తాడేపల్లి: వైయస్ఆర్ లా నేస్తం పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా మెడిక్లెయిం కాని, ఇతరత్రా అవసరాలకు రుణాలు కావొచ్చు… ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగిందన్నారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిచిందని, ప్రభుత్వం తరఫునుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటే..జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం పేదలపట్ల చూపిస్తారన్న విశ్వాసం . ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గరనుంచి ఆశిస్తున్నానని చెప్పారు. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని సీఎం వైయస్ జగన్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైయస్ఆర్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేశారు. అంతకుముందు వర్చువల్‌గా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే....: దేవుడి దయతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏడాదికి సంబంధించి ఈ దఫా దాదాపుగా 2,677 మంది అడ్వకేట్ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు మంచి చేస్తూ రూ.6,12,65,000 వారి అకౌంట్ల్ జమ చేస్తున్నాం. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు తోడుగా... ఇది ఒక మంచి ఆలోచన, మంచి కార్యక్రమం. న్యాయవాదులు లా కోర్సు పూర్తిచేసిన, మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే చదువులు పూర్తి అయి, కోర్టుల్లో అడుగుపెడుతున్న పరిస్థితుల్లో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు, వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెలా రూ.5వేలు, ఏడాదిలో రూ.60వేలు ఇస్తున్నాం. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80లక్షలు ఇస్తున్నాం. దీనివల్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారు.ఇబ్బంది పడకుండా జీవితంలో ముందుకు వెళ్తారు అన్న మంచి ఆలోచనతో ఈ పథకం ప్రారంభించాం. 4 ఏళ్లలో 5,781 మందికి రూ.41.52 కోట్లు సాయం. ఇప్పటివరకూ 5,781 మంది జూనియర్ న్యాయవాదులకి మేలు చేశాం. 2019 నవంబరులో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నాలుగేళ్లలో ప్రతి నెలా రూ.5వేల చొప్పున ఇస్తూ.. ఇంతవరకూ మొత్తంగా రూ. 41.52 కోట్లు జూనియర్ లాయర్లకు ఇచ్చాం. రూ.100 కోట్లతో వెల్ఫేర్ ట్రస్టు... ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. ఇదొక్కటే కాకుండా అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్టును ఏర్పాటు చేశాం. మెడిక్లెయిం కాని, న్యాయవాదుల అవసరాలకు రుణాలు వంటివాటికి, ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగింది. ఈ రెండు కార్యక్రమాల ద్వారా నాలుగేళ్ల కాలంలో అడ్వకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా తోడుగా ఉందనే సంకేతం వెళ్లింది. పేదల పట్ల మమకారం చూపండి. ఇంత మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటే. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరికీ కూడా దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం వీళ్లు పేదలపట్ల చూపిస్తారని ఒక విశ్వాసం. ప్రభుత్వం తరపు నుంచి ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గరనుంచి నేను ఆశిస్తున్నది ఇదే. దేవుడి దయ వల్ల మంచి జరుగుతుంది. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరుతున్నాను. ఈ మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ అయ్యేటట్టుగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి డిసెంబరు నాటికి ఆరునెలలు అవుతుంది. 6 నెలలకు ఒకేసారి మొత్తంగా రూ.30వేలు వస్తే.. ఇంగా బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో క్రితంసారి మార్పు చేశాం. మరలా డిసెంబరులో ఈ ఏడాదికి సంబంధించిన రెండో దఫా కార్యక్రమం జరుగుతుంది. వీటన్నింటివల్లా న్యాయవాదులకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.