ మిల్లర్లంతా కలిసి సిండికేట్‌గా ఏర్పడి రైతును మోసం చేస్తున్నారు. మొదటి నాలుగు రోజులు బస్తా రూ.1450 కొనుగోలు చేసి, వర్షాలే లేకపోయినా ఇప్పుడు తేమ శాతం పేరుతో రూ. వంద తగ్గించి రైతుల్ని మోసం చేస్తున్నారు.