తాడేపల్లి: కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేసిందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) (Former Minister Perni Venkatramaiah)ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ(ysrcp) కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పచ్చచొక్కాలకు జేబులు నింపే కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ(Liquor Policy)ని అమలు చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేల నుంచి మొదలు ప్రభుత్వ అధినేతల వరకు మద్యం ముడుపులతో సంపదను సృష్టించుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ పాలనలో కల్తీ మద్యం అంటూ విష ప్రచారం చేసిన కూటమి పార్టీలు ఈ పదినెలల్లో ఒక్క తప్పును కూడా ఎందుకు చూపించలేక పోయాయని నిలదీశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన మద్యం పాలసీపై ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు విషం చిమ్మాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు బూటకపు ఆరోపణలతో విపరీతమైన తప్పుడు ప్రచారం చేశారు. వైయస్ఆర్‌సీపీపై విషం చిమ్మిన కూటమి నేతలు గడిచిన పదినెలలుగా వారి ప్రభుత్వంలో అదే మద్యాన్ని విక్రయిస్తున్నారు. గ్రామాల్లోని పచ్చచొక్కా నాయకులు మొదలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధినేతలు నీతి, లజ్జ లేకుండా మద్యాన్ని పాడికుండలా మార్చుకున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఆఖరి ఏడాదిలో మరీ నీచంగా ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకు అమ్ముతోందని వారు నిస్సిగ్గుగా అబద్దాలు మాట్లాడారు. ఎల్లో మీడియా ద్వారా దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారు. ఇదే నిజమైతే వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం దిగిపోయే జూన్ 2024 నాటికి, అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోడవున్‌ల్లోని మద్యంను ఎందుకు సీజ్ చేయలేదు? కల్తీ జరిగిందన్న కూటమి పార్టీ నేతలు మద్యం శాంపిళ్ళను పరీక్షించేందుకు ఎందుకు ల్యాబ్‌లకు పంపలేదు? అదే మద్యాన్ని ఎలా షాప్‌లకు తరలించి విక్రయాలు చేశారు? అంటే గతంలో రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చేసిన తిరుపతి లడ్డూలో కల్తీ, రూ.14 లక్షల కోట్ల అప్పులు ఎలా అబద్దాలో మద్యంలో కల్తీ కూడా ఒక అబద్దమే. రాష్ట్రంలోని డిస్టలరీలన్నీ చంద్రబాబు హయాంలోనివే రాష్ట్రంలోని ఇరవై డిస్టలరీలు కూడా చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినవే. వైయస్ జగన్ గారి హయాంలో ఒక్కటి కూడా కొత్తగా ఏర్పాటు చేయలేదు. 2015-19 మధ్యలో చంద్రబాబు 16 కొత్త డిస్టలరీలను మంజూరు చేశారు. అంతకు ముందు నాలుగు డిస్టలరీలు ఉన్నాయి. కల్తీ మద్యం విక్రయిస్తున్నారంటూ చేసిన ఆరోపణల్లో భాగంగా ఒక్క డిస్టలరీపైన అయినా కూటమి ప్రభుత్వం చర్య తీసుకున్నారా? అంటే దానిలో ఎటువంటి తప్పు లేదనేదే కదా దాని అర్థం. