తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నిర్వాకం వల్లే గ్రహణం పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ఉన్న శ్రద్దలో ఆవగింజంతైనా రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్‌లపై లేదని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... విభజన చట్టం కింద ఏపీకి హక్కుగా రావాల్సి ఉన్న 101 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు వైయస్ జగన్ గారు ముందుచూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్‌తో సీమ రైతుల సాగునీటి కష్టాలు తీరిపోతాయని సంతోషిస్తున్న తరుణంలో చంద్రబాబు ప్రారంభం నుంచి ఈ ప్రాజెక్ట్‌కు మోకాలడ్డుతూ వచ్చాడు. తెలంగాణ టీడీపీ నాయకులతో ఎన్టీటీలో ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా కేసులు వేయించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులను అడ్డుకునేందుకు శాయశక్తులా పనిచేశారు. శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను వైయస్ జగన్ రాయలసీమకు తీసుకువెడుతున్నారంటూ రేవంత్‌రెడ్డి గతంలో అనేకసార్లు ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని 798 అడుగుల ఎత్తు నుంచే తోడేసి డ్యాంను పూర్తిగా ఖాళీ చేస్తుంటే సీఎంగా ఉండి చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. రాయలసీమ మీద చంద్రబాబు చూపుతున్న సవతితల్లి ప్రేమకు ఇదే నిదర్శనం. రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీటిని తెచ్చుకునే హక్కును పోగొట్టుకునేలా గతంలోనూ ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే నిమ్మకునీరెత్తినట్లు చంద్రబాబు వ్యవహరించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపైనా నోరు మెదపలేదు. ఎన్జీటీని ఆదేశాలను బేఖాతర్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంటే చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. చేతులెత్తేశారా? లేక రేవంత్‌తో చేతులు కలిపారా? చంద్రబాబు తీరు చూస్తుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు వ్యతిరేకంగా ఎన్జీటీలో దాఖలైన కేసుపై వాదనలు వినిపించలేక చేతులెత్తేశారా? లేక రేవంత్‌తో చేతులు కలిపారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దాదాపు 50 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ వాదనలు ఎన్జీటీ తిరస్కరించిందంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమే. అధికారంలోకి వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై వ్యయం చేయడం దండగని చెప్పడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వల్లమాలిన ప్రేమ చూపించడం చంద్రబాబు నైజం. రైతులకు నీరివ్వకుండా చంద్రబాబు సంపద ఎలా సృష్టిస్తారో చెప్పాలి. అప్పులు తెచ్చి అమరావతి నిర్మాణంపై పెడుతున్న శ్రద్ద రాయలసీమ ప్రాజెక్టులపై చూపించడం లేదు. అమరావతి ప్రజలు మాత్రమే అధికారం ఇచ్చారనుకుంటున్నారేమో.. మా ప్రాంతంపై చంద్రబాబు వివక్ష చూపిస్తున్నారు. రాయలసీమ ప్రజలను మోసగించి ఎన్నాళ్లూ రాజకీయం చేస్తారో చూస్తాం. అమరావతికి నిధులు పారించాలని ఆలోచన చేస్తున్నారే కానీ, రాయలసీమకు నీరు పారించాలన్న ఆలోచన చంద్రబాబుకి లేదు. అమరావతి నిర్మాణం కోసం కేవలం ఆరు కంపెనీలకు రూ. 10 వేల కోట్ల పనులు కట్టబెట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో చంద్రబాబు షెల్ కంపెనీలకు కమీషన్లు మళ్లించుకుంటున్నారు. వైయస్ జగన్ తీసుకొచ్చిన జ్యుడిషియల్ రివ్యూను కూడా తీసేశారు. పోలవరంను బ్యారేజీగా మార్చేశారు పోలవరం ఎత్తును తగ్గిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇవ్వడం ద్వారా పోలవరం ప్రాజెక్టును కేవలం బ్యారేజీగా మార్చేశారు. గతంలో ఇదే చంద్రబాబు, పోలవరం పూర్తయితే 80 టీఎంసీల లైవ్ స్టోరేజ్ కృష్ణా బేసిన్‌కి తరలించి ఎగువ ప్రాంతాలైన రాయలసీమకు 40 టీఎంసీలు ఇస్తామని 2014-19 మధ్య పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయిన సందర్భంగా చెప్పారు. కానీ నేడు పోలవరం ఎత్తు తగ్గిస్తున్న కారణంగా 80 టీఎంసీల లైవ్ స్టోరేజ్ ను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇది రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హంద్రీనీవా ప్రాజెక్టును దివంగత వైయస్ఆర్ 40 టీఎంసీలతో తీసుకొస్తే, మాజీ సీఎం వైయస్ జగన్ రాయలసీమ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో 23 టీఎంసీలు పెంచాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఆ మేరకు మాల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువలను వెడల్పు, లైనింగ్ పనులు, పంప్‌హౌస్‌ల నిర్మాణం చేసి ప్రాజెక్టు కెపాసిటీని 63 టీఎంసీలుకు పెంచారు. చివరనున్న చిత్తూరు జిల్లాకు నీరందించేందకు గాలేరు-నగరికి 56వ కి.మీ. నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 79వ కి.మీ. వరకు రూ.3 వేల కోట్లతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మొదలుపెట్టి దాదాపు రూ. 1500 కోట్లు ఖర్చు చేశారు. దీనిద్వారా చిత్తూరు జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి, చక్రాయపేట ప్రాంతాలకు నేరుగా 20 టీఎంసీలు తీసుకెళ్లే సౌలభ్యం వైయస్ జగన్ కల్పించారు. దీనిద్వారా రాయలసీమలోని 6 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు 700 చెరువులకు కొత్తగా ఏర్పడిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు అన్నింటికీ నీరందించే విధంగా ప్రణాళిక రూపొందించారు. వృథాగా సముద్రంలో కలిసే నీటిని గాలేరు-నగరి నుంచి అతి సులభంగా గండికోటకు నీరు తరలించే కార్యక్రమానికి వైయస్ జగన్ శ్రీకారం చుడితే, ఆయనకు మంచి పేరొస్తుందనే కక్షతో చంద్రబాబు సీఎం అయ్యాక వాటిని పక్కనపెట్టారు. దీనివల్ల రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిసి కూడా దుర్మార్గంగా పనులు ఆపేశారు. అదనంగా వచ్చే 23 టీఎంసీల నీటిని రాయలసీమకు రాకుండా అడ్డుకున్నారు. కక్షపూరితంగా చంద్రబాబు తీసుకున్న ఈ అనాలోచిత, అహంకారపూరిత నిర్ణయం కారణంగా డోన్ నియోజకవర్గంలోని 63 చెరువులకు, జీడిపల్లి నుంచి బీటీపీకి 114 చెరువులకు, అదేవిధంగా పుట్టపుర్తి నియోజకవర్గంలోని 119 చెరువులకు నీటిని తరలించే అవకాశం లేకుండా పోయింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టులన్నీ ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై రాయలసీమ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.