తాడేపల్లి: తెలుగుదేశం నేతల డైరెక్షన్‌లోనే మాజీ మంత్రి కొడాలి నానిపై ఎల్లో మీడియా 'ఈనాడు' దినపత్రిక తప్పుడు ఆరోపణలతో అబద్దపు కథనాలను ప్రచురిస్తోందని గుడివాడ నియోజకవర్గ నేతలు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గుడివాడ నియోజకవర్గ నేతలు పెయ్యల ఆదాం, మట్టా జాన్‌విక్టర్, కోటపల్లి నాగు, వెంపటి సైమాన్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ.. మల్లాయపాలెం జగనన్న కాలనీలో మెరక పనుల్లో వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయల అవినీతికి కొడాలి నాని పాల్పడ్డారంటూ పచ్చి అబద్దాలను ఈనాడు పత్రికలో అచ్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరక కోసం జరిగిన పనులకు గత ప్రభుత్వం చెల్లించిందే మొత్తం రూ.41 కోట్లు అయితే, రూ.వంద నుంచి రెండు వందల కోట్ల అవినీతి ఎలా సాధ్యపడిందో ఈనాడు వివరించాలని డిమాండ్ చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో గుడివాడ నియోజకవర్గంను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు కొడాలి నాని కృషి చేశారని అన్నారు. దీనిలో భాగంగానే గుడివాడ మండలం మల్లాయపాలెంలో ఏకంగా 178 ఎకరాలను ఎకరం రూ.52 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి, పేదలకు ఇళ్ళస్థలాలుగా ఇప్పించారని గుర్తు చేశారు. ఈ భూములను మెరక చేసేందుకు ఆనాడు ప్రభుత్వపరంగా పంచాయతీరాజ్, ఎన్ఆర్‌జీఎస్, హౌసింగ్ డీఈలు, జిల్లా కలెక్టర్ బృందం మొత్తం రూ.47 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసిందని తెలిపారు. ఈ మేరకు మెరక పనులు పూర్తయిన తరువాత ప్రభుత్వం చెల్లించింది రూ.41 కోట్లు మాత్రమేనని అన్నారు. దీనిలో రూ.వందల కోట్లు అప్పటి మాజీ మంత్రి కొడాలి నాని స్వాహా చేశారని నిస్సిగ్గుగా ఈనాడు పత్రిక తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుడివాడలో ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, ఆటోనగర్ ఫ్లైఓవర్, పదమూడు వేల మందికి ఇళ్ళస్థలాలు ఇలా అనేక అభివృద్ది కార్యక్రమాలకు కొడాలి నాని శ్రీకారం చుట్టారని అన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను ఆయన పెద్ద ఎత్తున ప్రశ్నించడంతో జీర్ణించుకోలేని తెలుగుదేశం ఈ రోజు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొడాలి నానిపై తప్పుడు కేసులు బనాయించి, వేధింపులకు పాల్పడేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే ఈ రోజు ఎల్లో మీడియాలో ఇటువంటి అవాస్తవాలతో కూడిన కథనాలను ప్రచురింప చేస్తోందని మండిపడ్డారు.