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో ఎటువంటి తప్పు చేయలేదనేదని ప్రభుత్వమే అంగీకరిస్తోంది. ఎమ్మెల్యేకు డబ్బు కొట్టు... బెల్ట్‌షాప్ పట్టు... చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరీ నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలోని సూపర్ సిక్స్ పథకాలకు దిక్కులేదు కానీ, క్యాష్ కొట్టు, బెల్ట్ పట్టు అనే కార్యక్రమం నడుస్తోంది. వేలంలో పాట పాడు, ఎమ్మెల్యేకు డబ్బు కొట్టు, బెల్ట్ పట్టు అనే నినాదంను అమలు చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏన్నో ఏళ్ళుగా లిక్కర్ కంపెనీలకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు మారిపోయారు. దీని మతలబు రెడ్‌బుక్ సృష్టికర్తకే తెలుసు. కేరళ, బెంగుళూరు మద్యం మాత్రమే రాష్ట్రంలో అత్యధికంగా ఎందుకు అమ్ముడవుతున్నాయి? దీని వెనుక ఎవరున్నారు? ఈ సొమ్ము ఎక్కడకు చేరుతున్నాయనే వివరాలు రెడ్‌బుక్ లో ఉన్నాయి. నేడు మండువేసవిలో గుక్కెడు నీటికోసం గ్రామాలు అల్లాడుతున్నాయి. కానీ రాష్ట్రంలోని ప్రతి ఊరిలో మద్యంకు ఎక్కడా కొరత లేదు. ఫోన్ చేస్తే మద్యం ఇంటికే తీసుకువచ్చే పరిస్థితి ఉంది. ప్రతివారం వారు ఎక్కడకు వెళుతున్నారు? ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. చొక్కా పట్టుకోవడం కాదు, కనీసం ప్రశ్నించేందుకు వెడితే వారంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఆయన అదృశ్యమై, సోమవారం ఉదయం వస్తారు. కొడుకు లేడని, తండ్రి చంద్రబాబుని అడుగుదామని వెడితే శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన రాష్ట్రంలోనే ఉండరు. సోమవారం వస్తారు. ఇద్దరూ దొరకడం లేదు, ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే, నన్ను నమ్మి ఓటు వేయాలని చెప్పిన పవన్ కళ్యాణ్‌ని అడుగుదామని వెడితే కాలర్ లేని కాషాయరంగు లాల్చీలు వేసుకుని ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు వైయస్ జగన్ బెంగుళూరు వెళ్ళారంటూ ప్రతిసారీ పెద్ద పెద్ద హెడ్డింగ్‌లతో వార్తలు రాస్తుంటాయి. వైయస్ జగన్ గురించి ఇంతగా రాసేవారు రాష్ట్రంలో ప్రతివారం ముఖ్యమంత్రి చంద్రబాబు(chandra babu), డిప్యూటీ సీఎం పవన్(pawan), మంత్రి నారా లోకేష్(lokesh)లు ఏపీ వదిలి పక్క రాష్ట్రాలకు వెడుతుండటంపై మాత్రం ఒక్క అక్షరం కూడా రాయరు. పవన్‌కు మద్యం మమూళ్ళలో వాటాలు ఏపీ సీఎం చంద్రబాబు మాటలు కోటలు దాటుతుంటాయి, చర్యలు మాత్రం ఉండవు. బెల్ట్ షాప్ ఉంటే తాట తీస్తానని, షాప్ సీల్ వేయాలని హుంకరిస్తుంటారు. ఇక డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు అపరిచితుడు, మరికొన్నిసార్లు దశావతారంలా కనిపించి ఏదేదో మాట్లాడుతుంటారు. ఏపీలో ఉండరు, కేబినెట్ మీటింగ్‌లకు రారు, ప్రభుత్వ నడపడంలో తన పాత్ర ఏమిటో ప్రదర్శించరు. తెలుగుదేశం నుంచి పాతిక, యాబై పవన్ కళ్యాణ్‌కు అందుతుంటాయని అంటుంటారు. ఎంత ఇస్తున్నారో ఎర్రపుస్తక రచయితకే తెలియాలి. కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో చూస్తే మద్యం ప్రతి బడ్డీకొట్టులోనూ దొరుకుతోంది. ఇక రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి. మద్యం ఏరులై పారుతోంటే, వీరు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాప్‌ల్లో మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. మద్యం విక్రయాలకు టార్గెట్లు ఏపీలో మద్యం పాలసీ ప్రభుత్వం నిర్ధేశించిన టార్గెట్ల కంటే ముప్పై నుంచి నలబై శాతం ఎక్కువ మద్యం విక్రయించాలని మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. కోట్లు పెట్టి వ్యాపారంలోకి దిగిన మద్యం వ్యాపారులు ఈ టార్గెట్ల వల్ల వాట్సాప్ మెసేజ్‌లతోనే మద్యంను ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఇదేనా? ఏపీ ప్రభుత్వ సేవలు వాట్సాప్‌లో దొరకడం లేదు కానీ, మద్యం మాత్ర వాట్సాప్ ద్వారా దొరుకుతోంది. సంపద సృష్టి అంటే విచ్చలవిడిగా మద్యం అమ్మి, తద్వారా సొమ్మును సృష్టించే ఆలోచనతో ఉన్నారు. మద్యం మత్తులో వ్యసనపరులు సమాజంలో అశాంతికి, అరాచకానికి కారణమవుతున్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఆడపిల్లలకు రక్షణ కరువైంది, పట్టించుకునే నాథుడు లేదు. హోంమంత్రి అనిత రోజూ వైయస్ జగన్ గారిని విమర్శించడం ద్వారా తన పదవిని కాపాడుకోవడానికే పరిమితమయ్యారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఆడవారిపై అఘాయిత్యాలు చేసిన దుర్మార్గులను బెత్తంతో కొడతానని రంకెలు వేశారు. ఇది నిజమని మహిళలు నమ్మి ఆయన పార్టీకి ఓటువేశారు. తీరా కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించరు. పవన్ కళ్యాణ్ అయితే సినిమా షూట్టింగ్ లేదా, అలకపాన్పుపై ఉంటున్నారని జనసేన ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు. మద్యం మత్తులో దాడులకు తెగబడుతున్నవారిని కట్టడి చేసే యంత్రాంగం లేకుండా పోయింది. దుండగులకు భయం లేకుండా పోయింది. పోలీస్ యంత్రాంగం రెడ్‌బుక్ రాజ్యాంగం కోసం పనిచేస్తున్నారే తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదు. వైయస్ఆర్‌సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు రాష్ట్రంలో పోలీసింగ్ గాడితప్పింది. వైయస్ఆర్‌సీపీ నాయకులకు చెందిన ఫోన్‌లను ట్యాపింగ్ చేస్తున్నారు. విజయవాడలో దానికోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు. వైయస్ జగన్, పార్టీ నాయకులు ఫోన్‌లలో ఏం మాట్లాడుతున్నారో రహస్యంగా వింటున్నారు. ఎలా తప్పుడు కేసులు పెట్టాలా అని ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా పోస్ట్‌లపై లెక్కకు మించి వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపైన అఘాయిత్యాలు, సామాన్యులపైన హత్యాకాండ జరుగుతుంటే పోలీసులు చేష్టలూడి చూస్తున్నారు. రెండొందల మంది పోలీస్ బందోబస్త్ పెడితే గానీ డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ చిన్న అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించలేని పరిస్తితి ఉంది. దీనిని బట్టి ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బ్రాందీ షాప్‌ల నుంచి పోలీస్ స్టేషన్‌కు నెలకు రూ.60 వేలు మామూళ్ళు ఇవ్వాలని ఒత్తిడి చేసి మరీ వసూళ్ళకు పాల్పడుతున్నారు. తాము ఎమ్మెల్యేకు లక్షలకు లక్షలు ఇచ్చి పోస్టింగ్‌లు తెచ్చుకున్నామని, అందుకే టార్గెట్ పెట్టి మద్యం దుకాణాలు, బార్ల నుంచి వసూలు చేస్తున్నామని వారు చెబుతున్నారు. ప్రతి పోస్టింగ్‌కు స్థానిక ఎమ్మెల్యేలకు లక్షలు ముట్టచెప్పాల్సి వస్తోందని ఉద్యోగులు, అధికారులు వాపోతున్నారు. ప్రతిజిల్లాలోనూ వారిదే మద్యం దందా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఒక మంత్రి తన జిల్లాలోని అన్ని మద్యంషాప్‌లు కలిసి ఏడాదికి రూ.2.