విశాఖపట్నం: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి పేరును చూసి కూటమి సర్కార్ కలవరపడుతోందని వైయస్‌ఆర్‌సీపీ విశాఖజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైయస్‌ఆర్ పేరు లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా వైయస్‌ఆర్ పేరు ఎక్కడ ఉంటే, అక్కడ దానిని తొలగిస్తున్నారని, ప్రజల గుండెల్లో ఉన్న మహానేత పేరును చెరిపేయగలరా అని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలి, వైయస్‌ఆర్ అనే బ్రాండ్ కనిపించకుండా చేయాలన్న కుతంత్రమే కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే నాగార్జున యూనివర్సిటీలో ఉన్న వైయస్‌ఆర్ విగ్రహాన్ని నేలమట్టం చేశారు. బాపట్ల జిల్లా వేమూరులో వైయస్‌ఆర్ విగ్రహానికి నిప్పంటించారు. చివరికి అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి ఉన్న వైయస్‌ఆర్ పేరును తొలగించారు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి వైయస్‌ఆర్ పేరును తీసేశారు. వైయస్ జగన్ సీఎంగా ఉండగా సీతకొండను అభివృద్ధి చేసి వైయస్‌ఆర్ వ్యూ పాయింట్ పెడితే అధికారంలోకి వచ్చిన వెంటనే అత్యంత దుర్మార్గంగా దాన్ని కూడా తొలగించారు. వైయస్‌ఆర్ జిల్లా పేరును మార్చారు. రైతుల పక్షపాతిగా గుర్తింపు పొందిన వైయస్‌ఆర్ పేరును రైతు భరోసా కేంద్రాలకు పెడితే, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. చివరికి విజయవాడ సమీపంలోని తాడిగడప మున్సిపాలిటీకి వున్న వైయస్‌ఆర్ పేరును కూడా తీసేశారు. ప్రజల్లో చిరస్మరణీయుడు వైయస్‌ఆర్ వైయస్ జగన్ సీఎంగా ఉండగా విజయవాడ నడిబొడ్డున 150 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియం నిర్మిస్తే దానిపైనా వైయస్ జగన్ పేరును తీసేశారు. అయితే కూటమి నాయకులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. గోడల మీద వైయస్‌ఆర్ పేరును తొలగించగలరేమో కానీ, ప్రజల హృదయాల్లో ఆయనకున్న స్థానాన్ని తొలగించలేరు. ఆయన చేసిన మంచిని ప్రజల మనస్సుల నుంచి చెరిపేయలేరు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన దివంగత వైయస్‌ఆర్ లక్షల మంది పేదలకు వెన్నుదన్నుగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపించారు. వైయస్‌ఆర్ పేరు కనపడితేనే ఓర్చుకోలేకపోతున్న చంద్రబాబు, గతంలో మూడుసార్లు సీఎంగా పనిచేసి కూడా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టలేకపోయాడు. వైయస్ జగన్ సీఎం అయ్యాకనే ఆ పనిచేసి ఎన్టీఆర్‌కు సమున్నత గౌరవం కల్పించారు. ప్రభుత్వం ఇలాగే ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. స్టేడియంకు వైయస్‌ఆర్ పేరు తొలగించడంపై నిరసన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ వీడీసీఏ క్రికెట్ స్టేడియానికి వైయస్ఆర్ పేరును ప్రభుత్వం పెట్టలేదు. వైయస్‌ఆర్ మరణం అనంతరం ఆనాడు స్టేడియం చైర్మన్ గా ఉన్న గోకరాజు గంగరాజు నేతృత్వంలో కమిటీ నిర్ణయం తీసుకున్నారు. అక్కడే దివంగత వైయస్ఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ స్టేడియంకు ఉన్న వైయస్‌ఆర్ పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా వైయస్‌ఆర్ సీపీ శ్రేణులతో ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు స్టేడియం వద్ద ఉన్న వైయస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం, అనంతరం నిరసస కార్యక్రమం చేపడుతున్నాం. కుట్రపూరితంగా వైయస్ఆర్ పేరు తొలగింపుపై కూటమి ప్రభుత్వం, ఏసీఏ సమాధానం చెప్పాలి. త్వరలో ఇదే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయన్న విషయాన్ని గుర్తెరిగి ఇప్పటికైనా పేరు మార్పుపై ప్రభుత్వం, ఏసీఏ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వైయస్‌ఆర్ పేరును కొనసాగించాలి.