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి మరీ తీసుకున్నారు. ఈ మద్యం దుకాణాలు తమకు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకోవచ్చని, పోలీసులు, ఎక్సైజ్ నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో ఒక ఎమ్మెల్యేకు నెలకు ఒక షాప్ నుంచి రూ.50,000 చొప్పున ఇవ్వాలి. మరో మాజీ మంత్రి కూడా నెలవారీ మామూళ్ళపై మంతనాలు సాగిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రాయశ్చిత్త దీక్షలు చేసే వారు కూడా మద్యం దుకాణాల నుంచి నెలకు రూ.30వేలు మామూళ్ళు వసూలు చేసుకుంటున్నారు. మరో ఎమ్మెల్యే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాప్‌లు తనే నిర్వహిస్తానని తీసుకున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలు నయాపైసా పెట్టుబడి లేకుండా 25 శాతం మద్యం దుకాణాల్లో వాటా తీసుకున్నారు. అలాగే పశ్చిమ గోదావరిజిల్లాలోని ఒక ఎమ్మెల్యే తన పరిధిలోని మద్యం దుకాణాలు ఎక్కువ రేట్లకు మద్యం అమ్ముకునేందుకు గానూ ఏడాదికి రూ.2.30 కోట్లు ముడుపులు అందుకున్నారు. అదే ప్రాంతంలో తీయ్యగా మాటలు చెప్పే మంత్రిగారు మద్యందుకాణాల నుంచి ఇరవై శాతం వాటాను పక్క నియోజకవర్గంలోని ఒక సర్పంచ్ పేరు మీద రాయించుకుని, ఆ సొమ్ము తన జేబులో వేసుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఒక నగరంలో ఘనమైన ఎమ్మెల్యే తనకు మంత్రిపదవి వస్తుందని ఆశించి, పదవి రాకపోవడంతో తన నియోజకవర్గంలోని బార్లు, మద్యం దుకాణాల నుంచి వన్‌టైం సెటిల్‌మెంట్ కింద బార్‌కు, షాప్‌కు రూ.10 లక్షలు చొప్పున వసూలు చేసుకున్నారు. మద్యం సీసాపై ఎమ్మార్పీ కన్నా ఎమ్మెల్యేలు అమ్మించే రేటు ఒకటి, బెల్ట్ షాప్‌లలో విక్రయించే రేటు మరొకటి. సరసమైన రేట్లకు, నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎక్కవ రేట్లకు మద్యాన్ని ప్రజలకు అంటగడుతున్నారు. నిజంగా రూ.99 మద్యం గతిలేక తాగుతున్నారు. ఈ మద్యం తాగిన వారు ఈ ప్రభుత్వాన్ని ఎంతగా దూషిస్తున్నారో తెలుసుకోండి. తక్కవ ధరకే మద్యం విక్రయిస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ రోజు ఏ ప్రజలకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కంటే తక్కువకు ఇస్తున్నారో చెప్పాలి. కూటమి ప్రభుత్వ పాపాలను ప్రజలు గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వ పాపాలను ప్రజలు చూస్తున్నారు. వాసుదేవరెడ్డి అనే అధికారి సీఐడీ అధికారులు తనను శారీరకంగా హింసిస్తున్నారని మూడ సార్లు హైకోర్ట్‌లో పిటీషన్‌లు వేశారు. కోర్ట్‌కు మిధున్ రెడ్డిని ముద్దాయిగా పరిగణించడం లేదని సీఐడీ కోర్ట్ కు విన్నవించింది. అయితే ఎల్లో మీడియాలో మాత్రం ఎంపీ మిధున్‌రెడ్డి లిక్కర్ స్కాంలో ముద్దాయి అంటూ రాస్తున్నారు. ఇదీ ఈ ప్రభుత్వ దుర్మార్గం.